Apr 28,2023 00:31

ఆర్‌టిసి కాంప్లెక్స్‌ కూడలిలో ధర్నా చేస్తున్న ప్రజా సంఘాల నాయకులు

ప్రజాశక్తి-అనకాపల్లి
మహిళా రెజ్లింగ్‌ క్రీడాకారులపై లైంగిక వేధింపులకు పాల్పడిన రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ అధ్యక్షులు, బిజెపి ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌సింగ్‌ను అరెసు చేయాలని కోరుతూ సిఐటియు, ఐద్వా, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు, ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో గురువారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌ కూడలిలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు బి.ప్రభావతి మాట్లాడుతూ మహిళలకు రక్షణ కల్పించాల్సిన ప్రజా ప్రతినిధులు దేశానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన మహిళా క్రీడాకారులను వేధించడం దుర్మార్గమన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో మహిళలకు రక్షణ కరువైందన్నారు. దేశానికి పతకాలు తెచ్చిన మహిళా రెజ్లర్లు మహిళా పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కేసు నమోదు చేయలేదని, నిందితులను అరెస్టు చేయలేదని పేర్కొన్నారు. తక్షణమే రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ అధ్యక్ష పదవి నుంచి బ్రిజ్‌ భూషణ్‌ను తొలగించాలని, ఆయన పార్లమెంట్‌ సభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. తమకు న్యాయం చేయాలని నాలుగు రోజులుగా రెజ్లర్లు ఆందోళన చేస్తున్నా బిజెపి ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నా కేసు నమోదు చేయకపోవడం బాధా కరమన్నారు. కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా కోశాధికారి గండి నాయన బాబు, సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్‌.శంకరరావు, జి.కోటేశ్వరరావు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎ.బాలకృష్ణ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రమణ, తరుణ్‌, ఐద్వా నాయకురాలు సుభాషిణి, డివైఎఫ్‌ఐ నాయకులు శివాజీ, మౌనిక, జన విజ్ఞాన వేదిక నాయకులు బి.ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.