ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : వరి సాగుకు సాగర్ జలాలు ఇవ్వబోమని మంత్రి ప్రకటించారు. నరసరావుపేట నియోజకవర్గంలోని మొత్తం సాగు భూమిలో 60 శాతం విస్తీర్ణంలో వరి మినహా ఇతర పంటలు సాగు చేయలేరు. ఒకవేళ సాగు చేసినా దిగుబడులు సరిగా రావు. దీంతో ఓగేరు వాగు, బావులు, బోర్లు ఆధారంగా వరిసాగుకు రైతులు సిద్ధమయ్యారు. ఇందుకుగాను అదనంగానూ పెట్టుబడులు అవుతున్నాయి. అయినా భూములను బీడుగా వదిలేయలేక, తిండి గింజలకైనా పంట పండించుకుందామని సన్న, చిన్నకారు రైతులు వరి సాగు చేపట్టారు.
వరి సాగుకు దుక్కులు దమ్ము రూ.6 వేలు, వరినారుకు రూ.3 వేలు, నాటు వేయడానికి రూ.4 వేలు, ఎరువులు, పురుగు మందులు రూ.10 వేలు, కలుపు, కోతలు, నూర్పిడి తరదితర ఖర్చులన్నీ కలిపి ఒక ఎకరా వరి సాగుకు రూ.30-35 వేల వరకూ ఖర్చవుతోంది. అయితే పంటలకు సరైన ధరలు దక్కక రైతులు నష్టాలనే చవి చూస్తున్నారు. దీనికితోడు ఎరువులపై రాయితీలు ఎత్తేయడం, నీటి కోసం నానా తంటాలు పడాల్సి రావడంతో రైతులపై అధికంగా భారాలు పడుతున్నాయి. అయినా పొలాలను బీడు చేయడం ఇష్టం లేక ఎలాగోలా సాగుకు సమాయత్తమయ్యారు.










