Apr 27,2023 17:42

బేతంచెర్ల సర్కిల్‌ రోడ్డులో రాస్తారోకో కార్యక్రమం నిర్వహిస్తున్న సిఐటియు నాయకులు

బిజెపి ఎంపీని శిక్షించాలి : సిఐటియు
ప్రజాశక్తి - డోన్‌

      మహిళా క్రీడాకారుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడుతున్న రెజ్లర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రెసిడెంట్‌, బిజెపి ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ను కఠినంగా శిక్షించాలని సిఐటియు నాయకులు డిమాండ్‌ చేశారు. రెజ్లర్స్‌ క్రీడాకారుల పోరాటాలకు సంఘీభావంగా సిఐటియు, ఎఐకెఎస్‌, ఎఐఎడబ్ల్యూయు, ఐద్వా, డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత కమిటీలు దేశవ్యాప్త నిరసనలకు ఇచ్చిన పిలుపులో భాగంగా గురువారం స్థానిక బేతంచెర్ల సర్కిల్‌ రోడ్డులో రాస్తారోకో చేపట్టారు. సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి టి.శివరాం, మండల, పట్టణ అధ్యక్షులు పి.రామాంజనేయులు, నక్కీ శ్రీకాంత్‌ పాల్గొని మాట్లాడారు. న్యాయం జరిగే వరకు అథ్లెట్లకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, ఈ దేశంలోని రైతులు, కార్మికులు, యువత, విద్యార్థులు, మహిళలు అన్ని వర్గాల ప్రజలు క్రీడాకారుల గౌరవం కోసం, న్యాయం కోసం వారు చేసే పోరాటాలకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సీనియర్‌ నాయకుడు కొండన్న, సిఐటియు ఉపాధ్యక్షుడు నాగన్న, నాయకులు మహేష్‌, శేఖర్‌, మల్లికార్జున, మధు తదితరులు పాల్గొన్నారు.