Dec 17,2021 06:43

రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం క్రీడలను ఒక సాధనంగా వాడుకోవాలని చూడటం గర్హనీయం. చైనా లోని షిన్‌జాంగ్‌ రాష్ట్రంలో ముస్లిం సామాజిక తరగతి మానవ హక్కులకు భంగం కలుగుతోందని ఆరోపిస్తూ అమెరికా, దాని కూటమి దేశాలు యాగీ చేస్తున్నాయి. పొద్దున లేస్తే తమకు లొంగని దేశాల మీద ఆర్థిక, దౌత్య, ఇతర ఆంక్షలను విధిస్తున్న అమెరికా, దానికి తందాన తాన అంటున్న దేశాలు చైనా మీద ప్రచార దాడి ప్రారంభించటంలో ఆశ్చర్యం లేదు. డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రారంభించిన వాణిజ్య యుద్ధంలో అమెరికా ఇప్పటి వరకు సాధించిందేమీ లేకపోగా నష్టపోయింది.

బీజింగ్‌ ఒలింపిక్స్‌ తుది సన్నాహాలు కూడా పూర్తి కావస్తున్నాయి. ఫిబ్రవరి నాలుగు నుంచి 20వ తేదీ వరకు జరిగే పోటీల్లో సత్తా చూపేందుకు క్రీడాకారులు ఒకవైపు సన్నద్ధం అవుతున్నారు. మరోవైపు చైనాను బదనాం చేసేందుకు అమెరికా నాయకత్వంలోని దేశాలు అంతకంటే ఎక్కువగా సిద్ధం అవుతున్నాయి. క్రీడల కంటే అంతర్జాతీయ రాజకీయాలు ఇప్పుడు ఎక్కువగా నడుస్తున్నాయి. అసలేం జరగనుంది? అమెరికా కూటమి దేశాలు తమ క్రీడాకారులను బీజింగ్‌ పంపుతాయట గానీ వారి వెంట రాజకీయ నేతలు, అధికారులను మాత్రం పంపవట. దీనికి దౌత్యపరమైన బహిష్కరణ అని పేరు పెట్టారు. ఆడేది క్రీడాకారులు తప్ప అధికారులు కాదు కదా! వారు వస్తే ఏంటి? రాకపోతే ఏంటి అని క్రీడా సంబంధిత వర్గాలు పెద్దగా ఆ పిలుపులను పట్టించుకోవటం లేదని వార్తలు. రాజకీయ నేతల హడావుడి మరీ ఎక్కువగా ఉంది. మీరు వస్తే ఎంత రాకపోతే ఎంత, అసలు మిమ్మల్ని రమ్మని పిలిచిందెవరు అని చైనా ప్రతినిధులు బహిష్కరణ గురించి చెప్పేవారి గాలి తీశారు. తాము ఇంతవరకు అసలు అమెరికా రాజకీయవేత్తలకు ఆహ్వానాలే పంపలేదని, అలాంటప్పుడు బహిష్కరణకు తావెక్కడని అమెరికా లోని చైనా రాయబారి ప్రతినిధి ప్రశ్నించాడు.
     నిర్వహించేది అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటీ, దానికి రాజకీయాలతో సంబంధం లేదు. ఆతిథ్య దేశం చైనా మాత్రం దీన్ని తేలికగా తీసుకోవటం లేదు. ప్రతిగా క్రీడలు పూర్తయిన తరువాత కర్ర కాల్చి ఎక్కడ పెట్టాలో అక్కడ వాత పెడతాం అన్నట్లుగా హెచ్చరించింది. ఏం జరుగుతుందో అని ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. ఎన్ని దేశాలు అమెరికాను అనుసరిస్తాయి, ఎన్ని తిరస్కరిస్తాయో ఇంకా తెలియదు. ఇప్పటి వరకు అమెరికాతో పాటు కెనడా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, లిధువేనియా బహిష్కరణ నిర్ణయాన్ని ప్రకటించాయి. జపాన్‌ ఇంకా ప్రకటన చేయలేదు గానీ అలాంటి సూచనే చేసింది. అమెరికా అడుగులో అడుగు వేసే దక్షిణ కొరియా, జర్మనీ, ఫ్రాన్స్‌, ఇటలీ ఆ బాటలో నడిచేది లేదని చెప్పేశాయి. పంపటం లేదని, తమది బహిష్కరణ కాదంటూ కరోనాను కారణంగా న్యూజిలాండ్‌ చూపింది. మరికొన్ని దేశాలు కూడా చేరవచ్చు. అమెరికా తన పెరటితోటగా భావించే లాటిన్‌ అమెరికా లోని అర్జెంటీనా కూడా హాజరవుతోంది. సముద్రం లోకి ప్రవహించే నదులను పర్వతాలు నిరోధించలేవని చైనా ఎద్దేవా చేసింది.
      రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం క్రీడలను ఒక సాధనంగా వాడుకోవాలని చూడటం గర్హనీయం. చైనా లోని షిన్‌జాంగ్‌ రాష్ట్రంలో ముస్లిం సామాజిక తరగతి మానవ హక్కులకు భంగం కలుగుతోందని ఆరోపిస్తూ అమెరికా, దాని కూటమి దేశాలు యాగీ చేస్తున్నాయి. బ్రిటన్‌ లోని లివర్‌పూల్‌ పట్టణంలో జరిగిన జి-7 దేశాల విదేశాంగ, అభివృద్ధి మంత్రుల సమావేశం చైనా ఆర్థిక ఒత్తిళ్ల పేరుతో కొత్త పల్లవి అందుకుంది. పొద్దున లేస్తే తమకు లొంగని దేశాల మీద ఆర్థిక, దౌత్య, ఇతర ఆంక్షలను విధిస్తున్న అమెరికా, దానికి తందాన తాన అంటున్న దేశాలు చైనా మీద ప్రచార దాడి ప్రారంభించటంలో ఆశ్చర్యం లేదు. డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రారంభించిన వాణిజ్య యుద్ధంలో అమెరికా ఇప్పటివరకు సాధించిందేమీ లేకపోగా నష్టపోయింది.
     అమెరికా చేస్తున్న ఆర్థిక ఒత్తిళ్లకు అనేక ఉదంతాలను ఉదాహరణగా పేర్కొనవచ్చు. పసిఫిక్‌ సముద్రంలో నౌరు, కిరిబటి, మైక్రోనేసియా అనే మూడు చిన్న దీవుల దేశాలున్నాయి. ఇంటర్నెట్‌ సేవలను మెరుగు పరచేందుకు సముద్రంలో వైర్ల ద్వారా సమాచారాన్ని పంపే ప్రపంచ బ్యాంకు పథకాన్ని 7.25 కోట్ల డాలర్లతో రూపొందించి అంతర్జాతీయ టెండర్లు పిలిచారు. దానిలో చైనా కంపెనీ ఒకటి 20 శాతం తక్కువకు టెండరు వేసి కాంట్రాక్టు దక్కించుకుంది. చైనా కంపెనీకి గనుక పని అప్పగిస్తే భద్రతకు ముప్పు వస్తుందంటూ అమెరికా ఒత్తిడి తెచ్చి సదరు ప్రాజెక్టును అడ్డుకుంది. ఇది తాజా ఉదంతం. అంతకు ముందు హువెయి, టిక్‌టాక్‌, మూడు టెలికాం కంపెనీల మీద ఆంక్షలు విధించటం, వాటిని బ్లాక్‌ లిస్టులో పెట్టటం, వాటి ఉత్పత్తులు కొనుగోలు చేసిన, సేవలు పొందిన దేశాల మీద చర్యలు తీసుకుంటామని బెదిరించటం, స్టాక్‌ మార్కెట్‌ నుంచి కంపెనీలను తొలగించటం, హువెయి కంపెనీ ఉన్నతాధికారిణిని కెనడాలో అరెస్టు చేయించటం తెలిసిందే. చైనా సంగతిని పక్కన పెడితే ఫ్రెంచి కంపెనీ అస్టోమ్‌పై 77.23 కోట్ల డాలర్ల జరిమానా విధించింది. ఐరోపా విమాన కంపెనీ ఎయిర్‌ బస్‌పై 2020లో పన్నులు పెంచింది. అంతెందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఎంత సన్నిహితంగా మెలిగినా మన ఎగుమతులపై పన్నుల రాయితీని రద్దు చేసిన డోనాల్డ్‌ ట్రంప్‌గానీ, తరువాత గద్దెనెక్కిన బైడెన్‌ గానీ వాటిని పునరుద్ధరించలేదు. ఇరాన్‌ నుంచి చమురు కొనుగోలు చేస్తే మన దేశం మీద కూడా చర్య తీసుకుంటామని అమెరికా చేసిన బెదిరింపులకు నరేంద్ర మోడీ భయపడి నిలిపివేసిన అంశం తెలిసినదే.
     లివర్‌పూల్‌లో జరిగిన జి-7 దేశాల సమావేశం చేసిన ప్రకటనల్లో ప్రస్తావించిన షిన్‌జాంగ్‌, హాంకాంగ్‌, టిబెట్‌, తైవాన్‌, దక్షిణ చైనా సముద్రం వంటి అంశాలన్నీ చైనా అంతర్గత విషయాల్లో వేలు పెట్టటమే. మానవ హక్కులలో ఆరోగ్యం కూడా ఒకటి. ప్రపంచ జనాభాలో అమెరికా, బ్రిటన్‌ జనాభా కేవలం ఐదుశాతం, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు, ఆరోగ్య వ్యవస్థలు వున్నాయి. అయినా ప్రపంచ కరోనా కేసుల్లో 23 శాతం, మరణాల్లో 18 శాతం అక్కడే అంటూ జీవించే హక్కును కాపాడాలని చైనా డిమాండ్‌ చేసింది. ఆపని చేయకుండా మిగతా దేశాల్లో మానవ హక్కులు, ప్రజాస్వామ్యం గురించి కబుర్లు చెబుతున్నాయని పేర్కొన్నది. ప్రపంచ వ్యాపితంగా రెండులక్షలకు పైగా సైన్యాలను, అణ్వాయుధాలతో సహా ఆధునిక క్షిపణులను మోహరించి నిత్యం ప్రపంచాన్ని భయపెడుతున్నది అమెరికా. ఎవరు ఏ ఆయుధాలు కొనాలో, కొనకూడదో నిర్దేశిస్తోంది. రష్యా నుంచి ఆధునిక క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు నిర్ణయించిన మన దేశంపై ఆంక్షలు విధిస్తామని బెదిరింపులకు దిగిన అంశం కూడా తెలిసిందే.
     చైనాను గుర్తించకుండా తైవానే అసలైన చైనాగా చిత్రించి 1948 నుంచి 1971వరకు ఐక్యరాజ్య సమితిలో, 2001 వరకు ప్రపంచ వాణిజ్య సంస్థలో ప్రవేశించకుండా అడ్డుకొన్నది అమెరికా. ప్రస్తుతం అది కానసాగిస్తున్న వాణిజ్య యుద్ధం ఆర్థిక ఒత్తిడి కాదా? మానవ హక్కుల పరిరక్షణ అన్నది తన డి.ఎన్‌.ఎ లోనే ఉన్నదని అమెరికా చెప్పుకుంటోంది. ఆచరణలో మానవ హక్కుల హరణమే దాని డి.ఎన్‌.ఎ అని రుజువు చేస్తోంది. వందల ఏండ్ల క్రితం ఆఫ్రికా నుంచి జనాలను బానిసలుగా పట్టుకువచ్చింది అమెరికన్లు, వారిని కాపలా కాసేందుకు ఏర్పాటు చేసుకున్నదే అమెరికా పోలీసు వ్యవస్థ, దాని అవశేషాలే ఇప్పటికీ ఆఫ్రో-అమెరికన్లను హతమారుస్తున్న దురంతాలు. అమెరికా పొలాలు, కార్ఖానాల్లో పని చేసిన ఆఫ్రికన్‌ బానిసలకు పరిహారం చెల్లించాల్సి వస్తే ఆ మొత్తం ఇప్పుడు 97 లక్షల కోట్ల డాలర్లని జాక్‌ కోపే అనే ఆర్థికవేత్త అంచనా.
     రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా అణుబాంబులు వేసి 66 వేల మందిని హిరోషిమాలో, 39 వేల మందిని నాగసాకిలో పొట్టన పెట్టుకుంది. తరువాత కూడా దాని పర్యవసానాలకు ఎందరో బలయ్యారు. ఇలాంటి అమెరికా ప్రజాస్వామ్యం, మానవహక్కుల గానాలాపన చేస్తుంటే దానికి కెనడా, బ్రిటన్‌, జపాన్‌ వంత పాడటం సహజమే. ఎందుకంటే ఈ దేశాలు కూడా మానవ హక్కుల హరణంలో తక్కువ తినలేదు. ఇక ఐరోపా సామ్రాజ్యవాద వారసులే కనుక ఆస్ట్రేలియా వారి వెనుక నడవటంలో ఆశ్చర్యం లేదు. ప్రపంచమంతటా అమెరికాకు చిన్నవీ, పెద్దవీ 800 వందల సైనిక కేంద్రాలు ఉన్నాయి. చైనాకు ఉన్నది ఒక్కటి, అదీ నాలుగు వందల అమెరికా కేంద్రాల మధ్య ఉంది.
     క్రీడలపై బహిష్కరణ అస్త్రం పెద్దగా పని చేయకపోయినా దీని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని కొందరు చెబుతున్నారు. చైనా సహకారం, ప్రమేయం లేకుండా నేడు అంతర్జాతీయ రాజకీయాలు ముందుకు పోవు. గతంలో 1980 మాస్కో ఒలింపిక్స్‌ను అమెరికాతో సహా 66 దేశాలు బహిష్కరించాయి. తైవాన్‌కు గుర్తింపు ఇచ్చిన కారణంగా 1956 నుంచి 1980 వరకు చైనా అసలు మొత్తంగా ఒలింపిక్స్‌ను బహిష్కరించింది. తరువాత 1984 లాస్‌ ఏంజల్స్‌ క్రీడలలో సోవియట్‌, పదమూడు తూర్పు ఐరోపా దేశాలు పాల్గొనలేదు. ఆఫ్ఘనిస్తాన్‌లో సోవియట్‌ జోక్యాన్ని 1980లో అమెరిరా సాకుగా చూపింది. కానీ అదే అమెరికా, దాని మిత్ర దేశాలు తరువాత వివిధ దేశాల్లో మారణకాండ సాగించినా ఎవరూ క్రీడలకూ-వాటికి పోటీ పెట్టలేదు. బీజింగ్‌ ఒలింపిక్స్‌ ప్రారంభ సభకు అందిన ఆహ్వానాన్ని అంగీకరించినట్లు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ చెప్పారు. క్రీడలను రాజకీయం చేయకూడదని ఫ్రెంచి అధ్యక్షుడు మాక్రాన్‌ అన్నారు.
     అమెరికా దౌత్యపరమైన బహిష్కరణకే పరిమితం కావటం వెనుక అక్కడి మీడియా సంస్థల వాణిజ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. క్రీడలను చూపేందుకు ఎన్‌బిసి సంస్థ ఒలింపిక్స్‌ కమిటీకి బిలియన్ల డాలర్లు చెల్లించింది. పోటీల్లో అమెరికన్‌ క్రీడాకారులు లేకపోతే దానికి పెద్ద నష్టం వాటిల్లుతుంది. మిగతా దేశాలకూ అదే సమస్యలున్నాయి. 2014లో ఎడ్వర్డ్‌ స్నోడెన్‌కు ఆశ్రయం ఇచ్చిన కారణంగా రష్యాలోని సోచిలో జరిగిన శీతాకాల క్రీడలను నాటి అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, ఉపాధ్యక్షుడు జోబైడెన్‌, ప్రధమ మహిళ మిషెల్లీ ఒబామా మాత్రమే బహిష్కరించారు. ప్రస్తుత అమెరికా కూటమి చర్యకు ప్రతీకారంగా 2028 లాస్‌ ఏంజల్స్‌, 2032 బ్రిస్‌బేన్‌ (ఆస్ట్రేలియా) ఒలింపిక్స్‌ను చైనా బహిష్కరించ వచ్చన్న అనుమానాలు వ్యక్తం చేసిన వారు కూడా లేకపోలేదు. చైనా వైపు నుంచి అలాంటి సూచనలైతే లేవు.
 

/ వ్యాసకర్త సెల్‌: 8331013288 /
ఎం. కోటేశ్వరరావు

ఎం. కోటేశ్వరరావు