కోవిడ్-19 మహమ్మారి మూడవ దశ ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలను బేఖాతరు చేస్తూ రాష్ట్రంలో బిజెపి ఆడుతున్న మత రాజకీయాలు జుగుప్స కలిగిస్తున్నాయి. కోవిడ్ మహమ్మారిని అందరూ ఐక్యంగా ఎదుర్కోవాల్సిన తరుణంలో దానికి గండికొట్టేవిధంగా బిజెపి యత్నించడం అత్యంత శోచనీయం. విగ్రహాల ధ్వంసం పేరుతో రెండేళ్ల క్రితం అంతర్వేది, రామతీర్థం తదితర స్థలాల్లో కొన్ని అవాంఛనీయ ఘటనలను ఆసరాగా చేసుకుని బిజెపి మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ఎన్ని కుతంత్రాలు పన్నినా ఫలించలేదు. తిరుపతి ఉప ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కలేదు. 2019 ఎన్నికల్లో ఒక్క శాతం ఓట్లు కూడా లభించని బిజెపి మత రాజకీయాలే సింగిల్ ఎజెండాగా చేసుకుని రాష్ట్ర సామరస్య వాతావరణాన్ని కలుషితం చేస్తోంది. దీనిలో భాగమే సెప్టెంబరు 10న వినాయక చవితిని పురస్కరించుకుని బిజెపి సరికొత్త డ్రామాకు తెర లేపింది. కోవిడ్ మహమ్మారితో ఛిన్నాభిన్నమైన జీవితాలు, జీవనోపాధి, విపరీతంగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు, తెలుగు ప్రజలకు గర్వకారణమైన విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఇలా పుట్టెడు సమస్యలతో ప్రజలు తీవ్రంగా సతమతమవుతున్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా హామీ ఇచ్చిన ప్రత్యేక హోదాతో సహా ఏ ఒక్క హామీని కూడా ఇంతవరకు అమలు చేయకుండా ఈ రాష్ట్రానికి బిజెపి చేసిన ద్రోహం గురించి ఇక వేరే చెప్పనక్కర్లేదు. తాజాగా నేషనల్ మోనిటైజేషన్ పేరుతో కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన విలువైన ఆస్తులను టోకుగా అమ్మకానికి పెట్టింది. చివరికి పల్లెల్లోని పంచాయతీ ఆస్తులను కూడా వదలడం లేదు. ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టి కార్పొరేట్లకు దండిగా లాభాలు చేకూర్చే నయా ఉదారవాద విధానాలను జోరుగా అమలు చేస్తున్నది. రైతులు తొమ్మిది మాసాలుగా ఢిల్లీ సరిహద్దుల్లో పోరాడుతున్నా, కార్మికులు, ఉద్యోగులు పోరాటాలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. కోవిడ్‌ను ఎదుర్కోవడంలో కేంద్రంలోని బిజెపి సర్కార్ ఘోరాతి ఘోరంగా విఫలమైంది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై ప్రజల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహాన్ని పక్కదారి పట్టించేందుకు మత విద్వేషాలను రెచ్చగొట్టే పనిలో ఉన్నది. వినాయక చవితిని కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిస్తే, వాటిని రాష్ట్ర బిజెపి ధిక్కరిస్తామంటున్నది. హిందువుల పండగ వినాయక చవితిని జరుపుకోనీయడం లేదంటూ ప్రజలను తప్పుదోవ పట్టించేలా అసత్య ప్రచారం చేస్తున్నది. దీనికి మీడియాలో ఒక సెక్షన్ మితిమీరిన ప్రచారం కల్పిస్తూ ప్రజలను గందరగోళపరచేందుకు యత్నిస్తున్నది. ఇళ్లల్లోను, ఆలయాల్లోను వినాయకుని విగ్రహాలకు పూజలు చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేదు. గణేశ్ నవ రాత్రుల పేరుతో పెద్ద పెద్ద పందిళ్లు వేసి, ప్రజలు పెద్ద సంఖ్యలో గుమికూడేలా చేయడం వల్ల కోవిడ్-19 మహమ్మారి మళ్లీ విజృంభించే అవకాశముంది. కుంభమేళా పేరుతో హరిద్వార్‌లో లక్షలాది మంది గుమికూడేందుకు అనుమతించిన ఫలితం దేశంలో కోవిడ్ మహమ్మారి రెండోసారి విజృంభించి దేశవ్యాపితంగా కనివిని ఎరుగని రీతిలో మరణాలకు దారితీసింది. ఆసుపత్రుల్లో బెడ్ల కొరత, ఆక్సిజన్ కొరత, వ్యాక్సిన్ల కొరత, చివరికి శ్శశానాల్లో అంత్యక్రియలకు కూడా చోటు దొరక్క శివ గంగ శవగంగలా ఎలా మారిందీ చూశాము.గత అనుభవాలు కళ్లెదుట ఉన్నా దాని నుంచి పాఠాలు తీసుకోవడానికి బిజెపి నిరాకరించడం బాధ్యతారాహిత్యం. ఇప్పటికీ రాష్ట్రంలో రెండు డోసుల వ్యాక్సిన్ 11 శాతం మందికే వేశారు. రోజువారీ కరోనా కేసులు వెయ్యికి పైనే ఉన్నాయి. మరణాలు ఆగలేదు. ఈ స్థితిలో కరోనా నిబంధనలకు లోబడి పండగలు చేసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. అది ఏ మత పండగ అయినా కావచ్చు. 'ఇతర పండగలకు ఆంక్షలు లేవు, వినాయక చవితికే ఆంక్షలా!' అంటూ బిజెపి చేస్తున్న గోబెల్స్ ప్రచారాన్ని ఎవరూ నమ్మరు. బిజెపి పాలిత రాష్ట్రం కర్ణాటకలో కూడా గణేశ్ ఉత్సవాలపై కరోనా ఆంక్షలు ఉన్నాయి. రాష్ట్రంలో అమలు చేస్తున్న కరోనా మార్గదర్శకాలు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రూపొందించినవే. గణేశుని అడ్డం పెట్టుకుని రాష్ట్రంలో రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్న బిజెపి కి ప్రజలే బుద్ధి చెబుతారు. రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ లేకున్నా బిజెపి ఇంతగా చెలరేగడానికి రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలు అనుసరిస్తున్న వైఖరి కూడా ఒక కారణం. బిజెపి మత రాజకీయాలను తిప్పికొట్టేందుకు అధికార వైసిపి ఇప్పటికీ సిద్ధం కావడం లేదు. పైపై విమర్శలకే పరిమితమవుతున్నది తప్ప నేరుగా తలపడేందుకు తటపటాయిస్తున్నది. వైసిపి నే ప్రధాన శత్రువుగా భావిస్తున్న ప్రతిపక్ష తెలుగుదేశం బిజెపి కి అనధికారిక మిత్రపక్షంలా వ్యవహరిస్తున్నది. ప్రధాన పార్టీల ఈ బలహీనతే బిజెపి కి కొమ్ములు తెస్తున్నది. రాష్ట్రంలో మత సామరస్యానికి విఘాతం కలిగించే బిజెపి కుతంత్రాలను ప్రజలు సమైక్యంగా తిప్పికొట్టాల్సిన అవసరముంది. అప్పుడే మన హక్కులను సాధించుకోగలుగుతాం.










