Apr 27,2022 06:58

ప్రజల్ని చీల్చే హిందూత్వ జాతీయవాదం దృష్టిలో దేశం అంటే కేవలం భూమి మాత్రమే. సావర్కార్‌ ఈ దేశాన్ని పుణ్యభూమి, పిత్రు భూమి అన్నది కేవలం హిందువులకు మాత్రమే. అందుచేత ముస్లింలు ఈ దేశంలో ఉండాలంటే వాళ్ళని ముందు పవిత్రులుగా చేయాలి. మరి విదేశీ పెట్టుబడి ఈ దేశంలోకి విచ్చలవిడిగా వస్తోంది కదా? దాన్నెలా పవిత్రం చేస్తారు? బహుశా ఈ దేశంలో అడుగు పెట్టడం తోటే అది పవిత్రం అయిపోతుందేమో మరి !

(నిన్నటి సంచిక తరువాయి)
     సిసలైన 'స్వావలంబన'కు, బిజెపి ప్రస్తుతం ముందుకు తెచ్చిన డొల్ల నినాదం 'మేక్‌ ఇన్‌ ఇండియా'కి ఏ మాత్రమూ పోలిక లేదు. అసలైన స్వావలంబన అందరికీ విజ్ఞానాన్ని అందుబాటులోకి తేవాలని, దానిని మరింత ఉన్నత స్థాయికి పెంపొందించాలని ప్రయత్నిస్తుంది. మోడీ దృక్పథం దానికి పూర్తి భిన్నంగా ప్రపంచ పెట్టుబడి వచ్చి ఈ దేశంలోని శ్రమశక్తిని కారుచౌకగా కొల్లగొట్టమని ఆహ్వానిస్తుంది. పైగా అందుకోసం పన్ను రాయితీలు, సబ్సిడీలు, ఉచితంగా భూములు అందిస్తుంది.
      జాతీయోద్యమం మన దేశం స్వావలంబన సాధించాలంటే ముందు విజ్ఞానంలో పూర్తి స్వయంశక్తి సాధించాలని భావించింది. కాని మోడీ భారతంలో మనం విద్యా సంస్థలమీద, పరిశోధనల మీద, ప్రయోగశాలల మీద నిరంతర దాడుల్ని చూస్తున్నాం. హేతువు, శాస్త్రవిజ్ఞానం కనుమరుగయ్యేలా మూఢ విశ్వాసాలు, అర్ధం, పర్ధం లేని ఆచారాలు శాస్త్ర విజ్ఞానంగా చెలామణీ అవుతున్నాయి. కట్టుకథలు చరిత్రగా ప్రచారం పొందుతున్నాయి. గాల్లో ఎగిరే రధాలు, గ్రహాంతర యానాలు, మహాభారతంలో ఉన్న జన్యు శాస్త్రం - ఇవన్నీ వాస్తవాలుగా ప్రచారం పొందుతున్నాయి. మానవ పరిణామ వాదం శుద్ధ తప్పు అని, దశావతరాలే దానికన్నా మెరుగైన సిద్ధాంతం అని ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వి.సి.జి.నాగేశ్వరరావు 106వ భారత సైన్స్‌ కాంగ్రెస్‌ లోనే ప్రకటించారు! మతం అస్థిత్వం మీద ఆధారపడిన జాతీయత వాళ్ళ లక్ష్యం. అందుకే వాళ్ళు హేతువును, వాస్తవ చరిత్రను ధ్వంసం చేయబూనుకున్నారు. మైనారిటీలకు ఏ హక్కులూ లేని మెజారిటేరియన్‌ దేశాన్ని, మూఢవిశ్వాసాలకు హేతుబద్ధత తలొగ్గే దేశాన్ని, సంపద కలిగివుండడం, పెద్ద కులంలో పుట్టడం మాత్రమే మెరిట్‌గా పరిగణించే దేశాన్ని వాళ్ళు నిర్మించదలచుకున్నారు.
     ప్రణాళికాబద్ధ అభివృద్ధికి ఆరెస్సెస్‌ ముందు నుంచీ వ్యతిరేకంగానే ఉంది. ప్రభుత్వ రంగాన్ని నిర్మించడం, దేశ సంపదలను జాతీయీకరణ చేయడం వంటి చర్యలు అపవిత్రమైన 'సోషలిస్టు' చర్యలుగా వాళ్ళు పరిగణించారు. ప్రైవేటు మార్కెట్‌ శక్తుల ఇష్టానికే దేశాన్ని పూర్తిగా విడిచిపెట్టాలని, విదేశీ పెట్టుబడి ఎటువంటి ఆటంకాలూ లేకుండా ఈ దేశంలో ప్రవేశించే వీలుండాలని కోరుకున్నారు. భారత దేశంలోని పెట్టుబడిదారులకు, విదేశీ పెట్టుబడిదారులకు నడుమ సయోధ్య కల్పించడమే ప్రభుత్వ బాధ్యత అని వాళ్ళు భావించారు. మనం ఈ రోజు ఆచరణలో చూస్తున్న క్రోనీ క్యాపిటలిజం అదే. ప్లానింగ్‌ కమిషన్‌ ను రద్దు చేసి ఆ స్థానంలో ఎందుకూ పనికిరాని నీతి ఆయోగ్‌ను మోడీ తెచ్చింది ఇందుకే. ప్రభుత్వ రంగాన్ని తనకు సన్నిహితులుగా ఉండే కార్పొరేట్లకు కారుచౌకగా కట్టబెడతున్నది ఇందుకే. మేక్‌ ఇన్‌ ఇండియా నినాదం ముసుగులో విదేశీ పెట్టుబడిని స్వాగతిస్తున్నదీ ఇందుకే. స్వావలంబన వైపు నుండి కార్పొరేటీకరణ వైపు సాగుతున్న ఈ ప్రయాణం ఒక విద్రోహం ( ఫ్రం సెల్ఫ్‌ రిలయన్స్‌ టు రిలయన్స్‌).
     ప్రజల్ని చీల్చే హిందూత్వ జాతీయవాదం దృష్టిలో దేశం అంటే కేవలం భూమి మాత్రమే. సావర్కార్‌ ఈ దేశాన్ని పుణ్యభూమి, పిత్రు భూమి అన్నది కేవలం హిందువులకు మాత్రమే. అందుచేత ముస్లింలు ఈ దేశంలో ఉండాలంటే వాళ్ళని ముందు పవిత్రులుగా చేయాలి. మరి విదేశీ పెట్టుబడి ఈ దేశంలోకి విచ్చలవిడిగా వస్తోంది కదా? దాన్నెలా పవిత్రం చేస్తారు? బహుశా ఈ దేశంలో అడుగు పెట్టడం తోటే అది పవిత్రం అయిపోతుందేమో మరి !
      శాస్త్ర, సాంకేతికాభివృద్ధి సాధించడంలో కీలకపాత్ర ప్రజలదే అన్న వాస్తవాన్ని మోడీ ప్రభుత్వం గుర్తించడం లేదు. మార్కెట్‌లో అత్యధిక రేటులో లాభాలను ఆర్జిస్తున్న సంస్థ యాపిల్‌. కాని ఆ సంస్థకి ఒక్క ఫ్యాక్టరీ కూడా లేదు. ఐనా లాభాలెలా వస్తున్నాయి? డిజైన్లు, సాఫ్ట్‌వేర్‌, బ్రాండ్‌ పేరు మాత్రమే యాపిల్‌ సొంతం. అందుచేత మార్కెట్‌ లో అమ్ముడయ్యే ప్రతీ ఐఫోన్‌ కి యాపిల్‌ కంపెనీ తన వాటాగా 300 డాలర్లు పొందుతుంది. ఐఫోన్లను ఉత్పత్తి చేసే ఫాక్స్‌కాన్‌ సంస్థ మాత్రం కేవలం 7 డాలర్లు మాత్రమే పొందుతుంది. మానవ విజ్ఞానాన్ని ఒక సరుకుగా మార్చేసిన ఈ ఆర్థిక వ్యవస్థలో మనం సాధించిన విజ్ఞానం మనది కాకుండా పోతుంది.
     ఈరోజు దేశంలో మైనారిటీల మీద, కొన్న కులాల మీద, కొన్ని సమూహాల మీద జరుగుతున్న దాడులు పొరపాటున జరుగుతున్నవి కావు. అవి ఆరెస్సెస్‌, బిజెపి, వాటికి చెందిన ఇతర సంస్థల ద్వారా పనిగట్టుకుని సాగిస్తున్నవే. మన రాజ్యాంగంలో పొందుపరిచిన మౌలిక విలువల మీద జరుగడుతున్న దాడులివి. ఆర్థిక ప్రజాస్వామ్యం మీద దాడి కూడా అందులో భాగమే. పర్యవసానంగా మన దేశం గతంలో బ్రిటిష్‌ పాలనలో ఏ విధంగా అసమానతలతో నిండిపోయిందో, మళ్ళీ ఇప్పుడు అదే విధంగా అసమానతలతో నిండిపోతున్నది. ఆర్థికవేత్త పికెటీ అన్నట్టు మనం ''బ్రిటిష్‌ రాజ్యం నుండి బిలియనీర్ల రాజ్యం లోకి'' వచ్చాం. ఈ దేశంలో కేవలం తొమ్మిది కుటుంబాలు దేశంలో సగం మంది భారతీయులకన్నా ఎక్కువ ఆస్తులను కూడగట్టగలిగాయి.
     ఈ దుర్మార్గానికి వ్యతిరేకంగా పోరాడాలంటే అందుకు గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తును శాస్త్రీయ దృక్పథంతో చూడగలగాలి. గతంలో మన దేశాన్ని కొల్లగొట్టిన దేశాలే నేడు మనకు విజ్ఞానాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయని నమ్మితే అది మళ్ళీ మన దేశాన్ని వలస పాలన వైపే నెడుతుంది.

( స్వేచ్ఛానుసరణ )
ప్రబీర్‌ పురకాయస్థ