ఖాజీపేట : మండలంలో విషాదం చోటుచేసుకుంది. కొత్త నెల్లూరు సమీపంలోని బీరం శ్రీధర్‌రెడ్డి పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థి సోహిత్(11) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ సంఘటన జిల్లాలో కలకలం రేపింది. మృతుడు సోహిత్ తల్లిదండ్రులు నాగరాజు, లలిత పాఠశాల ఆందోళనకు దిగారు. పాఠశాల సిబ్బంది కొట్టడంతోనే తమ బిడ్డ మృతి చెందారని తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. మృతదేహంపై కమిలిన గాయాలు ఉండడంతో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. పులివెందులకు చెందిన సోహిత్ బీరం శ్రీధర్‌రెడ్డి పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. పాఠశాలలోని వసతి గృహంలో ఉంటూ విద్యను అభ్యసిస్తున్నాడు. శనివారం ఉదయం విద్యార్థి కడుపునొప్పిగా ఉందని చెప్పడంతో పాఠశాల యాజమాన్యం.. విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. విద్యార్థిని ద్విచక్ర వాహనంలో చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోని మృతి చెందాడు. విద్యార్థి మృతదేహాన్ని పాఠశాల వద్దకు తీసుకెళ్లి పరిశీలించగా శరీరంపై కమిలిన గాయాలు ఉండడంతో విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుగా మున్నీరుగా విలపించారు. సోహిత్ శరీరంపై గాయాలు ఉండటంతో పాఠశాల వద్దకు వచ్చి ప్రశ్నిస్తే తమకు తెలియదని పాఠశాల యాజమాన్యం సమాధానం దాటవేశారన్నారు. విద్యార్థి మృతికి పాఠశాల యాజమాన్యం, హాస్టల్ వార్డనే కారకులని పూర్తిస్థాయిలో విచారణ జరిపి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. వసతి గృహంలో ఉంటున్న సిబ్బంది తమ బిడ్డను కొట్టారని బంధువులు ఆరోపించారు. హాస్టల్లో ఏం జరిగిందో సిసి కెమెరాల పుటేజీని పరిశీలించాలని కోరినా పోలీసులు కానీ పాఠశాల యజమాన్యం కానీ స్పందించలేదని తల్లిదండ్రులు ఆరోపించారు. తమకు న్యాయం జరిగేంతవరకు కదిలే ప్రసక్తే లేదని విద్యార్థి బంధువులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘ నాయకులు పాఠశాల ఎదుట బైఠాయించారు. యాజమాన్యం వచ్చి విషయం చెప్పేంతవరకూ ఇక్కడ నుంచే కదిలే ప్రసక్తే లేదంటూ ఆందోళనకు దిగారు. ఆందోళనకారులు పాఠశాల కిటికీ అద్దాలను పగలగొట్టారు. సాయంత్రం నాలుగు గంటల వరకు పాఠశాల ఆవరణంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మైదుకూరు డిఎస్‌పి శ్రీధర్‌గౌడ్, సిఐలు నరేంద్రారెడ్డి, వెంకట చలపతి, అశోక్‌రెడ్డి, ఎస్‌ఐ కులాయప్ప సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపుచేసే ప్రయత్నం చేశారు. ఒకానొక సందర్భంలో ఘర్షణ వాతావరణం నెలకొనడంతో ఘర్షణ చోటు చేసుకోకుండా భారీగా మోహరించిన పోలీసులు ఆందోళనకారులపై లాఠీఛార్జ్ చేశారు. పోలీసులు జోక్యంతో తల్లిదండ్రులు, బంధువులు సోహిత్‌ను పోస్టుమార్టంకు రిమ్స్‌కు తరలించారు. సోహిత్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
తమకు న్యాయం చేయాలి : సోహిత్ తల్లిదండ్రులు
తమకు న్యాయం చేయాలని సోహిత్ తల్లిదండ్రులు నాగరాజు, లలిత డిమాండ్ చేశారు. తమ కుమారుడు మృతికి పాఠశాల యాజమాన్యమే కారకులని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తమ కుమారుడు మృతి చెందినా పాఠశాల యాజమాన్యం పట్టించుకోకపోవడం, కడుపునొప్పితో బాధపడుతున్నా ఆసుపత్రిలో చేర్పించకపోవడం పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యానికి నిదర్శమని పేర్కొన్నారు. పాఠశాలను సీజ్ చేసి తమకు న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. పోలీస్‌లు సైతం పాఠశాల యాజమాన్యానికే పత్తాసు పలుకుతున్నారని, తమకు న్యాయం చేస్తారన్న నమ్మకం లేదని ఆవేదన వ్యక్తపరిచారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగదన్న నమ్మకం తమలో లేదని అందుకే ఫిర్యాదు చేయలేదని తల్లిదండ్రులు పేర్కొన్నారు.
పాఠశాల
గుర్తింపు రద్దు
బీరం శ్రీధ ర్‌రెడ్డి పాఠశాలలో విద్యార్థి మృతి కార ణంగా పాఠశాలకు అన్ని అను మతులు రద్దు చేస్తూ డిఇఒ రాఘ వరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. జరిగిన ఘటనపై పూర్తి స్థాయిలో ఐదుగురు సభ్యులతో కూడిన నిజనిర్దారణ కమిటీ ఏర్పా టు చేసినట్లు పేర్కొన్నారు. విచా రణ కమిటీ చైర్మన్‌గా ఎండిఎం ఎడి, సభ్యులుగా ఎంఇఒ-1 ఎంఇఒ-2, డిప్యూటీ ఇఒ, తహశీ ల్దార్‌లను నియ మించారు. ఉత్తర ు్వలను తక్షణం అమలయ్యేలా చర్యలు చేపట్టారు. ఆదివారం పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి : సిఐటియు
ఆరవ తరగతి విద్యార్థి సోహైల్ మృతికి కారణమైన బీరం శ్రీధర్‌రెడ్డి విద్యా సంస్థల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కామనూరు శ్రీనివాసులరెడ్డి, బి.మనోహర్ డిమాండ్ చేశారు. విద్యార్థి మృతి బాధాకరమన్నారు. విద్యార్థి మృతిపై విచారణ చేపట్టాలన్నారు. విద్యా సంస్థల గుర్తింపును వెంటనే రద్దు చేయాలన్నారు. లక్షలాది రూపా యలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి పీక్క తింటున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
విద్యా సంస్థను సీజ్ చేయాలి : డివైఎఫ్‌ఐ
విద్యార్థి మృతికి కారణమైన బీరం శ్రీధర్‌రెడ్డి విద్యా సంస్థను సీజ్ చేయాలని, యాజమాన్యంను అరెస్టు చేయాలని డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వి.శివకుమార్ నగర కార్యదర్శి డి.ఎం.ఓబులేసు డిమాండ్ చేశారు. విద్యార్థి కుటుంబానికి రూ.50 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలన్నారు. ఇంటర్మీడియట్, స్కూలు, హాస్టల్, నీట్ కోచింగ్ రకరకాల పేర్లతో నడుపుతూ లక్షలాది రూపాయలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి పీక్క తింటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థి తొడకు గాయమైనట్లు ఉన్నదన్నారు. ఈ విద్యా సంస్థపై అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతోనే యాజమాన్యం అడ్డూఅదుపులేకుండా పోతోందన్నారు. పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ప్రభుత్వ పాఠశాలలకే పరిమితం కాకుండా ప్రయివేట్, కార్పొరేట్ విద్యా సంస్థలను తనిఖీ చేయాలని డిమాండ్ చేశారు
విద్యార్థి మృతిపై విచారణ చేపట్టాలి : విద్యార్థి సంఘాలు
విద్యార్థి మృతిపై విచారణ చేపట్టాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు. యాజమాన్యంపై చర్యలు తీసుకొని విద్యా సంస్థను సీజ్ చేయాలని తెలిపారు. బీరంరెడ్డి పాఠశాలను సీజ్ చేయాలని, విద్యార్థి కుటుంబానికి రూ.50 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొజ్జా తిరుమలేష్ డిమాండ్ చేశారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, డిఇఒ రాఘవరెడ్డి ప్రభుత్వ పాఠశాలలకే పరిమితం కాకుండా ప్రయివేట్ విద్యాసంస్థల్లో పర్యటించాలన్నారు.










