Jun 04,2023 23:33

మాట్లాడుతున్న అజరుకుమార్‌, పాల్గొన్న వివిధ సంఘాల నాయకులు, న్యాయవాదులు

ప్రజాశక్తి- అనకాపల్లి
మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధింపులకు గురి చేసిన రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌, బిజెపి ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ చరణ్‌ సింగ్‌ను తక్షణమే అరెస్టు చేయాలని న్యాయవాదులు, పలు సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం స్పందించకుంటే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని హెచ్చరించారు. మహిళా రెజ్లర్లకు సంఘీభావంగా ప్రజాసంఘాల ఆధ్వర్యాన స్థానిక నాల్గు రోడ్ల సెంటర్లోని శ్రామిక సదన్లో ఆదివారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ లాయర్స్‌ జిల్లా కార్యదర్శి శేఖర్‌మంత్రి సాయి వెంకట లక్ష్మణరావు, అఖిలభారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శి పిఎస్‌.అజరు కుమార్‌ మాట్లాడుతూ మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులపై విచారించి శిక్ష విధించడానికి వీలుగా పటిష్టమైన నియమ, నిబంధనలు ఉన్నాయని, అందులోనూ బాలికల విషయంలో చట్టాలు మరింత కఠినంగా ఉన్నాయని తెలిపారు. అయినా బ్రిజ్‌ భూషణ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విచారకరమన్నారు.
ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు బి.ప్రభావతి మాట్లాడుతూ సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటే తప్ప మోడీ సర్కార్‌ బ్రిజ్‌ భూషణ్‌పై కేసు నమోదు చేయలేదన్నారు. నేటికీ ఆయన్ను పదవి నుంచి తొలగించలేదని, కస్టడీలోకి తీసుకొని విచారించలేదని పేర్కొన్నారు. తమ పార్టీ ఎంపీని రక్షించడానికి బిజెపి ప్రభుత్వం చట్టాన్ని ఉల్లంఘిస్తుందని విమర్శించారు. సీనియర్‌ న్యాయవాది ఐఆర్‌ గంగాధర్‌ మాట్లాడుతూ మహిళా రెజ్లర్ల పోరాటానికి సంఘీభావంగా జిల్లాలోని న్యాయవాదులందరూ ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. న్యాయవాది కళావతి మాట్లాడుతూ మహిళా రెజ్లర్ల విషయంలో మోడీ సర్కారు తీరును సభ్య సమాజం ఖండించాలన్నారు. ఈ సమావేశంలో న్యాయవాదులు కనిశెట్టి సురేష్‌ బాబు, గంట సురేష్‌, స్ఫూర్తి సంస్థ కార్యదర్శి శివాజీ, ప్రజా సంఘాల నాయకులు ఎం.మాధవరావు, ఎ.బాలకృష్ణ, కాళ్ళ తేలయ్య బాబు, వియ్యపు రాజు, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షులు దాసరి సంతోష్‌ పాల్గొన్నారు.