Sep 02,2023 00:42

ప్రత్యేక సేవా కేంద్రాన్ని ప్రారంభిస్తున్న బిహెచ్‌ కాలేజి ప్రిన్సిపాల్‌

ప్రజాశక్తి-గుంటూరు : భారతీయ జీవన బీమా సంస్థ 68 సంస్థాపక దినోత్సవం సందర్భంగా శుక్రవారం స్థానిక అరండల్‌పేట 4వ లైనులోని ఎల్‌ఐసి కార్యాలయంలో వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జరిగిన సభకు సీనియర్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ జి.శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. జాతీయకరణ నుండి గత 67 ఏళ్లలో సంస్థ సాధించిన ప్రగతిని, విజయాలను ఆయన వివరించారు. ముఖ్య అతిథిగా హాజరైన బండ్లమూడి హనుమాయమ్మ జూనియన్‌ కాలేజి ప్రిన్సిపాల్‌ పి.సుమతి ప్రసంగిస్తూ 1956లో రూ.5కోట్ల ప్రారంభ పెట్టుబడితో మొదలైన ఎల్‌ఐసి అద్భుత ప్రగతిని సాధిస్తూ నేడు సుమారు రూ.45 లక్షల కోట్ల ఆస్తులు కలిగి ఉండటం అభినందనీయమన్నారు. దేశంలోని అన్ని రంగాలకూ నిధులు కేటాయిస్తూ మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిందని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలు, విపత్తులు సంభవించినప్పుడు సకాలంలో క్లైయిమ్‌లు చెల్లించేందుకు ఎల్‌ఐసి ప్రత్యేక శ్రద్ధ వహించటం సామాజిక కృషికి నిదర్శనమన్నారు. పోటీ వాతావరణంలో సైతం సవాళ్లను ఎదుర్కొని, ఆధునిక టెక్నాలజీని వినియోగించుకుంటూ బీమా మార్కెట్‌లో ఎల్‌ఐసి తిరుగులేని శక్తిగా ఎదిగిందని ప్రశంసించారు. వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక సేవా కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఎల్‌ఐసి మరింత శక్తివంతం చేసేందుకు కృషి చేస్తామని అధికారులు, ఉద్యోగులు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ బ్రాంచి మేనేజర్‌ బి.రవీంద్ర, పాలనాధికారులు ఎమ్‌డి.రఫి, జి.కిషోర్‌కుమార్‌, ఏజెంట్స్‌ యూనియన్‌ జోనల్‌ అధ్యక్షులు బి.మార్కండేయులు, ఐసియు జాయింట్‌ సెక్రెటరీ వివికె.సురేష్‌, పి.వి.రమణ, రాజేంద్రప్రసాద్‌, శ్రీనివాస్‌, శ్రీదేవి పాల్గొన్నారు.