ప్రజాశక్తి-పాడేరు: రెజ్లర్ల పై లైంగికంగా దాడి చేసిన బిజెపి ఎంపి బ్రిజు భూషణ్‌ను తక్షణం అరెస్టు చేయాలని ప్రజాసంఘాల పిలుపు మేరకు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రంలో గురువారం సిఐటియు, ఏపీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, రేజర్లపై దాడి చేసిన బిజెపి ఎంపీని అరెస్టు చేయాలని గత కొంతకాలంగా ఢిల్లీలో పెద్ద ఎత్తున క్రీడాకారులు ఆందోళన నిర్వహిస్తున్నా బిజెపి ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో వెనకడుగు వేస్తుందని విమర్శించారు. మహిళపై జరిగిన దాడిని బిజెపి మహిళా ఎంపీలు, మన రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం, వైసిపి ఎంపీలు ఖండించకపోవడం విచారకరమన్నారు. గతంలో ఉత్తరప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో మహిళలపై అనేక దాడులు జరిగినా బిజెపి పట్టించుకోలేదని విమర్శించారు.పైగా బిజెపి నాయకులు అమ్మాయిల్ని అత్యాచారం చేసి జైలుకు వెళ్లి వచ్చిన వారికి కూడా సన్మానాలు చేసిన ఘనత బిజెపికి ఉందని హెద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి.బాలదేవ్, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కేశవ, గిరిజన సంఘం నాయకులు పోతురాజు, ప్రభుదాసు పాల్గొన్నారు.










