ప్రజాశక్తి - కలిదిండి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై మోపుతున్న భారాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డిఎన్‌విడి.ప్రసాద్ డిమాండ్ చేశారు. సిపిఎం సమర భేరి ప్రచారయాత్రలో బాగంగా కలిదిండిలో సంతకాల సేకరణ నిర్వహించి, కరపత్రాలు పంపిణీ చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలను ఇష్టానుసారంగా పెంచుతూ సామాన్యులపై పెనుభారాలు మోపాయన్నారు. ప్రజాధనాన్ని ప్రభుత్వాలు కొల్లగొడుతున్నాయన్నారు. పెంచిన కరెంట్ ఛార్జీలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. పెరిగిన ధరలను తగ్గించేవరకూ సిపిఎం దేశ వ్యాప్త ఆందోళన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సిపిఎం మండల కార్యదర్శి శేషపు మహంకాళిరావు, భాస్కరరావు, కె.శ్రీనివాసరావు, జె.ఏసు, పి.సత్యన్నారాయణ, పి.గోపి, జె.మహేష్ పాల్గొన్నారు.
కొయ్యలగూడెం:గ్యాస్ సిలిండర్ రూ.400కు, రూపాయికే యూనిట్ విద్యుత్ ఇవ్వాలని సిపిఎం మండల కార్యదర్శి శుక్ల బోయిన రాంబాబు బిజెపిని డిమాండ్ చేశారు. గ్యాస్ ధర తగ్గించడం కేవలం ఎన్నికల జిమ్మిక్కేనని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అధిక ధరలు నిరుద్యోగం విద్యుత్ బారాలకు వ్యతిరేకంగా సిపిఎం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సమర భేరి కార్యక్రమాన్ని కొయ్యలగూడెం వేణుగోపాల స్వామి ఆలయం వెనుక వీధిలో చేపట్టారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ప్రజలు సతమతమవుతున్నారన్నారు. ఎనిమిదేళ్ల తర్వాత గ్యాస్ సిలిండర్‌పై రూ.200 తగ్గిస్తున్నట్లు ప్రకటించడం సిగ్గుచేటన్నారు. మోడీకి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా గ్యాస్ సిలిండర్‌ను రూ.400కే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధిక ధరలను, నిరుద్యోగాన్ని నియంత్రించలేని కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెదించాలని పిలుపునిచ్చారు. కాకినాడలో లభ్యమయ్యే గ్యాస్‌ను ఇక్కడ ప్రజలకు ఇవ్వకుండా ఎక్కడో ఉన్న గుజరాత్‌కు తరలిస్తున్నారని తెలిపారు. నరేంద్ర మోడీ ఆదేశాల మేరకే రాష్ట్రాన్ని జగన్‌మోహన్‌రెడ్డి తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. దేశంలో విజన్ ఉన్న నాయకుడు నరేంద్ర మోడీ అంటున్న చంద్రబాబు మైనార్టీలపై జరుగుతున్న దాడులపై స్పందించాలన్నారు.










