Oct 09,2023 00:14

రాష్ట్రస్థాయి విస్తృత సమావేశంలో మాట్లాడుతున్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకరరావు

ప్రజాశక్తి - తాడేపల్లి రూరల్‌ : బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం కుంచనపల్లిలోని ఓ హోటల్లో ఆదివారం నిర్వహించారు. సమావేశానికి రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. అనంతరం విలేకర్లతో రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీల అభ్యున్నతికి 7 అంశాలను ఎజెండాగా ప్రవేశపెట్టామన్నారు. ఇటీవల పార్లమెంట్లో ఆమోదించిన మహిళా రిజర్వేషన్‌ బిల్లులో 33 శాతం వాటాలో ఓబీసీ మహిళలకు వాటా ఎంత అనే అంశంపై చేర్చకపోవడాన్ని వ్యతిరేకరిస్తున్నట్లు చెప్పారు. బీసీల్లో చైతన్యం కోసం బస్సు యాత్ర చేస్తామని, అన్ని జిల్లాల్లో బీసీ భవన్ల నిర్మాణానికి చర్యలు చేపడతామని చెప్పారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించవలసిన పాత్రను గురించి చర్చించామన్నారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్‌ కల్పించాలని, బ్యాక్‌ లాగ్‌ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు కె.క్రాంతి కుమార్‌, ఎ.నాగమల్లేశ్వరరావు, కె.కమల, పి.మహేష్‌ పాల్గొన్నారు.