Mar 02,2023 00:24

విలేకర్లతో మాట్లాడుతున్న నాయకులు

ప్రజాశక్తి - నరసరావుపేట : వైసిపి పాలనలో ప్రజలపై దాడులతోపాటు బీసీలను ప్రత్యేకంగా టార్గెట్‌ చేసిందని, తెలుగు యువత అధికార ప్రతినిధి గోళ్ల సురేష్‌ యాదవ్‌పై దాడి ఇందుకు తాజా ఉదాహరణని టిడిపి బిసి సెల్‌ పల్నాడు జిల్లా అధ్యక్షులు ఎం.రాంబాబు మండిపడ్డారు. ఈ మేరకు స్థానిక టిడిపి జిల్లా కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. టిడిపి కార్యకర్తలు తమ ఇళ్లల్లో శుభకార్యాల సందర్భంగా ఫ్లెక్సీలు వేస్తుంటే వాటిని వైసిపికి చెందిన వారు చింపేస్తున్నారని, కారంపూడి మండలం మిరియాల గ్రామంలో బత్తుల ఆవులయ్యా కుటుంబంలో ఫంక్షన్‌కు టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జిని ట్రాక్టర్‌పై తీసుకెళ్లినందుకు ఆ ట్రాక్టర్‌ను తగలబెట్టారని అన్నారు. నరసరావుపేట పార్లమెంట్‌ టిడిపి బీసీ సెల్‌ ప్రధాన కార్యదర్శి గోరంట్ల నాగేశ్వరావుపై కారంపూడిలో పట్టపగలే రాడ్లతో దాడి చేశారని, నరసరావుపేట మండలం కేసనపల్లిలో టిడిపి కార్యకర్తలపై దాడి చేశారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసిపికి బీసీలు బుద్ధి చెప్పాలని కోరారు. సమావేశంలో నాయకులు ఒ.ఆనంద్‌, టి.నరసింహారావు, పి.బసవేశ్వరరావు, ఎ.శ్రీనివాసరావు, జి.శ్రీనివాసరావు, డి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.