ప్రజాశక్తి -కోటవురట్ల:జీడి, మామిడి సహా హార్టికల్చర్ పంటలకు బీమా సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు ఉమ్మడి విశాఖ జిల్లావ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు, ఉత్తరాంధ్ర జోనల్ ఇన్చార్జి చిక్కాల రామారావు అన్నారు. ప్రభుత్వం ఇటీవల వ్యవసాయ మండలి చైర్మన్‌గా చిక్కాల రామారావు, జిల్లా బీసీ సెల్ అధ్యక్షులుగా పైల రమేష్‌ను నియమించింది. బుధవారం జెడ్పిటిసి సభ్యురాలు స్వగృహం వద్ద చామంతుల శ్రీనివాసరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సన్మాన సమావేశంలో వీరిని మండల వైసిపి నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చిక్కాల రామారావు మాట్లాడుతూ, ప్రధానంగా రైతుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు కృషి చేస్తానన్నారు.
బీసీ సెల్ అధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ, జిల్లా స్థాయి పదవి దక్కేందుకు కృషి చేసిన చిక్కాల రామారావుకు జడ్పిటిసి సభ్యురాలు ఉమాదేవికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సీనియర్ వైసీపీ నాయకులు సిద్ధబత్తుల సత్యనారాయణ, మాజీ జడ్పిటిసి సభ్యురాలు వంతెర వెంకటలక్ష్మి, స్థానిక సర్పంచ్ నూకరత్నం, చౌడువాడ సర్పంచ్ గోపాలకృష్ణ, కొడవటిపూడి మాజీ సర్పంచ్ సత్యనారాయణ, అన్నవరం వైసిపి సీనియర్ నాయకులు బాబ్జి, సహా పలు గ్రామాల సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.










