ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టం లోని హామీల అమలుకు మోకాలడ్డుతున్న కేంద్ర బిజెపి ప్రభుత్వం మరింతగా బరితెగిస్తోంది. రాష్ట్రంలో అరకొరగా ఉన్న ప్రభుత్వ రంగ ఆస్తులనూ తెగనమ్మాలని నిర్ణయించడంతో మరింతగా అన్యాయం చేయడానికి సిద్ధమవుతోంది. మోనిటైజేషన్ పేరిట జరగనున్న ఈ స్వాధీన తనఖా ప్రక్రియ రాష్ట్ర ప్రజలకు శాపంగా మారనుంది. కేంద్ర ప్రభుత్వం అమ్మడానికి సిద్ధం చేసిన జాబితాలో విజయవాడ, తిరుపతి, రాజమండ్రి విమానాశ్రయాలు, తిరుపతి, నెల్లూరు రైల్వే స్టేషన్లు, విశాఖ పోర్టులో నాలుగు ప్రాజెక్టులు, ఎఫ్‌సిఐ గోదాములు, విద్యుత్ ఉత్పత్తి, ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టులు, కేజి బేసిన్ గ్యాస్ పైప్‌లైన్, బిఎస్‌ఎన్‌ఎల్ టెలికాం టవర్లు, భారత్ నెట్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ నెట్‌వర్క్ తదితరాలు ఉన్నాయి. సికింద్రాబాద్ నుండి మన రాష్ట్రం మీదుగా వెళ్లే అనేక రైళ్లతో పాటు పలు జాతీయ రహదారులు కూడా ప్రైవేటు పరం కానున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా కొండవీటి చేతాండంత ఉంది. ఇవి కాకుండా ఇంకా తెగనమ్మడానికి అవకాశం ఉన్న వాటిని గుర్తించాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి హుకుం జారీ చేసింది. దీంతో రాష్ట్ర అధికారులు దుర్బిణీ వేసి గాలించే పనిని త్వరలోనే చేపట్టనున్నారు. వీటన్నింటిని 50 నుండి 99 ఏళ్ల పాటు ప్రైవేటు సంస్థలకు అప్పగించి కేంద్ర ప్రభుత్వం సొమ్ము చేసుకోనుంది.
రాష్ట్రానికి చెందిన సంపదను కేంద్రం ఏకపక్షంగా ధారాదత్తం చేయడమంటేనే అది రాష్ట్ర హక్కుల మీద, రాష్ట్ర ప్రజల మీద చేస్తున్న దాడిగానే మనం పరిగణించాల్సి ఉంటుంది (ఇప్పుడు మానిటైజేషన్‌కు అప్పచెబుతున్న సంస్థల భూభాగం రాష్ట్రాలు కేటాయించినవే. కానీ, కేంద్రం సొమ్ము చేసుకుంటోంది). కానీ, మన రాష్ట్ర ప్రభుత్వం ఆ మానిటైజేషన్‌కు వ్యతిరేకంగా నిలవడానికి, నిరసనైనా తెలియచేయడానికి సిద్ధం కాకపోవడం శోచనీయం. ఒకదాని తరువాత ఒకటిగా రాష్ట్రం లోని ప్రతిష్టాత్మక సంస్థలు అదానీ పరం అవుతున్నాయి. కృష్ణపట్నం పోర్టును సొంతం చేసుకున్న అదానీ ఇటీవలే గంగవరం పోర్టునూ నూరు శాతం తన ఆధీనంలోకి తీసుకున్నారు. అదానీ అడిగీ అడగక ముందే తన ఆధీనంలో ఉన్న 10.4 శాతం వాటాను విక్రయించడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఎగుమతులు, దిగుమతులకు గంగవరం పోర్టు అత్యంత కీలకమైనది. దీనిని అవకాశంగా తీసుకుని అదానీ గ్రూపు సరుకుల ధరలు పెంచడానికి స్టీల్‌ప్లాంటును బ్లాక్‌మెయిల్ చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఈ పోర్టును అదానీ స్వాధీనం చేసుకోవడం ప్రైవేటీకరణ కత్తి వేలాడుతున్న స్టీల్‌ప్లాంటుకు ఎప్పటికైనా ముప్పే! ఇది చాలదన్నట్టు విశాఖ నగరంలోని మధురవాడ ఐ.టి సెజ్‌లో 130 ఎకరాల భూమిని నామమాత్రపు ధరకు అదానీ డేటా సెంటర్‌కు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కేటాయించింది. దీని విలువ సుమారు 2,600 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా! రాష్ట్ర ప్రభుత్వానికి అదానీ గ్రూపు కట్టింది మాత్రం కేవలం 130 కోట్ల రూపాయలు! తాజాగా కేంద్రం తలపెట్టిన అమ్మకాల ప్రక్రియ పూర్తయిన తరువాత ఆంధ్రప్రదేశ్ కాస్తా అదానీ ప్రదేశ్‌గా మారినా ఆశ్చర్యపడనవసరం లేదు. ప్రధాన ప్రతిపక్షం టిడిపి సైతం నిర్మలమ్మ ప్రతిపాదనలపై నోరు విప్పడం లేదు.
ప్రైవేటీకరణ వ్యతిరేక పోరు రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామాలు చోటుచేసుకుండటం గమనార్హం. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి ప్రతిపక్ష టిడిపితో పాటు అధికార వైసిపి కూడా మద్దతు పలికింది. ఆ స్ఫూర్తితోనే ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు, ఆస్తుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం నడుం కట్టాలి. దానికి భిన్నంగా ఏ కారణంతోనైనా కేంద్ర ప్రభుత్వ ఒత్తిళ్లకు లంగితే రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేయడమే అవుతుంది.










