Oct 30,2020 06:58

ఉపగ్రహాల ద్వారా సేకరించే భౌగోళిక, ఇతర సమాచారాన్ని పరస్పరం మార్పిడి చేసుకొనేందుకు ఉద్దేశించిన 'బీకా' ఒప్పందం మీద భారత్‌-అమెరికాలు సంతకాలు చేశాయి. రెండు దేశాల మిలిటరీ, ఇతర సంబంధాలలో దీన్నొక మలుపుగా పరిగణిస్తున్నారు. సులభంగా చెప్పాలంటే...ఇప్పటి వరకు అమెరికా మనకు అనధికారికంగా అందచేస్తున్న సమాచారాన్ని మరింత వివరంగా అధికారికంగా అందచేయనుంది. లడఖ్‌ సరిహద్దుల్లో చైనా కదలికల గురించి ఇప్పటి వరకు మీడియాకు అందచేసిన సమాచారం, చిత్రాలు, భాష్యాలు అన్నీ కూడా అమెరికా సంస్ధలు అందచేసినవే అన్నది తెలిసిందే. బీకా ఒప్పందం గురించి చాలా కాలంగా రెండు దేశాల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయి. దీంతో అమెరికాతో మన మిలిటరీ బంధానికి మరో ముడి పడుతుంది.
            మాతో పెట్టుకుంటే కంటికి కన్ను, పంటికి పన్ను, దెబ్బకు దెబ్బ తీస్తాం జాగ్రత్త. ఇదీ చైనా అధినేత సీ జిన్‌పింగ్‌ చేసిన తాజా హెచ్చరిక. పరస్పర ప్రయోజనాలు ఇమిడి ఉన్న నౌకా సంబంధ భద్రత, ఉగ్రవాద వ్యతిరేక చర్యల సమన్వయం, సజావుగా సాగే సరఫరా వ్యవస్ధలు, మానవతా పూర్వక ప్రళయాలు సంభవించినపుడు సాయం కోసం అనే పేరుతో అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా, భారత్‌ ఒక చతుష్టయ లేదా చతుర్ముఖ (క్వాడ్‌) కూటమిగా మరింత ముందుకు పోయేందుకు నిర్ణయించుకున్న నేపథ్యంలో జిన్‌పింగ్‌ ఈ హెచ్చరిక చేశారు. ఒక దేశం పేరు పెట్టి అనకపోయినా నాలుగు దేశాలు, ప్రత్యేకించి అందరినీ కూడగడుతున్న, రెచ్చగొడుతున్న అమెరికా గురించి అన్నది స్పష్టం.
             ఏదో ఒక సాకుతో చైనాను రెచ్చగొడుతున్న అమెరికా దక్షిణ చైనా సముద్రంలో తన యుద్ధ నౌకల విన్యాసాలు జరుపుతున్నది. ఇటీవలి కాలంలో చైనా మీద నెపం మోపేందుకు లడఖ్‌లో జరిగిన పరిణామాలను పదే పదే ఉదహరించటం తప్ప మరొకటి లేదు. 'మీరు చైనా మీదకు దూకండి. మీ వెనుక మేము ఉన్నాం' అంటూ మన దేశాన్ని పురికొల్పుతున్నది. నాలుగు దేశాల కూటమిని మిత్ర చతుష్టయంగా పిలుస్తున్నారు. అయితే ఇది దుష్ట చతుష్టయం అని చైనా పరిగణిస్తున్నది. బహుశా ఆ ప్రచార ప్రభావం లేదా అంతర్గతంగా జరుగుతున్న చర్చల సారం కావచ్చు! ఉత్తర ప్రదేశ్‌ బిజెపి అధ్యక్షుడు స్వతంత్రదేవ్‌ సింగ్‌ పాకిస్తాన్‌, చైనాలతో యుద్ధానికి ప్రధాని నరేంద్ర మోడీ తేదీని కూడా ఖరారు చేశారని చెప్పినట్లు సాక్షాత్తూ ఆర్నబ్‌ గోస్వామి రిపబ్లికన్‌ టీవీ పేర్కొన్నది. అతగాడేమీ గల్లీ నేత కాదు, ఆ వార్తను ప్రసారం చేసిన టీవీ బిజెపి అనధికార వాణి తప్ప మరొకటి కాదు. సామాజిక మాధ్యమంలో కాషాయ దళాల యుద్ధ ప్రేలాపనల గురించి చెప్పనవసరం లేదు.
            కొరియా యుద్ధంలో చైనా విజయానికి 70 ఏళ్లు నిండిన సందర్భంగా జిన్‌పింగ్‌ చేసిన హెచ్చరిక ఒక్క అమెరికాకు మాత్రమే కాదు, తమకు వ్యతిరేకంగా కూటమి కడుతున్న దేశాలన్నింటికీ అన్నది స్పష్టం. 1950లో ఉత్తర కొరియాను ఆక్రమించుకొనేందుకు ఐక్యరాజ్యసమితి శాంతిసేనల ముసుగులో ఉన్న అమెరికా మిలిటరీ ప్రయత్నించటంతో పక్కనే ఉన్న చైనా జోక్యం చేసుకొని తన వలంటీర్ల సైన్యాన్ని పంపింది. 1953 జూలైలో కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. దాని మీద నాటి దక్షిణ కొరియా పాలకులు సంతకాలు చేయలేదు. విలీన ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండగా అమెరికా ఇప్పటికీ తన సైన్యాన్ని అక్కడే ఉంచి అడ్డుపడుతోంది.
1950 అయినా 2020 అయినా చైనా విషయాల్లో ట్రంప్‌ లేదా భవిష్యత్‌లో మరొక నేత అయినా పెత్తందారీ పోకడలకు పోతే తగిన జవాబు ఇస్తామని జిన్‌పింగ్‌ స్పష్టం చేశారు. పశ్చిమ పసిఫిక్‌, ఆసియాలో ప్రస్తుత పరిస్ధితి 1950లో యుద్ధానికి ముందున్నట్లుగా ఉందని చైనా విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్‌ లేదా జో బిడెన్‌ ఎవరు అధికారానికి వచ్చినా చైనా వ్యతిరేకులకు విధాన నిర్ణయాన్ని అప్పగిస్తే అమెరికా తీవ్రంగా నష్టపోక తప్పదని హెచ్చరిస్తున్నారు.
             చైనా పౌరులు నేడు సంఘటితంగా ఉన్నారని, వారిని తక్కువగా అంచనా వేయవద్దని గతంలో మావో చెప్పిన అంశాన్ని జిన్‌పింగ్‌ పునరుద్ఘాటించారు. బెదిరింపులు, అడ్డుకోవటం వంటి ఒత్తిళ్లు పని చేయవని స్పష్టం చేశారు. గతంలో సోవియట్‌ యూనియన్‌కు వ్యతిరేకంగా ఐరోపాలో నాటో కూటమిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు చైనాను అడ్డుకునేందుకు ఆసియాలో 'క్వాడ్‌' పేరుతో అలాంటి కూటమి ఏర్పాటుకు పూనుకున్నారు. దానిలో అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా, భారత్‌ ఉన్నాయి. ఆసియా ముఖ్యంగా దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలోని దేశాలతో వాటిని విస్తరించాలనే యత్నాలు కూడా జరుగుతున్నాయి. అయితే చైనాతో ఎలా వ్యవహరించాలనే అంశంపై ఈ నాలుగు దేశాల్లో అన్ని అంశాలపైనా ఏకీభావం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. చతుష్టయంలో అమెరికా, భారత్‌తో చైనా వాణిజ్యం మిగుల్లో ఉండగా జపాన్‌, ఆస్ట్రేలియాలతో తరుగులో ఉంది. అంటే చైనాతో లడాయి కొని తెచ్చుకోవటం అంటే ఇవి తమ వాణిజ్య అవకాశాలను ఫణంగా పెట్టాల్సి ఉంది. చైనాకు ఎన్ని హెచ్చరికలు చేసినా...మన ప్రధాని నరేంద్ర మోడీ అధికారికంగా చేసిన ప్రకటనలో మన భూభాగం లోకి చైనా కొత్తగా ప్రవేశించలేదని అఖిలపక్ష సమావేశంలో చెప్పటం చైనాతో తెగే దాకా లాగేందుకు ఇంకా నిర్ణయించుకోలేదనేందుకు నిదర్శనంగా భావిస్తున్నారు.
             రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అమెరికా ప్రారంభించిన ప్రచ్ఛన్న యుద్ధంలో భాగంగా ఐరోపా లోని అనేక దేశాలకు సోవియట్‌ నుంచి ముప్పు, కమ్యూనిజాన్ని వ్యాపింప చేస్తారనేే భయాన్ని రేపి నాటో కూటమిని ఏర్పాటు చేశారు. ఇప్పుడు చైనా నుంచి అలాంటి ముప్పు ఏ దేశానికీ లేదు. మన దేశంతో సరిహద్దు వివాదం ఉన్నప్పటికీ అది మరోసారి యుద్ధానికి దారితీసే అవకాశం లేదు.1962 యుద్ధం నాటికి సోవియట్‌-చైనా కమ్యూనిస్టు పార్టీల మధ్య సైద్ధాంతిక విబేధాలు తీవ్రమయ్యాయి. యుద్ధంలో మన దేశానికి సోవియట్‌ యూనియన్‌ అండ వుంటుందనే ఒక పొరపాటు అంచనాకు నాటి మన నాయకత్వం వచ్చిందని చెబుతారు. ఇప్పుడు ఆ సోవియట్‌ లేదు. సిరియా, రష్యా నేతలు చైనాతో వివాద పడకపోగా స్నేహ బంధాన్ని మరింతగా పెంచుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇద్దరి మధ్య తగాదా పెట్టి మనకు ఆయుధాలు అమ్ముకొని అమెరికా లబ్ధి పొందుతుంది తప్ప మనకు ఒరిగేదేమీ ఉండదు.
             దక్షిణ చైనా సముద్రంలో కొన్ని దీవుల గురించి చైనా - ఆ ప్రాంత దేశాల మధ్య వివాదం ఉన్నప్పటికీ ఇంతవరకు ఏ దేశానికి చెందిన నౌకలనూ అడ్డుకోలేదు, అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. ఇక క్వాడ్‌ను ఆసియా నాటోగా మార్చి పెత్తనం చేయాలని అమెరికా చూస్తోంది. ఇదే సమయంలో జపాన్‌ రాజ్యాంగాన్ని మార్చాలని అక్కడి కార్పొరేట్‌ శక్తులు ఎప్పటి నుంచో ఒత్తిడి తెస్తున్నాయి.
ఆసియా నాటో కూటమిని ఏర్పాటు చేసి దానిలో మన దేశం చేరాలంటే దానికోసం మనం భారీ మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది. దున్న-ఎద్దు వ్యవసాయం ఎలాంటి సమస్యలను తెస్తుందో తెలిసిందే. ప్రస్తుతం మనం అమెరికా నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు కొనుగోలు చేస్తున్నప్పటికీ రష్యన్‌ ఆయుధాలదే అగ్రస్ధానం. అందువలన సగం రష్యా, సగం అమెరికా ఆయుధాల నిర్వహణ కుదరదు. అన్నింటికీ మించి తన ఆయుధాల కొనుగోలును మనం నిలిపివేస్తే రష్యా చూస్తూ ఊరుకోదు. అమెరికా ఉచితంగా ఆయుధాలు ఇవ్వదు. ఐరోపాలో నాటో నిర్వహణ తమకు కష్టంగా మారిందని, నిర్వహణ ఖర్చును ఐరోపా దేశాలు మరింతగా భరించాలని అమెరికా ఒత్తిడి తెస్తున్న విషయం తెలిసిందే. అలాంటి స్ధితిలో అమెరికా కోసం మనం చేతి చమురు వదిలించుకోవాల్సిన అవసరం ఏముంది ?
            అమెరికా మరింత దూకుడుగా చైనా వ్యతిరేక ఎజెండాను ముందుకు తీసుకు వస్తే చైనా తన వైఖరిని పున: పరిశీలించుకోవాల్సి రావచ్చు. తన ఆర్థిక శక్తితో చైనా చిన్న దేశాలను నియంత్రిస్తున్నదని విమర్శించే వారు...ఇరాన్‌ పట్ల అమెరికా, మోడీ అనుసరించిన వైఖరి ఆర్థిక పరమైనదిగాక మరేమిటో చెప్పాలి. అమెరికా విధిస్తున్న ఆంక్షలు ఆర్థికపరమైనవి కావా? దానిలో భాగంగానే కదా ఇరాన్‌ నుంచి మనం చమురు కొనుగోలు నిలిపివేసి ఆ మేరకు అమెరికా నుంచి తెచ్చుకుంటున్నది. అమెరికా పుణ్యమా అంటూ ప్రధాని నరేంద్రమోడీ మన మిత్రదేశంగా ఉన్న ఇరాన్‌ను తీసుకు వెళ్లి చైనాకు అప్పగించారు. ఈ చర్యతో మనకు ఒరిగిందేమీ లేకపోగా మిత్ర దేశంగా ఉన్న ఇరాన్‌ను తీసుకు వెళ్లి చైనాకు అప్పగించాము. అమెరికా బెదిరింపులు, అదిరింపులతో మన చుట్టూ ఉన్న అనేక దేశాలు చైనా అందిస్తున్న ఆర్థిక స్నేహ హస్తాన్ని అందుకుంటున్నాయి. మన పాలకులకు అమెరికా కౌగిలింతలు తప్ప చుట్టుపట్ల ఏమి జరుగుతోందో పట్టటం లేదు. ఇది తెలివి తక్కువ వ్యవహారమా తెలివిగలదా?

ఎం. కోటేశ్వరరావు