May 11,2023 20:46

మాట్లాడుతున్న డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న

బిజెపి ఎంపీని అరెస్టు చేయాలి
డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న
ప్రజాశక్తి - నంద్యాల

       రెజ్లర్‌ క్రీడాకారులపై లైంగిక దాడికి పాల్పడిన బిజెపి ఎంపీని పార్లమెంటు నుంచి తొలగించి అరెస్టు చేయాలని డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న డిమాండ్‌ కేంద్ర ప్రభుత్వాన్ని చేశారు. గురువారం స్థానిక డివైఎఫ్‌ఐ కార్యాలయంలో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భారతదేశ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా విస్తరించేలా రెజ్లర్ల మహిళా క్రీడాకారులు పతకాలను సాధిస్తుంటే అండగా నిలవాల్సిన రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షులు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ కంచె చేను మేసినట్లు వారిపై లైంగిక వేధింపులకు పాల్పడడం దారుణమన్నారు. వారి సమస్యలను ఎవరు పరిష్కరించాలని ప్రశ్నించారు. క్రీడాకారులపై లైంగిక వేధింపులకు పాల్పడిన వారి పైన చర్య తీసుకోవాలని జనవరిలో ఆందోళనకు దిగితే ప్రభుత్వం కమిటీ వేసి విచారిస్తామని హామీనిచ్చి నాలుగు నెలలైనా పట్టించుకోకపోవడంతో కొద్ది రోజుల కిందట ఏడు మంది మహిళా రెజ్లర్ల క్రీడాకారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారని తెలిపారు. కోర్టు సైతం ఇది తీవ్రమైన ఆరోపణ, తక్షణమే ఢిల్లీ పోలీసులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఆదేశించినా బిజెపి ఎంపీని కాపాడడం కోసం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అన్యాయమన్నారు. లైంగిక వేధింపులకు గురైన క్రీడాకారిణులపై, వారి కుటుంబ సభ్యులపై దౌర్జన్యాలకు, బెదిరింపులకు పాల్పడడం, ఆర్థికంగా సహకరిస్తామని ఆశ పెడుతున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా మేధావులు, ప్రజాసంఘాలు, మహిళ రైతు సంఘాలు, జమ్మూ కాశ్మీర్‌ మాజీ గవర్నర్‌ మాలిక్‌ లాంటి మేధావులు మద్దతుగా నిలుస్తున్నా కేంద్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. తక్షణమే మోడీ ప్రభుత్వం రెజ్లర్ల ఆందోళనకు స్పందించి బ్రిజ్‌ భూషణ్‌ శరన్‌ సింగ్‌పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని, అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో దేశవ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ పట్టణ కార్యదర్శి శివ నాయకులు వినీత్‌, సంజరు, మధు, నాగూర్‌, తదితరులు పాల్గొన్నారు.