
ప్రజాశక్తి- విలేకర్ల బృందం
అనకాపల్లి : ప్రజాసంఘాల ఆధ్వర్యంలో అనకాపల్లి ఎన్టీఆర్ గ్రౌండ్‌లో గురువారం ఉదయం మార్నింగ్ వాక్‌లో నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్.శంకరరావు, జి.కోటేశ్వరరావు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎ.బాలకృష్ణ మాట్లాడుతూ మహిళా రెజ్లర్లు తమపై జరిగిన లైంగిక వేధింపులకు నిరసనగా దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద 25 రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నా మోడీ ప్రభుత్వానికి చీమకుట్టునట్టు కూడా లేకపోవడం దుర్మార్గమన్నారు. దేశ ప్రతిష్టను పెంచిన క్రీడాకారులకు న్యాయం చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం తిరిగి క్రీడాకారులపైనే దాడులు చేయడం దారుణమన్నారు. పోక్సో, నిర్భయ చట్టాలని అమలు చేసి బ్రిజ్ భూషణ్‌ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు గంటా శ్రీరామ్, బి.ఉమామహేశ్వరావు, తరుణ్, చలపతి పాల్గొన్నారు.
పరవాడ : పరవాడ మండల పరిషత్ జంక్షన్ వద్ద ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గురువారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్బంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు, ఆర్.శంకరరావు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.రమణ, ఎస్ రమణ, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు మాణిక్యం మాట్లాడుతూ రెజ్లర్ల ఆందోళనకు ప్రపంచం వ్యాప్తంగా మద్దతు లభిస్తుందని, దేశంలో ఉన్న ప్రజలందరిని ఏకం చేసి ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రజా సంఘాల నాయకులు కె.మోహన్ మనోజ్ కుమార్, కేశవ, తనూ, మూర్తి, అభి, తరుణ్ పాల్గొన్నారు.
అచ్యుతాపురం : అచ్యుతాపురంలో సిఐటియు ఆధ్వర్యాన ఆందోళన చేపట్టారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్.రాము, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కర్రి అప్పారావు, ఐద్వా నాయకులు ఆర్.లక్ష్మి, డివైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు కె.సోమినాయుడు మాట్లాడుతూ, రెజ్లర్లు లైంగిక వేధింపులకు గురైనట్లు చేసిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయకుండా తిరస్కరించటం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో మూర్తి, దూళి వెంకయ్య నాయుడు, రాము, రెడ్డి శ్రీనివాసరావు, స్కేటింగ్ కోచ్ బోండా ధర్మేంద్ర, ఆర్ భువన, అరుణ్ పాల్గొన్నారు.
చోడవరం : సిఐటియు, ఐద్వా, ఆధ్వర్యాన స్థానిక కోటవీధిలో మహిళలు ప్లే కార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. బ్రిజ్ భూషణ్‌ను అరెస్ట్ చేసి ఎంపీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మల్ల యోధులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం జిల్లా నాయకులు జి వరలక్ష్మి, జె.వెంకటలక్ష్మీ, సత్యవతి, ఆర్.లక్ష్మి, దేముడమ్మ, రమణమ్మ, మంగమ్మ, వి.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
నర్సీపట్నం టౌన్: మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన రెజ్లర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, బిజెపి పార్లమెంటు సభ్యుడైన బ్రిడ్జ్ భూషణ్ సింగ్ ను తక్షణం అరెస్టు చేయాలని సిపిఐ, సిపిఎం, ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. స్థానిక ఎన్‌టిఆర్ స్టేడియం, ఆర్టీసి కాంప్లెక్స్, కాఫీ క్యూరింగ్ సెంటర్‌లలో నిరసన చేస్తూ సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర అద్యక్షులు బి.ప్రభావతి మాట్లాడుతూ, లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆందోళన నిర్వహిస్తున్న మహిళా రెజ్లర్లను పిలిచి మాట్లాడక పోవడం బాధాకరమన్నారు. 39 కేసుల్లో నిందితుడిగా ఉన్న బిజెపి ఎంపీ, రెజ్లర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు బ్రిడ్జిభూషణ్ సింగ్‌ను తక్షణమే అరెస్టు చేసి, అన్ని అధికార రాజకీయ పదవుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. రెజ్లర్లు మెడల్స్ సాధించినప్పుడు ఇంటికి పిలిచి మరీ ఆతిథ్యం ఇచ్చిన ప్రధానమంత్రి ప్రస్తుతం మౌనం వహించడాన్ని తప్పు పట్టారు. ఈనెల 20న ఉదయం 10 గంటలకు రెజ్లర్ల ఆందోళనకు మద్దతుగా జిల్లా కలెక్టర్‌కు వినతిని ఇస్తామన్నారు. ఈ సందర్భంగా ఎన్‌ఎప్‌ఐడ్బ్యూ జిల్లా కార్యదర్శి సుబ్బలక్ష్మి, కన్వీనర్ కనక మహలక్ష్మీ, ఐద్వా జిల్లా ఉపాద్యక్షలు యల్.గౌరి, ట్రెజరర్ కెవీ సూర్యప్రభ, మీడ్డే మీల్ కార్మక సంఘం జిల్లా అధ్యక్షులు కె ప్రసన్న, ఎస్‌ఎప్‌ఐ డివిజన్ నాయకులు జి. గీతాకృష్ణ, సిఐటియు జిల్లా ఉపాద్యక్షలు డి. సత్తిబాబు, కార్యదర్శి అడిగర్ల రాజు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు కొండల రావు, రైతు సంఘం నాయుకులు మాకిరెడ్డి రామునాయుడు, సిపిఐ జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకట రమణ పాల్గొన్నారు.
నక్కపల్లి: భారత రెజ్లర్లు సమాఖ్య అధ్యక్షులు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఢల్లీీలో జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న భారత్ రెజ్లర్లకు మండలంలో రాజయ్యపేట, బోయపాడు గ్రామాలకు చెందిన క్రీడాకారులు గురువారం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.అప్పలరాజు మాట్లాడుతూ, భారత రెజ్లర్లు సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మహిళా రెజ్లర్లపై సెక్సువల్ వేదింపులకూ పాల్పడ్డారని ఆడియో, వీడియో టేపులు ఆధారాలతో సహా డిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసారన్నారు. ఆందోళన ప్రారంభించి 4 నెలలు అవుతున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం అత్యంత దుర్మార్గమైన చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని, ఆయన పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మహిళా క్రీడాకారులకు రక్షణ కల్పించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు ఎం.నానాజీ, పిక్కి కొండలరావు, మైలపల్లి బాపూజీ, మైలపల్లి నరేష్, చోడిపల్లి తాతాజీ, మఠం రామచంద్రరావు, గరికిన ఏసురాజు పాల్గొన్నారు.
కంచరపాలెం : మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన రెజ్లర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు, బిజెపి ఎంపి బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్‌ను అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఐద్వా, సిఐటియు, ప్రజా సంఘాలు డిమాండ్ చేసారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద బాధిత రెజ్లర్లు 26 రోజులుగా చేస్తున్న పోరాటానిక సంఘీభావంతో గురువారం కంచరపాలెంలో నిరసన చేపట్టారు. బి ఎన్ ఆర్ భవనం నుంచి ఊర్వశి వరకు నిరసన ప్రదర్శన, అనంతరం సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఐద్వా జిల్లా అధ్యక్షులు బి. పద్మ,, సిఐటియు జోన్ కార్యదర్శి ఒ.అప్పారావు మాట్లాడుతూ మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఘటనపై ఇంతరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడం దారుణమన్నారు. క్రీడావ్యవస్థను, క్రీడాకారులను అగౌరవ పరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం దుర్మార్గమన్నారు. ''బేటీ బచావో, బేటీ పడావో' అంటూ గొప్పలు చెబుతున్న కేంద్రం, బాధితుల్లో ఒక మైనర్ ఉన్నప్పటికీ చర్యలకు ఉపక్రమించకపోవడం సిగ్గుచేటన్నారు. ఇంతటి దారుణఘటనకు పాల్పడిన వారిని బిజెపి ప్రభుత్వం రక్షించడం దుర్మార్గమని, బాధితులకు ఐద్వా, సిఐటియు, ఇతరప్రజాసంఘాలు అండగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో ఐద్వా జోన్ కార్యదర్శి ఎ.పుష్పాంజలి సాహూ, వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి ఎం.ఈశ్వరరావు, ఐద్వా నేతలు ఒ.విజయ, కల్యాణి, శారద, కుమారి, సంజు, సిఐటియు నేతలు ఎ.మోహన్ రావు గంగరాజు పాల్గొన్నారు.