Mar 24,2023 01:04
మాట్లాడుతున్న బీసీ నాయకులు

ప్రజాశక్తి-బాపట్ల: మా ఓట్ల ప్రకారం మాకు సీట్లు ఇవ్వాల్సిందేనని బహుజన కులాల ఐక్యవేదిక నాయకులు పేర్కొన్నారు. బుధవారం బాపట్ల పట్టణంలో ఎమ్మెస్సార్‌ కళ్యాణ మండపంలో నిర్వహించిన బీసీ కులాల దళిత గిరిజన మైనార్టీ వర్గాల సామాజిక రాజకీయ స్థితిగతులపై ఇష్టా గోష్టి చర్చ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాపట్ల జిల్లా బిసి జాయింట్‌ యాక్షన్‌ కమిటీ అధ్యక్షులు గొర్ల శ్రీనివాసరావు (మేధా శీను) పర్యవేక్షణలో నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎల్‌ వెంగళరావు యాదవ్‌ మాట్లాడారు. ఓటర్లలో 15శాతం లోపు ఉన్న అగ్రకులాలు 73శాతం రిజర్వేషన్లు పొందుతున్నారు. 85 శాతం ఉన్న బహుజనులు 27శాతం రిజర్వేషన్‌ మాత్రమే రిజర్వేషన్‌ పొందుతున్నారని, దీనిపై బీసీలకు పూర్తి స్థాయిలో అన్యాయం జరుగుతుందన్న విషయాన్ని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. కుల జనగణన నిర్వహించి జనాభా ప్రాతిపదికన చట్టసభల్లో సీట్లు ఇవ్వాలని ఈ సందర్భంగా పలువురు నేతలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు. బీహార్‌, ఒరిస్సా, రాష్ట్రాల్లో మాదిరిగా ఆంధ్ర రాష్ట్రంలో కుల జనగణన నిర్వహించాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు పదవులు ఇచ్చి అధికార పగ్గాలు వారి చేతుల్లోనే పెట్టుకుంటున్నారన్నారు. బీపీ మండల్‌ కమిషన్‌ సిఫార్సులు పూర్తిస్థాయిలో అమలు చేయాలన్నారు. 50శాతం పైగా రిజర్వేషన్‌ కల్పించాలన్నారు. జస్టిస్‌ రోహిణి కమిటీ సిఫార్సులు బహిర్గతం చేయాలని సమావేశం డిమాండ్‌ చేసింది. బిసి వర్గాలకు జరుగుతున్న అన్యాయాలపై ఆయా సంఘాల నాయకులు ప్రభుత్వ విధానాలపై విరుచుకు పడ్డారు. పలు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కనీసం నిధులను వారికి అందాల్సిన నిధులను వారి దరి చేరనీయకుండా ప్రభుత్వమే స్వాహా చేసిందని నాయకులు విమర్శించారు. సమావేశానికి డాక్టర్‌ ఆలా వెంకటేశ్వర్లు అధ్యక్షత వహిం చారు. కార్యక్రమంలో ఎంపీ బీద మస్తాన్‌రావు, మాజీ ఎమ్మెల్యే పాలేటి రామారావు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాడికొండ నరసింహారావు, ఆవుల నరసింహారావు, దర్శి భాస్కరరావు, బొంత సుబ్బా రావు, చల్లా రామయ్య, ఎస్టి కులాల సంఘం నాయకులు ధర్మా, జిల్లా నాయీ బ్రాహ్మణుల సంఘం అధ్యక్షులు పులివర్తి శ్రీనివాసరావు, అంగిరేకుల ఆదిశేషు, చేజర్ల సతీష్‌, తాళ్ల వెంకటేష్‌ యాదవ్‌, గవిని కృష్ణమూర్తి, అశ్వినీ కుమార్‌, పఠాన్‌ రాజేష్‌, బీసీ నాయకులు పాల్గొన్నారు.