Nov 02,2023 21:37

ప్రజాశక్తి - భీమవరం
కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి రాష్ట్రాన్ని, దేశ ప్రజలను చేస్తున్న మోసాన్ని ప్రజలు తిప్పికొట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం పిలుపునిచ్చారు. గురువారం స్థానిక సుందరయ్య భవనంలో సిపిఎం ప్రజా రక్షణ భేరి వాల్‌ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీన విజయవాడలో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించకుండా ప్రజలపై నిరంతరం భారాలు వేస్తోందని విమర్శించారు. ప్రజల మధ్య మత ఘర్షణలు, మత చిచ్చులు పెడుతున్నారని విమర్శించారు. రాష్ట్రానికి తొమ్మిదేళ్లు గా తీరని అన్యాయం చేస్తోందన్నారు. రైల్వేజోన్‌, ప్రత్యేక హోదా, నిధులు, పోలవరం పూర్తికి నిధులు ఇవ్వకుండా అన్యాయం చేస్తూ పోలవరం నిర్వాసితులను గాలికొదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల అప్పులను మాఫీ చేయలేని బిజెపి ప్రభుత్వం దేశంలో బడా కార్పొరేట్లకు మాత్రం అప్పులు మాఫీ చేయడం దారుణమన్నారు. దేశంలో ఇప్పటికే నిరుద్యోగం మరింత పెరిగిందని, అందుకు మోడీ సిగ్గుపడాలని తెలిపారు. అవినీతి బిజెపిని గద్దె దించాలన్నారు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలు, ప్రజలు, ప్రజా సంఘాలపై నిర్బంధాలు ప్రయోగిస్తోందని తెలిపారు. బిజెపి, వైసిపి ప్రభుత్వాల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ప్రజలందరూ పోరాడాలని కోరారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయం చూపేందుకు ఈ నెల 15వ తేదీన విజయవాడలో జరగనున్న ప్రజా ప్రదర్శన, ర్యాలీ, బహిరంగ సభను జయప్రదం చేయాలని, ప్రజలందరూ హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జెఎన్‌వి.గోపాలన్‌, బి.వాసుదేవరావు, డి.కళ్యాణి, పివి.ప్రతాప్‌, జిల్లా కమిటీ సభ్యులు కె.రాజా రామ్మోహన్‌ రారు, ఎ.అజయకుమారి పాల్గొన్నారు.
ఆచంట : ఈ నెల 15న విజయవాడలో జరిగే ప్రజా రక్షణ భేరి యాత్రకు పెద్ద ఎత్తున ప్రజలంతా తరలిరావాలని సిపిఎం మండల కమిటీ సభ్యులు వద్దిపర్తి అంజిబాబు పిలుపునిచ్చారు. సిపిఎం ప్రజా రక్షణ భేరి యాత్రను జయప్రదం చేయాలని కోరుతూ గురువారం వల్లూరులో సిపిఎం ఆధ్వర్యంలో కర పత్రాలను పంపిణీ చేశారు. అంజిబాబు మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీన ఉదయం 10 గంటలకు మార్టేరు సెంటర్లో రాష్ట్ర జాతా ప్రవేశిస్తుందని, ఈ జాతాలో మండలంలోని సిపిఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు తలుపూరి బుల్లబ్బాయి, బొర్రా ధర్మారావు, సుబ్బారావు, తిరుపతిరావు, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
తణుకు రూరల్‌ : బిజెపి ఐక్యంగా ఉన్న ప్రజల మధ్య విధ్వేషాలు రెచ్చగొడుతోందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పివి.ప్రతాప్‌ అన్నారు. గురువారం పార్టీ సభ్యులు సానుభూతిపరుల జనరల్‌ బాడీ సమావేశం వేల్పూరులో ప్రజాసంఘాల భవనంలో వాసా వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ప్రతాప్‌ మాట్లాడారు. బిజెపి విశాఖ ఉక్కును తెగ నమ్మడానికి పూనుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. సిపిఎం గ్రామ కార్యదర్శి బళ్ల చిన వీరభద్రరావు మాట్లాడారు. ఈ నెల 15వ తేదీన విజయవాడలో సిపిఎం తలపెట్టిన బహిరంగ సభ విజయవంతం చేయాలన్నారు. అనంతరం సిపిఎం ప్రజా ప్రణాళిక కరపత్రాలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ గ్రామ కార్యదర్శి బళ్ల చిన వీరభద్రరావు, వాసా వెంకటేశ్వరరావు, విశ్వనాథం సుబ్బారావు, కరేళ్ల అర్జున్‌ పాల్గొన్నారు.