ప్రజాశక్తి - కోసిగి రూరల్
ఒకే సారి డబ్బు సంపాదించాలని అనుకున్నాడో ఏమో పాపం ఆ వ్యక్తి పొదుపు మహిళలనే టార్గెట్ చేశాడు. పొదుపు మహిళలు అప్పు కట్టడానికి ఇచ్చిన డబ్బులను బ్యాంకుకు కట్టకుండా ఖాతాదారులకు పేపర్‌పై సీల్ వేసి సంతకం చేసి పంపించేవాడు ఓ ఎస్‌బిఐ బ్యాంకుకు సంబంధించిన బీసీ పాయింట్ నిర్వాహకుడు నీలి నరసింహులు. ఈయన బాగోతం వెలుగులోకి రావడంతో ఎస్‌బిఐ మేనేజర్, బీసీ పాయింట్ నిర్వాహకుని ఐడిని లాక్ చేశారు. బీసీ పాయింట్ బంద్ కావడంతో పొదుపు మహిళలు, బ్యాంకు ఖాతాదారులు తమ ఖాతాలను చెక్ చేసుకోవడానికి మేనేజర్‌ను కలిశారు. మినీ స్టేట్‌మెంట్ తీసేసరికి బీసీ పాయింట్ నిర్వాహకుని బాగోతం బయటపడింది. ఖాతాదారులు లబోదిబోమంటున్నారు.
బీసీ పాయింట్ నిర్వాహకుడు చేసిన నిర్వాకానికి ఎస్‌బిఐ అధికారులు తలదించుకునే పరిస్థితి ఎదురైంది. కోసిగిలో వందలాది పొదుపు గ్రూపులున్నాయి. నెలనెలా పొదుపుతో పాటు అప్పు చెల్లించడానికి వచ్చిన పొదుపు మహిళలను టార్గెట్ చేశాడు. అప్పుతో పాటు పొదుపు కట్టడానికి వచ్చిన మహిళలకు పేపర్‌పై సంతకం, సీల్ వేసి డబ్బులు కట్టినట్లు రిసీప్ట్ ఇచ్చి పొదుపు మహిళలను మోసం చేసున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. కోసిగిలోని శివ పొదుపు గ్రూపునకు చెందిన మహిళలు రూ.10 వేలు పొదుపు అప్పునకు జమ చేయాలని ఇస్తే, జమ చేయకుండా పేపర్‌పై సీల్ వేసి సంతకం చేసి బీసీ పాయింట్ నిర్వాహకుడు డబ్బులు దండుకుంటున్నారని శివ పొదుపు గ్రూపు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటేశ్వర్ పొదుపు గ్రూపు మహిళలు రూ.22 వేలు పొదుపు ఖాతాకు జమ చేయమని ఇస్తే రూ.2 వేలు మాత్రమే జమ చేసి మోసం చేశాడని తెలిసింది. మరో పొదుపు గ్రూపు మహిళలు రూ.27,500 పొదుపు ఖాతాకు జమ చేయమని వెళితే రూ.7,500 మాత్రమే ఖాతాకు జమ చేసి మోసం చేశాడని పేర్కొన్నారు. ఎస్‌బిఐ మేనేజర్ గమనించి బీసీ పాయింట్ నిర్వాహకుని ఐడిని లాక్ చేశారని సమాచారం. ఈ విషయం ఆ నోట ఈ నోట తెలియడంతో కోసిగి ఊరు వాకిలి దగ్గర ఉన్న బీసీ పాయింట్‌లో కట్టిన ఖాతాదారులు తమ అకౌంటుకు సంబంధించి మినీ స్టేట్‌మెంట్ కోసం క్యూ కట్టినట్లు తెలిసింది. దాదాపు లక్షలాది రూపాయలు ఖాతాలోకి వేయకుండా బీసీ పాయింట్ నిర్వాహకుడు పొదుపు ఖాతాదారులను మోసం చేశాడన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. తాము కట్టిన డబ్బులను తిరిగి ఇప్పించాలని, లేదా తమ పొదుపు అప్పుకు జమ చేయాలని ఖాతాదారులు కోరుతున్నారు. ఈ విషయంపై ఎస్‌బిఐ మేనేజర్ అనిల్ కుమార్‌ను వివరణ కోరగా... ఖాతాదారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నరసింహులు బీసీ పాయింట్ బీసీ కరస్పాండెంట్ నుంచి పూర్తిగా తొలగించి బీసీ ఐడిని క్లోజ్ చేశామన్నారు. ఆ బీసీ పాయింట్‌కు సంబంధించి లావాదేవీలో ఏవైనా సమస్యలుంటే ఖాతాదారులు తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
విలేకరుల ముందు వాపోతున్న పొదుపు మహిళలు










