ప్రజాశక్తి-రేపల్లె: బీసీ సామాజిక వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించి వారి సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి విశేష కృషి చేశారని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణరావు అన్నారు. ఆయన స్వగృహంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిసిలకు సంబంధించిన పలు రాజకీయ అంశాలను ప్రస్తావించారు. ఇటీవల టీడీపీ నాయకులు యువగళం పాదయాత్రలో భాగంగా ఒంగోలులో ఏర్పాటు చేసిన బీసీ సామాజికవర్గాల బహిరంగ సభలో ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయటాన్ని ఖండిం చారు. నియోజకవర్గంలోని ఉప్పాలపాలెంలో దారుణ హత్యకు గురైన చిన్నారి అమర్నాథ్‌గౌడ్ కుటుంబ సభ్యులతో ప్రభుత్వం సత్వరసాయం అందించినప్పటికీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడించటం దుర్మార్గమని అన్నారు. బీసీలకు నేను క్షమాపణలు చెప్పాలని టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర చేసిన వ్యాఖ్యల పట్ల స్పందించారు. సభలో పింఛన్ తీసుకుంటున్న మహిళ చేత ఫించన్ రావటం లేదని చెప్పించటం పెయిడ్ ఆర్టిస్టుల ఫేక్ పనులు కాదా అని ప్రశ్నించారు. బీసీల సంక్షేమానికి ప్రత్యేక బడ్జెట్ పెట్టి నేతన్న నేస్తం, మత్యకార భరోసా, గీత కార్మికులకు, నాయీ బ్రాహ్మణులకు వివిధ కులవృత్తుల వారికి చేదోడుగా ఉండి పలు పథకాలను అందజేసినట్లు చెప్పారు. రానున్న ఎన్నికల్లో బీసీ, ఎస్సి, ఎస్‌టి మైనార్టీలు ముఖ్యమంత్రికి అండగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు గడ్డం రాధాకృష్ణమూర్తి, వైస్ చైర్మన్ జీ ప్రశాంత్ కుమార్, నాయకులు బొర్రా శ్రీనివాసరావు, బేతపూడి కోటేశ్వరరావు పాల్గొన్నారు.










