Apr 09,2021 06:38

   ప్రాచీన కాలంలో బ్రాహ్మణులకు నేరుగా ఏ అధికారమూ వుండకపోయినా, మొత్తం పెత్తనం అంతా వారే చెలాయించారు. ఆ విధంగానే, ఆర్‌ఎస్‌ఎస్‌ కేవలం ఒక సాంస్కృతిక సంస్థగానే తన అవతారాన్ని కొనసాగిస్తూ తెర వెనక నుండి తన ఎజండాని అమలు జరిపించడానికి తగిన వ్యూహాన్ని రచించింది. ఆ వ్యూహం ఫలిస్తే ఏ పార్టీ అధికారంలో ఉన్నా పెద్ద తేడా ఉండదు. తెర వెనుక ఉండే శాశ్వత ప్రభుత్వంగా ఆర్‌ఎస్‌ఎస్‌ ఉంటుంది.

ఒకవేళ బిజెపి గనుక రాజకీయంగా ప్రజలలో తన పలుకుబడి కోల్పోయి 2024 ఎన్నికలలో ఓడిపోతే... అప్పుడు కూడా దేశంలోని వ్యవస్థలపై తన ఆధిపత్యాన్ని కొనసాగించే దిశగా ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యూహం రూపొందింది.

  నోమ్‌ చామ్‌స్కీ ఈ శతాబ్దపు మేధావుల్లో, విమర్శకులలో ప్రముఖుడు. ఆయన అమెరికా గురించి మాట్లాడుతూ ''అమెరికాలో ఉన్నది కార్పొరేట్‌ ప్రజాస్వామ్యం'' అన్నారు. అక్కడ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అది కార్పొరేట్‌ రంగం నిర్ణయించిన ఎజండానే విధిగా అమలు చేస్తుంది. తాజాగా జరిగిన ఎన్నికలలో అక్కడ అధికారం రిపబ్లికన్ల చేతుల్లోనుండి డెమాక్రాట్ల చేతుల్లోకి మారింది. అయితే దానివలన అమెరికన్‌ పాలసీలు మాత్రం ఏమీ మారలేదు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సిరియా మీద బాంబు దాడి చేయడానికి అతడి సోషల్‌ డెమోక్రసీ విశ్వాసాలు ఏమాత్రమూ అడ్డు రాలేదు.
   యూరప్‌లో ప్రజాస్వామ్యం ఇంకా నేరుగా, బాహాటంగా అణచివేయబడుతోంది అంటున్నారు చామ్‌స్కీ. ''ఎవరి చేతా ఎన్నుకోబడని ఒక త్రయం చేతుల్లోనే సమస్త నిర్ణయాధికారాలూ కేంద్రీకరించబడివున్నాయి. అవి యూరోపియన్‌ కమిషన్‌, ఐఎంఎఫ్‌, యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌. ఈ మూడింటినీ ఎవరూ ఎక్కడా ఎన్నుకోనేలేదు. కాని వాళ్ళే అన్ని నిర్ణయాలనూ చేస్తూంటారు.''
   అంటే దేశంలో రాజకీయ పార్టీలు ఎన్ని వున్నా, వాటి మధ్య ఎన్ని విభేదాలు, వైరాలు వున్నా ఆ తేడాలను అధిగమించి కార్పొరేట్‌ నమూనా పరిపాలన, కార్పొరేట్‌ నమూనా వృద్ధి కొనసాగుతూ వుంటాయి.
   ఒకసారి రాజకీయ భిన్నాభిప్రాయాలు, సైద్ధాం తిక విభేదాలు, సాంస్కృతిక భిన్నత్వం వంటి అంశా లను గనుక పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహ రించడం మొదలైతే ఇక ఆ తర్వాత ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. ''స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా'' ఎన్నికలు జరిగే వ్యవస్థ మనకు ఉందని ఎంత చెప్పుకున్నా ప్రయోజనం లేదు.
   ప్రస్తుతం భారత దేశంలో కూడా ఇటువంటి పరిస్థితే తయారౌతోంది. జర్మనీలో ఒకప్పుడు నడిచిన ఫాసిస్టు పాలన తరహాలో-అంటే ప్రతిపక్ష పార్టీలను ఉనికిలో లేకుండా చేయడం, ఎన్నికలు లేకుండా చేయడం వంటి నియంతృత్వ విధానాలను అమలు చేయడం- ఇక్కడ ఉండకపోవచ్చును. ఇక్కడ రాజ్యాంగం ఉనికిలో ఉన్నా, ప్రతిపక్షాలు ఉన్నా, ఎన్నికలు జరుగుతున్నా నియంతృత్వ పాలన దిశగా పరిణామాలు వేగంగా సాగుతున్నాయి.
   మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌కు చెందిన కమల్‌నాథ్‌ ఉన్న కాలంలో ''రాష్ట్రం లోని సీనియర్‌ ఐఎఎస్‌ అధికారులెవరూ తమ సీనియర్‌ నేత, ముఖ్యమంత్రి అయిన కమల్‌నాథ్‌ ఆదేశాలను పాటించడం లేద''ంటూ అప్పటి కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఒక సంచలన వ్యాఖ్య చేశారు. వ్యవస్థలను ఆర్‌ఎస్‌ఎస్‌ తన స్వాధీనం చేసుకుంటోందని అంటూ దీనినేవిధంగా ఎదిరించి పోరాడాలి? అని ప్రశ్నించారు రాహుల్‌.
   ఇటీవల దేశ రాజకీయాలలో జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తే ఆర్‌ఎస్‌ఎస్‌ తాలూకు సామాజిక, వ్యవస్థాగత ఆధిపత్యం, బిజెపి కున్న రాజకీయ ప్రాబల్య పరిధిని కూడా దాటి ఇంకా విస్తరిస్తోందని గమనించవచ్చు. ఒకవేళ బిజెపి గనుక రాజకీయంగా ప్రజలలో తన పలుకుబడి కోల్పోయి 2024 ఎన్నికలలో ఓడిపోతే అప్పుడు కూడా దేశంలోని వ్యవస్థలపై తన ఆధిపత్యాన్ని కొనసాగించే దిశగా ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యూహం రూపొందింది.
   ప్రభుత్వ అధికార యంత్రాంగం నిరంతరం కొనసాగే ప్రభుత్వ వ్యవస్థగా పరిగణించబడుతోంది. ఇందులో ప్రవేశానికి యుపిఎస్‌సి ద్వారా జరిగే ఎంపిక ప్రక్రియ ఉంది. కాని దానికి తోడు ఇప్పుడు ''ఆయా రంగాలలో ప్రత్యేక నిపుణులు'' అన్న పేరుతో కొందరిని నేరుగా నియమిస్తున్నారు. ఇటువంటి నియామకాల్లో ఎటువంటి రిజర్వేషన్ల విధానాన్నీ అనుసరించడంలేదు. ఇలా అడ్డదోవన ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నత స్థానాల్లో ప్రవేశిస్తున్న వారి నేపథ్యం, వారి సైద్ధాంతిక దృక్పథం ఏమిటి?
   ఇంకోవైపు ఆర్‌ఎస్‌ఎస్‌ ఎజండా ఒక్క బిజెపికే పరిమితం కాలేదు. మధ్యప్రదేశ్‌ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ గోరక్షణ శాలల నిర్మాణానికి తాను కట్టుబడివున్నట్టు ప్రకటించింది. అంతే కాదు. ఆ హామీని తన ఎన్నికల మానిఫెస్టోలో చేర్చింది. ఈ మధ్య కాంగ్రెస్‌ కు చెందిన నేషనల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ (ఎన్‌ఎస్‌యుఐ) అయోధ్యలో రామమందిర నిర్మాణానికి నిధులు వసూలు చేసే క్యాంపెయిన్‌ చేపట్టింది.
   హిందూమత అస్థిత్వ వాదాన్ని స్వీకరించడం మన దేశ రాజకీయాలలో ఇటీవల అందరికీ పరిపాటి అయిపోయింది. ఆ క్రమంలో మైనారిటీలకు దూరంగా, వారి కార్యకలాపాలను పట్టించుకోకుండా వ్యవహరించడం కొత్త ''వ్యవహార జ్ఞానం'' గా మారింది. 2019-20లో ఢిల్లీ లోని షహీన్‌బాగ్‌ లో నెలల తరబడి నిరసన కార్యక్రమాలు జరిగాయి. కాని ఆ ప్రాంతానికి వెళ్ళడానికి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తిరస్కరించారు. అయితే అసెంబ్లీ ఎన్నికలు మర్నాడు జరుగుతాయనగా హనుమాన్‌ చాలీసా పఠించాడు.
   ఇప్పటి పరిస్థితుల్లో మోడీకి బదులు కేజ్రీవాల్‌ ప్రధాని అయితే అందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ కి అభ్యంతరం ఏముంటుంది? (తన వరకూ ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రధాని కావాలని ఆర్‌ఎస్‌ఎస్‌ కోరుకుంటుంది. ప్రాచీన హిందూ రాజ్యం అనే భావన ఆర్‌ఎస్‌ఎస్‌ కి ఉంది. ఆ భావన ప్రకారం దేశాన్ని పాలించేవాడు హిందూ యోగి అయివుండాలి. క్షత్రియ కులంలో జన్మించి వుండాలి (ఆ కొలబద్దకు యోగి ఆదిత్యనాథ్‌ సరిగ్గా సరిపోతాడు). పైగా చాలా ప్రాంతీయ పార్టీలకు గాని, కాంగ్రెస్‌ లోని ఎక్కువ సెక్షన్లకు గాని ఆర్‌ఎస్‌ఎస్‌ ఆధిపత్య భావజాలంతో ఎటువంటి తగువూ లేదు.
   ఈ నమూనాలో రాజకీయ పార్టీల నడుమ ఉన్న విభేదాలు ఉనికిని కోల్పోతాయి. ఇక మిగిలింది ఆర్థిక విధానాలు. ప్రస్తుత రాజకీయ పార్టీలలో అత్యధిక పార్టీలు నయా ఉదారవాద నమూనాను సమర్ధిస్తున్నాయి. సంక్షేమానికి ఎంత పాలు ఖర్చు చేయాలన్న అంశం మీద చిన్న చిన్న తేడాలు తప్ప పెద్దగా భేదాభిప్రాయాలు లేవు.
   ఇక ఈ దేశం హిందూ రాజ్యంగా ఏ విధంగా నడవాలన్న అంశం మిగిలింది. అగ్రకుల హిందువుల ఆధిపత్యానికి ఈ పార్టీలలో ఎవరికీ అభ్యంతరం లేదు. ఎటొచ్చీ ఎక్కడెక్కడ ఏయే పద్ధతుల్ని, ఆచారాలని పాటించాలన్నదే సమస్య. అంతే.
   ప్రస్తుత ప్రభుత్వం ఈ ఎజండాను అమలు చేయడానికి అనుగుణంగా రంగాన్ని సిద్ధం చేస్తోంది. వివిధ రాజకీయ అనుబంధాలున్న వ్యక్తులను భీమా కోరెగావ్‌ కేసులో నిర్బంధించింది. బహుశా ఆర్‌ఎస్‌ఎస్‌ ఏకరూప సిద్ధాంతాన్ని ఎదిరించి నిలిచేది ఈ వ్యక్తులేనని భావించి వుండొచ్చు.
స్వతంత్ర భావాలు కలిగిన వ్యక్తులు ఆధిపత్య ధోరణులను స్వేచ్ఛగా విమర్శించి చారిత్రిక పాత్ర పోషిస్తారని ప్రముఖ చరిత్రకారిణి రొమిల్లా థాపర్‌ అన్నారు. అటువంటివారిని కొంతకాలం సహించినా చివరకు పాలకులు వారిని అదుపు చేయడం జరుగుతుందని తెలిపారు. బహుశా ప్రతిపక్షాలకు చెందిన ఎన్నికైన ప్రజాప్రతినిధులు కూడా రాబోయే రోజుల్లో ఈ ''అదుపు''కు గురికావలసి వస్తుందేమో. ఇప్పటికే చాలామంది ప్రతిపక్ష నేతల పైన, సినీ తారలు, సామాజిక కార్యకర్తలు, విద్యావేత్తలు, పాత్రికేయుల పైన వరసపెట్టి కేసులు నమోదు చేస్తున్నారు.
   ఏకశిలా సదృశమైన ఈ (ఆర్‌ఎస్‌ఎస్‌) అవగాహనతో రూపొందిన ఆర్థిక విధానాల నమూనా కూడా ప్రస్తుత వాతావరణానికి తగినట్టుగానే ఉంది. తక్కిన అందరినీ పక్కనబెట్టి కేవలం గుత్తాధిపత్యం చలాయించే క్రోనీ క్యాపిటలిస్టులనే పాలక వర్గం పెంచి పోషిస్తుంది. ఎక్కువమంది పెట్టుబడిదారులుంటే వారందరినీ అదుపు చేయడం గాని, సంతృప్తి పరచడం గాని కష్టం కదా. అందుకే ఒకే దేశం- ఒకే సంస్కృతి అన్న విధంగానే ఒకే దేశం- నలుగురో అయిదుగురో కార్పొరేట్లు అన్న ఆర్థిక నమూనా అమలౌతోంది.
   ఈ కార్పొరేట్‌ కుటుంబాలు హిందూ రాజ్య భావనను బలంగా సమర్ధిస్తే దేశాన్ని సాంస్కృతికంగా ఏకీకృతం చేయడం పెద్ద కష్టమేమీ కాదు. మన దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉండవచ్చుగాక. కాని సాంస్కృతికంగా ఏకరూప సంస్కృతితో మన దేశం బలంగా ఉంటుంది కదా. పైగా దీనిని మెజారిటీ ప్రజలు ప్రతిఘటించలేరు. వారు అన్నీ కోల్పోయి, అన్ని విధాలుగా బలహీనంగా ఉండి లొంగిపోయేవారే కదా.
   ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు అమ్మేసిన సందర్భాలలోకాని, సంస్కరణల పేరుతో మొత్తం వ్యవసాయ చట్టాలనే సమూలంగా మార్చివేసినప్పుడు కాని ఆర్‌ఎస్‌ఎస్‌ దేశభక్తి నినాదాలతో ఆ చర్యలను వ్యతిరేకిస్తున్నట్టు వ్యవహరిస్తుంది. అయితే ఆ విధానాలను ప్రతిఘటించడానికి ఎటువంటి నికరమైన ప్రయత్నమూ ఉండదు. కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకే ఈ నాటకాలన్నీ. బిజెపి చేసే తప్పులకు, తనకు ఎటువంటి సంబంధమూ లేదని చెప్పడానికే ఇదంతా.
   అమెరికాలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా అక్కడ కార్పొరేట్ల ఎజండానే అమలు జరిగినట్లుగా, ఇక్కడ కూడా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆర్‌ఎస్‌ఎస్‌ ఎజండాయే అమలు జరగాలని ఆ సంస్థ కోరుకుంటోంది. ఒక్కో అడుగూ ఆ దిశగా ముందుకు వేస్తోంది.
   ప్రాచీన కాలంలో బ్రాహ్మణులకు నేరుగా ఏ అధికారమూ వుండకపోయినా, మొత్తం పెత్తనం అంతా వారే చెలాయించారు. ఆ విధంగానే, ఆర్‌ఎస్‌ఎస్‌ కేవలం ఒక సాంస్కృతిక సంస్థగానే తన అవతారాన్ని కొనసాగిస్తూ తెర వెనక నుండి తన ఎజండాని అమలు జరిపించడానికి తగిన వ్యూహాన్ని రచించింది. ఆ వ్యూహం ఫలిస్తే ఏ పార్టీ అధికారంలో ఉన్నా పెద్ద తేడా ఉండదు. తెరవెనుక ఉండే శాశ్వత ప్రభుత్వంగా ఆర్‌ఎస్‌ఎస్‌ ఉంటుంది.
   ఇక రాజ్యాంగానికి, రాజకీయ ప్రక్రియలకు, వ్యవస్థలకు, విధానాలకు ప్రత్యేకంగా ఎటువంటి ఉనికి గాని ప్రాధాన్యతగాని ఉండదు. అంతా ఒకటే సంస్థ. అదే ఆర్‌ఎస్‌ఎస్‌. ఒకటే బొమ్మ. అదే హిందూ రాజ్యం. దీనిని సాధించడం కోసం మోడీని అమిత్‌ షా ను వదులుకోవడం ఆర్‌ఎస్‌ఎస్‌ కు పెద్ద కష్టమేమీ కాదు. వాళ్ళకన్నా ఈ హిందూత్వ ప్రాజెక్టు చాలా పెద్దది. ఈ ప్రాజెక్టు అమలు కావాలంటే అది ఈ మోడీ, షా లను దాటి ముందుకు పోవాలి. అంతే కాదు. అది ఈ ఎన్నికల ప్రక్రియతో నిమిత్తం లేకుండా నిరాటంకంగా ముందుకు సాగిపోయేదిగా ఉండాలి.

(రచయిత జెఎన్‌యులో రాజకీయశాస్త్ర విభాగంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌. ఈ రచన లోని అభిప్రాయాలు ఆయన వ్యక్తిగతం)
అజ‌య్‌ గూడవర్తి

అజ‌య్‌ గూడవర్తి