May 19,2023 00:37

భట్టిప్రోలులో నిరసన తెలుపుతున్న నాయకులు

ప్రజాశక్తి- భట్టిప్రోలు : దేశానికి గుర్తింపు, ఖ్యాతిని తీసుకొచ్చే రెజ్జర్లను లైంగిక వేధింపులకు గురిచేసిన బిజెపి ఎంపీ ,భారత రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ, సిఐటియు ఆధ్వర్యంలో గురువారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు పి.మనోజ్‌, జి.సుధాకర్‌ మాట్లాడుతూ స్టార్‌ రెజ్జర్ల పట్ల లైంగిక వేధింపులు పాల్పడిన ఎంపీని అరెస్టు చేయకుండా ప్రధాని నరేంద్ర మోడీ అడ్డుతగులుతున్నాడని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఢిల్లీ పోలీసులు కోర్టు అదేశించే వరకూ కేసు నమోదు చేయక పోవడం దారుణమన్నారు. తమకు న్యాయం చేయాలని ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా చేస్తున్న మహిళ రెజ్జర్లను బెదిరింపులకు గురిచేయడం దారుణమన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకూ దేశ ప్రజలందరూ ఐక్యంగా ఆందోళన చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కో ఆప్షన్‌ సభ్యులు షేక్‌ సలీమ్‌, ఎస్‌ఎఫ్‌ఐ, సిఐటియు నాయకులు తదితరులు పాల్గొన్నారు. చిన్నగంజాం : దేశానికి కీర్తి ప్రతిష్టలను తెచ్చిపేట్టే మహిళా రెజ్లర్లను వేధించిన బిజెపి ఎంపీని వెంటనే అరెస్టు చేయాలని సిఐటియు కార్యదర్శి జి.ప్రతాప్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్‌ బొమ్మ వద్ద గురువారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీ నడిబొడ్డున మహిళా రెజ్జర్లు వేధింపుల నుంచి తమకు కాపాడాలని ఎంపీని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ నిరసన చేపట్టినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం మహిళల పట్ల వివక్ష చూపిస్తుంది అనటానికి ఇదే నిదర్శన మని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాంప్రసాద్‌ రెడ్డి, ప్రకాష్‌ పుల్లయ్య రాజు తదితరులు పాల్గొన్నారు.