బీహార్ 64వ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన రజియా సుల్తానా అనే యువతి రాష్ట్రంలో డీఎస్పీ పోస్టుకు ఎంపికైన తొలి ముస్లిం మహిళగా గుర్తింపు తెచ్చుకున్నారు. బీహార్ గోపాల్ గంజ్ జిల్లా హథురా ప్రాంతానికి చెందిన రజియా సుల్తానాపబ్లిక్ సర్వీస్ పరీక్షల్లో మంచి ప్రతిభ కనబర్చారు. ఇటీవల డీఎస్పీగా ఎంపికై, చరిత్ర సష్టించారు. మొత్తం 40 మంది అభ్యర్థులు డీఎస్పీ పోస్టుకు ఎంపిక కాగా.. వారిలో రజియా సుల్తానాకూడా ఒకరు. ఈ 27 ఏళ్ల యువతి ప్రస్తుతం బీహార్ విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీరుగా పనిచేస్తోన్నారు.
దేశంలో వెనుకబడిన రాష్ట్రాల జాబితాలో బీహార్ ముందుంటుంది. నిరక్షరాస్యతతో పాటు పేదరికంలోనూ ఆ రాష్ట్రం దిగువన ఉంది. నిరక్షరాస్యత 61.80 శాతం ఉంది. ముఖ్యంగా ఆడవారి అక్షరాస్యత (51.5%) విషయంలో వేరే చెప్పనక్కర్లేదు. ఇలాంటి వెనుకబడిన రాష్ట్రంలో తొలిసారిగా 27 ఏళ్ల ఓ ముస్లిం యువతి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) గా బాధ్యతలు స్వీకరించనున్నారు. కుటుంబ నేపథ్యానికి వస్తే రజియాకు ఐదుగురు అక్కాచెల్లెళ్లు, ఓ సోదరుడు ఉన్నారు.
రజియా సుల్తానాతండ్రి అస్లాం అన్సారీ జార్ఖండ్‌లోని బోకారో స్టీల్‌ప్లాంట్‌లో స్టెనోగ్రాఫర్‌గా పనిచేసేవారు. 2016లో ఆయన మృతి చెందారు. రజియా చదువంతా బోకారోలోనే పూర్తి చేశారు. జోధ్‌పూర్‌లో బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం నుంచి పట్టా పొందారు. తన సోదరీమణులందరికీ వివాహం కాగా, సోదరుడు ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు.
చిన్ననాటి కల సాకారం..
పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో అర్హత సాధించడం తన చిన్ననాటి కలని ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు రజియా. ఇన్నేళ్లకు తన కల సాకారమైందని చెప్పారు. 2017లో బీహార్ ప్రభుత్వ విద్యుత్ శాఖలో ఉద్యోగంలో చేరిన ఆమె, అనంతరం బీపీఎస్సీ (బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) పరీక్షలకు సిద్ధమయ్యారు. పోలీసు అధికారిగా బాధ్యతలు చేపట్టేందుకు అత్యంత ఉత్సాహంగా ఉన్నారు. దీనిపై స్పందిస్తూ 'నేను పోలీసు అధికారిగా బాధ్యతలు చేపట్టనున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. ప్రజలకు న్యాయం జరగని సందర్భాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా మహిళల విషయంలో చాలా వరకూ న్యాయం జరగని సందర్భాలే. మహిళలు తమపై ఏదైనా నేర సంఘటనలు జరిగినప్పుడు పోలీసులకు నివేదించేందుకు భయపడుతున్నారు. కొందరు సిగ్గుపడుతున్నారు. ఇలాంటి కేసుల్లో మార్పు తెచ్చేందుకు నేను ప్రయత్నిస్తాను. మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టడమే లక్ష్యంగా పనిచేస్తాను!' అని రజియా సుల్తానా తెలిపారు.
తల్లిదండ్రుల మద్దతు అవసరం..
ముస్లిం కుటుంబాల్లో బాలికలకు విద్య లేకపోవడంపై రజియా సుల్తాన్ ఆందోళన వ్యక్తం చేస్తోన్నారు. తమ కలలను నెరవేర్చుకోవడానికి తల్లిదండ్రులు పిల్లలకు మద్దతు ఇవ్వాలని కోరారు. బుర్ఖా లేదా హిజాబ్ ధరించడం ఓ పరిమితి కాదని, అన్ని రకాల అడ్డంకులనూ అధిగమించే శక్తిని పెంపొందించుకోవాలని అన్నారు. రజియా ఇటీవలే కోవిడ్-19 బారినపడి కోలుకున్నారు. వ్యాక్సినేషన్‌కు సంబంధించిన పుకార్లను, అపార్థాలను తొలగించాలని, ప్రజల ప్రాణాలను కాపాడటానికి ఉద్యోగులు విధులకు వెళ్లాలని ముస్లిం సమాజానికి, యూనివర్సిటీలకు ఆమె విజ్ఞప్తి చేశారు.