ప్రజాశక్తి - సత్తెనపల్లి టౌన్ : బీసీలను నయ వంచనకు గురిచేసిన టిడిపి, జనసేన పార్టీలను తరిమేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, పల్నాడు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కారుమూరి నాగేశ్వరావు అన్నారు. పట్టణంలోని శరభయ్య గ్రౌండ్‌లో జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అధ్యక్షతన నియోజకవర్గం స్థాయి బీసీ గర్జన సభ మంగళవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి మాట్లాడుతూ 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి చంద్రబాబు బీసీలకు ఏం చేశారని ప్రశ్నించారు. బీసీలను ఓటు యంత్రాలుగానే చూసి వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. జగన్‌మోహన్‌రెడ్డి తన పాదయాత్రలో బీసీ డిక్లరేషన్ హామీనిచ్చి అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేశారని చెప్పారు. 136 బీసీ సామాజిక తరగతులను గుర్తించి వారికోసం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారన్నారు. రాజ్యసభలో నలుగురు బీసీలు, లోక్‌సభలో ఏడుగురికి అవకాశం కల్పించారని, సత్తెనపల్లి నియోజకవర్గం నుండి నిమ్మకాయల రాజనారాయణను గుంటూరు మార్కెట్ యార్డు చైర్మన్‌గా నియమించగా నాగార్జున యాదవ్‌కు ఉన్నత విద్యా అభివృద్ధి చైర్మన్‌గా నియమించారని వివరించారు. బీసీలను వలలో వేసుకోవడానికి చంద్రబాబు, లోకేష్, పవన్‌కల్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా పరుగులు పెడుతున్నారని ఎద్దేవ చేశారు. అధికారంలో ఉండగా బీసీలను విస్మరించిన చంద్రబాబు ఇప్పుడు కపట ప్రేమ నటిస్తున్నారని, ఆయన్ను నమ్మొద్దని కోరారు. రానున్న ఎన్నికల్లో వైసిపికి అండగా నిలవాలని కోరారు. అనంతరం రాజనారాయణ, నాగార్జున యాదవులను సత్కరించారు. కార్యక్రమంలో మంత్రి విడుదల రజిని, ఎంపీలు లావు శ్రీకృష్ణ దేవరాయలు, బి.మస్తాన్‌రావు, ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, ఎమ్మెల్యేలు ఎన్.శంకర్రావు, జి.శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు యర్రం వెంకటేశ్వరరెడ్డి, టి.వెంట్రావు, యార్డు చైర్మన్ బాబురావు, సూరిబాబు, మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, డాక్టర్ గీత హాసంతి పాల్గొన్నారు.










