May 25,2023 23:29

ధర్నా చేస్తున్న కార్మికులు, సంఘాల నాయకులు

గుంటూరు: మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించిన బీజేపీ ఎంపి బ్రిజ్‌ భూషణ్‌చరణ్‌ సింగ్‌ను వెంటనే అరెస్టు చేయాలని పిఒడబ్ల్యూ, పిడిఎస్‌యు, ఐఎఫ్‌టియు, ఎఐకె ఎంఎస్‌ సంఘాల ఆధ్వర్యంలో గురువారం రైల్వేస్టేషన్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాలో పిఒడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ఎన్‌.విష్ణు, పిడిఎస్‌యు రాష్ట్ర అధ్యక్షులు యు.గనిరాజు, ఐఎఫ్‌ టియు జిల్లా కార్యదర్శి ఎన్‌.వి.కృష్ణ మాట్లాడుతూ నెల రోజులుగా ఢిల్లీలో రెజ్లర్లు చేస్తున్న పోరాటం న్యాయ మైందని, మైనర్‌ రెజ్లర్లను సైతం బ్రిజ్‌ భూషణ్‌సింగ్‌ వేధింపులకు గురి చేశాడని తెలిపారు. 2023 జనవరిలో బ్రిజ్‌ భూషణ్‌ను అరెస్టు చేయాలని మహిళా రెజ్లర్లు ఆందోళన చేస్తే మేరీ కోమ్‌ కన్వీనర్‌గా 7 గురితో విచారణ కమిటీ వేశారని, అయితే ఆ రిపోర్ట్‌ను చెత్త బుట్టలో పడేశారని అన్నారు. నాలుగు నెలలు గడి చినా న్యాయం అందక మళ్ళీ ఏప్రిల్‌ 22 నుండి నిర వధిక ధర్నా చేస్తున్నారన్నారు. నెల రోజులుగా మహిళా రెజ్లర్లు పోరాడుతున్నా కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టి నట్టు కూడా లేదని, భేటీ బచావో, భేటీ పడావో అంటూ ఊదరగొడుతున్న పాలకులకు మహిళా రెజ్లర్ల ఆందోళన కనబడలేదా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో ప్రజా సం ఘాల నాయకులు గంధం శ్రీను, సాయి వరప్రసాద్‌, శేఖర్‌ పాల్గొన్నారు.