ప్రజాశక్తి-ఆలూరు
బీసీ విద్యార్థుల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ తెలిపారు. శుక్రవారం ఆలూరులోని ప్రగతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణలో ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహాన్ని జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి వెంకటలక్ష్మమ్మ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జయరామ్ మాట్లాడారు. వెనుకబడిన నియోజకవర్గంలో విద్యార్థులు చదువుకు దూరం కాకూడదని, విద్యార్థులు తక్కువగా ఉన్నారనే నెపంతో మూసి వేస్తున్న హాస్టల్ గురించి ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు తమ దృష్టికి తెచ్చారని తెలిపారు. అధికారులతో మాట్లాడి హాస్టల్‌ను ఆలూరుకు మార్చినట్లు చెప్పారు. పక్క మండలాల నుంచి వచ్చి ఆలూరులో చదివే బీసీ విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని బాగా చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. వైసిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జీ గుమ్మనూరు నారాయణ స్వామి, మండల కన్వీనర్ వీరేష్, బీసీ సంక్షేమ శాఖ జిల్లా అసిస్టెంట్ అధికారి లక్ష్మీనారాయణ, హాస్టల్ వెల్ఫేర్ అధికారి శివుడు, వార్డెన్లు సంపత్ కుమార్, విశ్వనాథ్ రెడ్డి, మాదప్ప, మర్రెమ్మ, అనిమిరెడ్డి, కోటేశ్వరయ్య, వలీ పాల్గొన్నారు.
హాస్టల్‌ను ప్రారంభించిన మంత్రికి కృతజ్ఞతలు
- ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ
హాస్టల్‌ను ప్రారంభించిన మంత్రి జయరామ్‌కు ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పేద విద్యార్థుల వసతి కోసం మంత్రి గుమ్మనూరు జయరామ్‌ను ఎస్‌ఎఫ్‌ఐగా కోరగా హాస్టల్‌ను ఆలూరుకు మార్చి నూతన బీసీ బాలుర వసతి గృహాన్ని ప్రారంభించినందుకు మంత్రి, ఆయన సోదరుడు నారాయణ స్వామి, జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారులకు డివైఎఫ్‌ఐ మండల కార్యదర్శి మైనా, ఉపాధ్యక్షులు గోవర్ధన్, ఎస్‌ఎఫ్‌ఐ మండల అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మీనారాయణ, పోతురాజు కృతజ్ఞతలు తెలిపారు.
బీసీ హాస్టల్‌ను ప్రారంభిస్తున్న మంత్రి గుమ్మనూరు










