ప్రజాశక్తి-గుంటూరు, నరసరావుపేట : కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా అంబేద్కర్ జయంతి రోజైన 14వ తేదీ నుండి ఈనెల 30వ తేదీ వరకూ విస్తృత ప్రచారం చేయనున్నట్లు సిపిఎం, సిపిఐ గుంటూరు, పల్నాడు జిల్లాల కార్యదర్శులు పాశం రామారావు, గుంటూరు విజరుకుమార్, జంగాల అజరుకుమార్, ఎ.మారుతివరప్రసాద్ తెలిపారు. ప్రచార భేరిలో పాదయాత్రలు, గ్రూప్ సమావేశాలు, బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ మేరకు వాల్‌పోస్టర్లను గురువారం ఆవిష్కరించారు. గుంటూరులోని సిపిఎం కార్యాలయం, నరసరావుపేటలోని సిపిఐ కార్యాలయాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో వారు మాట్లాడుతూ.. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తోందని విమర్శించారు. నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెద్ద ఎత్తున పెంచిందని, మరోవైపు పేదలకు ఉపాధి లేక జీవన ప్రమాణాలు తగ్గిపోయి దుర్భర జీవితం గడుపుతున్నారని అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని, ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, రైల్వే జోన్ ఏర్పాటు ఊసే లేదన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి, రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించలేదని విమర్శించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మలుగా ఉన్న ప్రభుత్వ రంగం సంస్థలను కారుచౌకగా అదాని, అంబానీలకు కట్టబెడుతున్నార అన్నారు. భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా రాష్ట్రాల హక్కులను కాలరాస్తోందని, గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని రాష్ట్రాలపై పెత్తనం చేస్తోందని మండిపడ్డారు. దళితులు, మైనార్టీలు, గిరిజనులపై దాడుల, మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో ప్రజల మధ్య మత వైషమ్యాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, కేంద్రం దుర్మార్గాలపై ప్రతిఒక్కరూ గొంతెత్తాలని కోరారు. ప్రజా వ్యతిరేక, నిరంకుశ, మతోన్మాద బిజెపి ప్రభుత్వాన్ని సాగనంపుదామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం బాటలోనే పయనిస్తోందని, విద్యుత్ ఛార్జీల పెంపు, వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగింపు ఇందులో భాగమని తెలిపారు. పైగా రాష్ట్రానికి రావాల్సిన నిధులపైనా గట్టిగా పోరాడ్డం లేదని అన్నారు. రాష్ట్రంలో ప్రజా ఉద్యమాలపై నిర్భంధం పెరుగుతోందని, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఇతర అసంఘటిత రంగ కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చక పోగా ఉద్యమాలపై పోలీసు నిర్భందాన్ని ప్రయోగిస్తోందని విమర్శించారు. మూడు రాజధానుల పేరుతో రాజధాని రైతులకు ద్రోహం చేస్తోందన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారాన్ని విజయవంతం చేయాలని కోరారు. గుంటూరులో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఈమని అప్పారావు, సిపిఐ నగర కార్యదర్శి మల్యాద్రి, సిపిఎం నాయకులు ఎం.బాలాజి, సిపిఐ నాయకులు హానుమంతరావు పాల్గొన్నారు. నరసరావుపేటలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కె.రాంబాబు, సిపిఎం నాయకులు డి.శివకుమారి, ఎఐవైఎఫ్ జిల్లా కన్వీనర్ షేక్ సుభాని, సిపిఐ సీనియర్ నాయకులు యు.రంగయ్య, పట్టణ కార్యదర్శి వి.వెంకట్, సిపిఎం జిల్లా నాయకులు నాగేశ్వరరావు, పెద్దిరాజు, రబ్బాని, బోసు, ఎఐవైఎఫ్ ఏరియా కార్యదర్శి జి.శ్రీహర్ష పాల్గొన్నారు.










