Jun 28,2023 00:02

మోపిదేవికి వినతి పత్రం ఇస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

ప్రజాశక్తి - రేపల్లె : రేపల్లె నియోజవర్గ పరిధిలోని నగరం, నిజాంపట్నంలోని బీసీ హాస్టళ్లను ప్రారంభించాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావుకు మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి. మనోజ్‌ కుమార్‌ బి. ఆర్య మాట్లాడుతూ 2019 కరోనా సమయంలో మూసివేసిన హాస్టళ్లను నేటి వరకూ ప్రారంభించలేదన్నారు. నిజాంపట్నం తీర ప్రాంతంలో అధికంగా మత్స్యకార కుటుంబాలు నివసిస్తున్నాయని తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లిన సమయంలో 10 నుంచి 15 రోజులపాటు సముద్రంలోనే ఉంటారని తెలిపారు. ఆ సమయంలో వారి పిల్లలు హాస్టల్లో ఉండి చదువుకుంటారన్నారు. తీర ప్రాంత విద్యార్థులకు ఆసరాగా ఉన్న హాస్టలను గత మూడు ఏళ్లగా ప్రారంభించకపోవడం దారుణమన్నారు. ఐదు కిలోమీటర్ల పరిధిలో విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వబోమని అధికారులు చెప్పడం సిగ్గుచేటు అని తెలిపారు. కరోనా తర్వాత ప్రజల జీవన ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో వలస వెళ్లే కుటుంబాలు పెరిగాయన్నారు. ఈ తరుణంలో విద్యార్థుల పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నించారు తల్లిదండ్రులు కష్టపడిన తమ కష్టం పిల్లలు పడకూడదని ఉద్దేశంతో చదువుకోడానికి ఆసరాగా ఉన్న హాస్టల్‌ మూసివేస్తే ఎస్‌ఎఫ్‌ఐ చూస్తూ ఊరు కోదన్నారు. వెంటనే హాస్టళ్లను ప్రారంభించి అడ్మిషన్లు కల్పించాలని డిమాండ్‌ చేశారు ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ పట్టణ కార్యదర్శి సూర్య ప్రకాష్‌, నాయకులు హేమ మాధవి తదితరులు పాల్గొన్నారు.