Apr 28,2023 00:14

నినాదాలు చేస్తున్న సిఐటియు నేతలు

ప్రజాశక్తి-పాడేరు:మహిళ రెజర్లపై లైంగికంగా వేధింపులకు గురి చేసిన బిజెపి ఎంపి బీజు భూషణ్‌ చరన్‌ సింగ్‌ను తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ సిఐటియు, ఇతర ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో గురువారం అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, జంతర్‌ మంతర్‌ వద్ద వేధింపులకు గురి చేసిన బిజెపి ఎంపీ పై చర్య తీసుకోవాలని ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. మైనర్‌ బాలిక పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని తెలిపారు. మోడీ నాయకత్వంలో బిజెపి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి దేశంలో కళాకారులకి, క్రీడాకారులకు, మహిళలకి, దళితులకు, గిరిజనులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. రెజర్ల జాతీయ ఫెడరేషన్‌ అధ్యక్షుల్ని తక్షణం తప్పించాలని డిమాండ్‌ చేశారు. కుస్తీ పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి ప్రోత్సహించాల్సింది పోయి బిజెపి ఎంపీ వేధింపులకు గురి చేయడం సరికాదని తెలిపారు. తక్షణం బిజెపి ఎంపీని అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు పడాల్‌, ఉపాధి వర్కర్స్‌ యూనియన్‌ కార్యదర్శి యస్‌ బి పోతురాజు, ఆశ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు వై.మంగమ్మ, జిల్లా బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ గౌర అధ్యక్షులు పి.బాలదేవ్‌, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు ఎల్‌.సుందర్రావు, మెడికల్‌ అండ్‌ హెల్త్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు చిట్టి నాగరాజు, సిఐటియు నాయకులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.