Apr 23,2023 22:20

సిపిఎం, సిపిఐ రాజకీయ ప్రచారభేరి సభలో నేతలు
ప్రజాశక్తి - ఏలూరు

             బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రమాదం నుండి దేశాన్ని కాపాడుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్‌, సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి, సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి కె.మన్నవకృష్ణ చైతన్య పిలుపునిచ్చారు. సిపిఎం, సిపిఐ రాజకీయ ప్రచార భేరి యాత్రలో భాగంగా ఆదివారం సాయంత్రం స్థానిక ఆర్‌ఆర్‌పేట పార్క్‌ వద్ద సిపిఐ, సిపిఎం ఏలూరు నగర కమిటీల ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు సిపిఎం ఏలూరు నగర కార్యదర్శి పి.కిషోర్‌, సిపిఐ నగర కార్యదర్శి ఉప్పులూరి హేమశంకర్‌ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన డేగా ప్రభాకర్‌, ఎ.రవి, మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. మోడీ, అమిత్‌షా నాయకత్వంలో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ కూటమి ప్రజల మధ్య మతవిద్వేషాలు రాజేస్తున్నాయని విమర్శించారు. మరోవైపు అదానీ, అంబానీ వంటి అతి సంపన్నులకు దేశ సంపదను దోచిపెడుతున్నాయని విమర్శించారు. అనేకమంది త్యాగధనుల స్వతంత్య్ర పోరాట స్ఫూర్తితో బ్రిటిష్‌ వారిని ఎదిరించి సాధించుకున్న స్వాతంత్య్రం పెను ప్రమాదంలో పడిందని, దాన్ని కాపాడుకోవడానికి ప్రజలు మరోసారి జాతీయోద్యమ స్ఫూర్తితో ఉద్యమించాల్సిన సమయం వచ్చిందన్నారు. బ్యాంకులు, ప్రభుత్వ రంగ పరిశ్రమలు, వాడరేవువులు ఆఖరికి మనందరికీ అన్నం పెట్టే వ్యవసాయాన్ని సైతం కార్పొరేట్‌ సంస్థలకు బిజెపి కట్టబెడుతుందని విమర్శించారు. మోడీ ప్రభుత్వం అండదండలతో ఆదానీ ఏవిధంగా ప్రపంచాన్ని మోసం చేసి రూ.లక్షల కోట్లు కొల్లగొట్టినట్లు హిండెన్‌ బర్గ్‌ నివేదిక బయటపెట్టిందని గుర్తు చేశారు. దానిమీద విచారణకు అంగీకరించకుండా ఆదానీకి కేంద్ర ప్రభుత్వం కొమ్ముకాయడాన్ని తప్పుబట్టారు. ఇంత జరుగుతున్నప్పటికీ అధానీ, అంబానీ తదితర కార్పొరేట్‌ సంస్థలకు దేశంలోని అడవులు, భూములు, విద్యుత్‌ ప్రాజెక్టులు, గనులు తదితర సంస్థలన్నీ కార్పొరేట్‌ సంస్థలకు అక్రమంగా కట్టబెడుతున్నారని విమర్శించారు. మరోవైపు పేదలపై, సామాన్య ప్రజలపై మోడీ ప్రభుత్వం గ్యాస్‌, పెట్రోలు, డీజిల్‌, విద్యుత్‌ ఛార్జీలను పెంచి నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వడం లేదన్నారు. కార్మికులు స్వాతంత్య్ర కాలం నుండి పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను, పెట్టుబడిదారులకు అనుకూలంగా నాలుగు లేబర్‌ కోడ్‌లుగా మారుస్తోందని విమర్శించారు. విద్య, వైద్యం, సామాన్య ప్రజలకు అందని ద్రాక్షగా మారిందన్నారు.ఉపాధి హామీ చట్టాన్ని నీరుగారుస్తోందని విమర్శించారు. ఎరువులు, పురుగుమందుల ధరలు పెంచి గిట్టుబాటు ధర కల్పించకుండా రైతులు దివాళాతీసే పరిస్థితికి తీసుకవస్తున్నారన్నారు. మహిళలకు, దళితులకు, మైనార్టీలకు, గిరిజనులకు దేశంలో రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. ఈ దుర్మార్గాలను, మతతత్వ కార్పొరేట్‌ కూటమి దుర్నీతిని ప్రశ్నించకపోతే దేశ లౌకిక రాజ్యాంగాన్ని కాపాడుకోలేమన్నారు. మోడీ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశాయని, ప్రత్యేక హోదా, విభజన హామీలు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, రాజధాని నిర్మాణం, రైల్వే జోను, వెనకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు నిధులు, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ తదితర అనేక అంశాల్లో రాష్ట్రానికి బిజెపి అన్యాయం చేస్తోందని విమర్శించారు. కేంద్రంపై ఒత్తిడి పెంచి రాష్ట్రానికి నిధులు రాబట్టాల్సిన వైసిపి మోడీకి లొంగిపోయారని విమర్శించారు. అంతేకాక రాష్ట్ర ప్రభుత్వం బిజెపి చెప్పినట్లు చెత్త సేకరణ, ఆస్తి పన్నులు, విద్యుత్‌ ఛార్జీలు తదితర భారాలను పెంచుకుంటూ పోతుందని విమర్శించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలైన తెలుగుదేశం, జనసేనలు బిజెపిని నిలదీయడం లేదన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సిపిఐ, సిపిఎం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై అంబేద్కర్‌ జయంతి రోజు నుండి మేడే వరకూ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను చైతన్యపరచడానికి ప్రచార భేరి యాత్రలను నిర్వహిస్తున్నాయని తెలిపారు. అనంతరం సిపిఎం జిల్లా నాయకులు బి.సోమయ్య, సిపిఐ రాష్ట్ర కంట్రోల్‌ కమిషన్‌ సెక్రటరీ బండి వెంకటేశ్వరరావులు మాట్లాడారు. ఈ సభలో సిపిఎం జిల్లా కమిటీ నాయకులు కె.శ్రీనివాస్‌, ఎ.శ్యామలారాణి, పి.ఆదిశేషు, నగరనాయకులు, బి.సాయిబాబు, జి.రవికిషోర్‌, కె.రామాంజనేయులు, గోపి, సిపిఐ నాయకులు కడుపు కన్నయ్య, ప్రసాద్‌, సుబేదార్‌ ఖాన్‌, కొండేటి రాంబాబు, కొండేటి బేబీ, ఎం.విజయ, లోకేష్‌, తెరలాపు శ్రీను, రవి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నిర్వాసితులను పట్టించుకోరా
         కుక్కునూరు:ఏళ్లు గడుస్తున్నా పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పరిహారం ఊసేలేదని, వారి సమస్యలు పరిష్కారం కావడం లేదని, ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప నిర్వాసితుల కష్టాలు తీరడం లేదని, ఓ వైపు నిర్వాసితులను త్యాగధనులని కీర్తిస్తూనే నిర్వాసితును పట్టించుకోరా అని సిపిఎం, సిపిఐ నేతలు ప్రభుత్వ తీరును విమర్శించారు. బిజెపిని గద్దెదించుదాం.. దేశాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో సిపిఎం, సిపిఐ ఆధ్వర్యాన చేపట్టిన రాజకీయ ప్రచారభేరి యాత్ర ఆదివారం మండలంలోని సీతారామనగరంలో ప్రారంభమైంది. శ్రీధర, వేలేరు, వెంకటాపురం, అల్లిగూడెం, బోనగిరి, బంజరుగూడెం, అమరవరం, రాజీవ్‌నగర్‌, ఉప్పేరు, దామరచర్ల, పెదరావిగూడెం, చీరవల్లి గ్రామాల్లో సాగింది. బిజెపి అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రతీ గ్రామంలో ప్రజలను చైతన్యం చేస్తూ మోడీ చేసే వ్యతిరేక పనులను వివరిస్తూ యాత్ర సాగింది. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి మైసాక్షి వెంకటాచారీ మాట్లాడుతూ గత పదేళ్లుగా పూర్తి స్థాయిలో ఏ ఒక్క నిర్వాసితుడికీ పరిహారం చెల్లించకుండా గాలికొదిలేసి పోలవరం ముంపు పేరుతో రోడ్లు, విద్యావైద్యం, విద్యుత్‌, తాగునీరు వంటి మౌలిక వసతులు పట్టించుకోకుండా నిర్వాసితుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. సర్వేల పేరుతో నిర్వాసితులను అయోమయానికి గురిచేయడం సరికాదని, నేటికీ పూర్తి పునరావాస పరిహారపు జాబితా ప్రకటించకపోతే పరిహారం ఎలా చెల్లిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తక్షణం నిర్వాసితులకు పూర్తి పరిహారం చెల్లించి కలనీలకు తరలించాలని డిమాండ్‌ చేశారు. సిపిఎం మండల కార్యదర్శి యర్రంశెట్టి నాగేంద్రరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించకుండా, గ్యాస్‌, పెట్రోల్‌, నిత్యావసర వస్తువుల ధరలను అమాంతం పెంచి పేద, మధ్య తరగతి ప్రజలపై భారాలు మోపిందన్నారు. కార్పొరేట్‌ శక్తులకు దేశ సంపదను దోచిపెడుతుందన్నారు. మోదీ ప్రభుత్వతీరును ప్రజలకు వివరిస్తూ బిజెపిని గద్దెదించి, దేశాన్ని కాపాడుకునేందుకు ఈ ప్రచార యాత్ర ప్రారంభించినట్లు తెలిపారు. ఈ యాత్రలో సిపిఎం నాయకులు యర్ణం సాయికిరణ్‌, వలీ పాషా, రమేష్‌, మోహనరావు, సిపిఐ నాయకులు కొన్నే లక్ష్మయ్య, వరకా శ్యామల, వరసా నాగేశ్వరరావు, వి.నరసింహారావు, రమణయ్య పాల్గొన్నారు.