రాయచోటి టౌన్ : బీడీ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని, ఒక్కొక్క కుటుంబానికి రూ.పది వేలు సాయం చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.ఓబులు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక రాయచోటి పట్టణంలో కొత్తపల్లిలోని జెండా మానువీధి, రమీజా భానువీధి మేదరవీధి, కందకంవీధి, నాయబ్ సాహెబ్ వీధి బీరాన్ సాహెబ్ వీధి పాతరాయచోటిలోని బీడీ కార్మికులను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీడీ కార్మికులకు వెయ్యి బీడీలు చుడితే కేవలం రూ.200 నుండి రూ.240 ఇస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం పెరిగిన ధరలతో పాటు ఇంటి పన్ను చెత్తపన్ను విద్యుత్ ఆర్టీసీ ఛార్జీలు వైద్య ఖర్చులు పెరగడంతో వారికి సరిపోదని పేర్కొన్నారు. కేరళ, ఇతర రాష్ట్రాల మాదిరి వెయ్యి బీడీిలకు రూ.500 ఇచ్చి ఆదుకోవాలన్నారు. బీడీ కార్మికుల ఆసుపత్రులలో వైద్యుల కొరత ఉందని ప్రభుత్వాల వైఫల్యం వలన డిస్ఫెన్సరీలు మూతపడేదశలో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వాలు మరిన్ని వైద్య సదుపాయాలు కల్పించాలన్నారు. బీడీ కార్మికులు సుధీర్ఘంగా కూర్చొని బీడీలు చుట్టడం వలన నడుంనొప్పి, ఆస్తమా, కిడ్నీ ఇతర సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. బిడి కార్మికుల సమస్యల మీద ఈ నెల 13 నిర్వహించిన నెల్లూరులో రాష్ట్ర సమావేశానికి పెద్ద ఎత్తున బీడీ కార్మికులు కదిలి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామాంజులు, జిల్లా కార్యదర్శి డి.భాగ్యలక్ష్మి, ఓబులమ్మ, నాయకులు సుహాసిని, రాధ పాల్గొన్నారు.










