బీమా రాదు... ఆశ చావదు..
శ్రీ పాడిరైతు గురవమ్మ. తిరుపతి జిల్లా కంచనపల్లి వాస్తవ్యురాలు. రెండేళ్ల కిందట గేదె చనిపోయింది. పశుసంవర్థక శాఖ వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. రూ.15వేలు పరిహారం వస్తుందని చెప్పారు. అయితే ఇప్పటికీ ప్రభుత్వం నుంచి పరిహారం రాలేదు. రూ.78వేలు ఖర్చు పెట్టి గేదెను కొనుగోలు చేశారు. పాడి ఆధారంగా జీవిస్తున్నారు. జీవనాధారమైన గేదె చనిపోవడం, ప్రభుత్వం ఇవ్వాల్సిన బీమా పరిహారం అందకపోవడంతో ఎప్పటికైనా వేస్తారనే ఆశతోనే గురవమ్మ నిరీక్షిస్తోంది. శ్రీ
శ్రీకాళహస్తి రూరల్ పాతగుంట పంచాయతి అమ్మచెరువు గ్రామంలో ఇటీవల కురిసిన వడగళ్లవాన విపత్తుకు మూడు పాడి ఆవులు అక్కడికక్కడే మృతిచెందాయి. వాటి విలువ దాదాపు లక్షన్నర పైనే ఉంటుంది. ఆ సందర్భంగానే గ్రామంలోని రైతులు సాగు చేస్తున్న వరి పూర్తిగా నష్టపోయారు. వ్యవసాయ అధికారులు వచ్చారు.. నష్టం అంచనాలు కట్టి వెళ్లారు. అయితే విపత్తు సందర్భంగా నష్టపోయిన వారికి ఇటీవల నష్టపరిహారాన్ని అందజేశారు. అయితే ఆ గ్రామంలో చనిపోయిన మూడు పశువులకు సంబంధించి గానీ, వరి పంట సంబంధించి గానీ పైసా పరిహారం ఇప్పటికీ అందలేదు. తమగురించి పట్టించుకునే దిక్కు లేదని, అధికార పార్టీ అనుయాయులకు మాత్రమే నష్టపరిహారం అందుతుందని గ్రామస్తులు వాపోతున్నారు. పశువులు ఏవి చనిపోయినా పరిహారం ఇవ్వడం లేదన్నది వారి ఆవేదన.
ప్రజాశక్తి - శ్రీకాళహస్తి
వ్యవసాయం జూదమై ఎపుడు గిట్టుబాటవుతుందో, ఎపుడు కరువు ఉంటుందో అర్ధం కాని అన్నదాతను పాడిపరిశ్రమ ఆదుకుంటోంది. లేదంటే పొట్ట చేత బట్టుకుని ఎన్నో కుటుంబాలు వలస వెళ్లేవే. గత ప్రభుత్వంలో పశువులు ఏదైనా ప్రమాదంలో మృతిచెందితే పాడి పశువుల బీమా పథకం ద్వారా రైతులకు రూ.30వేలు నష్టపరిహారం అందేది. అయితే వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పథకానికి వైఎస్‌ఆర్ పశు నష్టపరిహార పథకం అని పేరు పెట్టారు. పథకం పేరు మార్చి ప్రచారం చేసుకున్నారే తప్ప, పరిహారం మాత్రం అందించడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా ఉచిత పశు బీమా పథకానికి మంగళం పాడి, కొత్త పథకాన్ని తెరపైకి తీసుకురానున్నట్లు సమాచారం. అక్టోబర్ నుంచే ఈ కొత్త పథకం అమల్లోకి రానుందని పశు సంవర్థక శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే పాత పథకంలో పరిహారం అందాల్సిన లబ్దిదారులు ఏళ్ల తరబడి నిరీక్షిస్తూనే ఉన్నారు. తిరుపతి జిల్లాలో గత ఆర్నెళ్లుగా ఉచిత బీమా పథకం కార్యకలాపాలు ఆగిపోయినట్లు రైతులు చెబుతున్నారు.
తిరుపతి జిల్లా వ్యాప్తంగా గతేడాది 2125 మంది రైతులకు ఉచిత బీమా పథకం కిరద రూ.5.75 కోట్లు పరిహారం అందజేయాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు 195 మంది రైతులకు మాత్రమే పూర్తి స్థాయిలో పరిహారమందించామనీ, కేవలం 20 మంది పాడి రైతులకు రూ.60 లక్షల బకాయి మాత్రమే చెల్లించాల్సి ఉందంటూ పశు సంవర్ధక శాఖాధికారులు చెబుతున్న మాట. ఆ పరిహార మొత్తం కూడా సీఎఫ్‌ఎంస్ ఖాతాల్లో భద్రంగా ఉన్నాయనీ, త్వరలోనే రైతులకు చెల్లిస్తామంటూ చెబుతున్నారు. అయితే వాస్తవిక పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. అధికారిక లెక్కలకు, అందాల్సిన లెక్కలకు పొంతన లేకుండా ఉంది.
తెరపైకి కొత్త పథకం
పాడి రైతులను ఆదుకునేందుకు పాలక ప్రభుత్వాలు పశు బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు. గతంలో ఈ పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పాడి రైతులకు నష్టపరిహారం అందేది. ఈ పథకంలో ప్రతి పాడి రైతు పశువుకు బీమా కోసం ప్రీమియం చెల్లించాలి. ప్రీమియం చెల్లించి పశువు ప్రమాదం లేదా సహజమరణం ద్వారా మతి చెందితే రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించేది. ఈ పథకం కింద పశువు చనిపోయిన 15 రోజుల్లోగా రైతుకు నష్టపరిహారం ఇవ్వాలి. అయితే పశువు చనిపోయిన రెండు నుంచి మూడు నెలల్లో రైతులకు నష్టపరిహారం అందుతూ వచ్చేది. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2022లో ఈ పథకాన్ని మార్చి వైఎస్సార్ పశు నష్ట పరిహార పథకం పేరుతో జీవో నెం.3 తెచ్చారు. కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం లేకుండా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే బీమాను చెల్లిస్తుంది. రైతులు ఎటువంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ పథకం ప్రారంభమైన కొత్తలో తమ ప్రభుత్వం రైతులకు కొండంత అండగా నిలిచిందని ప్రభుత్వం గొప్పలు పోయింది. అయితే తర్వాత ఈ పథకాన్ని అటకెక్కించిందని రైతులు ఆరోపిస్తున్నారు. దాదాపు ఆర్నెళ్లుగా ఈ పథకం ఆగిపోయినట్లు రైతులు చెబుతున్నారు.
80 శాతం రాయితీ
కొత్తగా అమల్లోకి వస్తున్న వైఎస్సార్ పశు బీమా పథకం కింద చెల్లించే మొత్తం ప్రీమియంలో 80 శాతాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. 20 శాతం మాత్రమే సన్న, చిన్నకారు రైతులు భరించాల్సి ఉంటుంది. నాటు ఆవులు, గేదెలకు రూ.15 వేలు, మేలు జాతి గేదెలు, ఆవులకు రూ.30 వేల చొప్పున, సన్న జీవాలకు ఒక్కో దానికి రూ.6 వేలు చొప్పున పరిహారం ఇస్తారు. ఏడాదిలో ఒక రైతుకు గరిష్టంగా ఐదు పశువులకు మాత్రమే బీమా వర్తిస్తుంది. గతంలో ఏదైనా విపత్తు బారినపడి చనిపోతే ఒక్కో కుటుంబం పరిధిలో 20 సన్నజీవాలకు రూ.1.20 లక్షలకు మించకుండా పరిహారం చెల్లించేవారు. ఇప్పుడు దాన్ని 50 జీవాలకు గరిష్టంగా రూ.3. లక్షల వరకు పరిహారం పొందేలా విస్తరిస్తున్నారు. గతంలో మూడు అంతకంటే ఎక్కువ సంఖ్యలో మర ణిస్తేనే సన్నజీవాలకు పరిహారం ఇచ్చేవారు. ఇక నుంచి ఒక్క జీవి మరణించినా పరిహారం అందనుంది. అంతేకాదు తొలిసారి ఎద్దులు, దున్నపోతులతో పాటు కరువు బారిన పడిన పశువులకు కూడా బీమా వర్తింప చేయనున్నారు. దేశీయ ఆవులు, గేదెలకు ఒక్కోదానికి ప్రభుత్వం రూ.924 ప్రీమియం భరిస్తుండగా, లబ్ధిదారులు రూ.231, ఎద్దులు, దున్నపోతులకు లబ్ధిదారులు రూ.116, మేకలు, గొర్రెలకు ప్రభుత్వం ఒక్కోదానికి రూ.185 భరిస్తుండగా, లబ్ధిదారులు రూ.46 చెల్లించాల్సి ఉంటుంది.
త్వరలోనే పూర్తి బకాయిలు చెల్లిస్తాం
రవికుమార్, పశుసంవర్థక శాఖ జేడిఎ
గతంలో ఉన్న వైఎస్సార్ ఉచిత పశు నష్టపరిహార పథకం ఆగిన మాట వాస్తవమే. అయితే ఆ పథకం కింద బీమాకు అర్హులైన పాడి రైతులందరికీ పూర్తి స్థాయిలో పరిహారం అందేలా చర్యలు చేపడుతున్నాం. మొత్తం 2125 మంది రైతులుండగా కేవలం 20 మంది రైతులకు మాత్రమే బీమా ఆగింది. మరో రెండు వారాల్లో బీమా నగదు వారి ఖాతాలకు చేరుతుంది. కొత్త బీమా పథకంపై రైతుల్లో అవగాహన పెంచుతున్నాం.
పశువులకు బీమా కొరకు ట్యాగింగ్ చేస్తున్న పశు
వైద్య సిబ్బంది










