Oct 03,2023 00:40

ప్రజాశక్తి - సంతమాగులూరు
మండలంలోని కొప్పరం పంచాయతీకి చెందిన ఇరిగేషన్ చెరువు కింద మాగాణి భూములు సాగు చేస్తున్న రైతుల పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారింది. ఈ చెరువు కింద ఏటా 300ఎకరాలకుపైగా మాగాణి భూమి సాగవుతుంది. కొప్పరం, బండివారిపాలెం, చవిటిపాలెం గ్రామాలకు చెందిన సన్న, చిన్న కారు రైతులు మాగాని సాగు చేస్తుంటారు. అయితే చెరువులో ఉన్న నీరు కాస్త చేపలు పట్టుకునేందుకు సంబంధిత గుత్తేదారుడు తొలగించి చేపలు పట్టుకున్నారు. ఇప్పుడు చెరువులో చుక్కనీరు లేదు. సాగరు నీటితోనైనా చెరువును నింపుదామంటే ఇంతవరకు మేజర్ కాలువల ద్వారా నీరు రాలేదు. సరైన వర్షాలు లేక చెరువు నిండలేదు. ఖరీఫ్ పంట సాగు కూడా పోయింది. దీంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. ఏటా ఇదే కాలంలో వరి సాగులో కలుపును కూడా తీసేవారమని రైతులు అంటున్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగుకు వ్యవసాయ అధికారులు కూడా సూచనలు ఇవ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.