Aug 25,2023 21:33

మాట్లాడుతున్న సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రామాంజులు

 రాయచోటి టౌన్‌ : బీడీ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామాంజులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం స్థానిక రాయచోటి పట్టణంలో కొత్తపల్లిలోని జెండామాను వీధి, రమీజాభాను వీధి లోని బీడీ కార్మికులతో సమవేశం ఏర్పాటు చేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బీడీ కార్మికులకు వెయ్యి బీడీలు చుడితే కేవలం రూ.200 నుండి రూ.260 ఇస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం పెరిగిన ధరలతో పాటు ఇంటి పన్ను, చెత్తపన్ను, విద్యుత్‌, ఆర్టీసీ ఛార్జీలు, వైద్య ఖర్చులు పెరగడంతో వారికి సరిపోవడం లేదని పేర్కొన్నారు. కేరళ, ఇతర రాష్ట్రాల మాదిరి వెయ్యి బీడీలకు రూ.500 ఇచ్చి ఆదుకోవాలన్నారు. బీడీ కార్మికుల ఆసుపత్రులలో వైద్యుల కొరత ఉందని ప్రభుత్వాల వైఫల్యం వలన డిస్ఫెన్సరీలు మూతపడేదశలో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వాలు మరిన్ని వైద్య సదుపాయాలు కల్పించాలన్నారు. బీడీ కార్మికులు సుధీర్ఘంగా కూర్చుని బీడీలు చుట్టం వలన నడుంనొప్పి ఆస్తమా కిడ్నీ ఇతర సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సిఐటియు జిల్లా కార్యదర్శి డి.భాగ్యలక్ష్మి మాట్లాడుతూ బీడీ కార్మికుల పిల్లలకు స్కాలర్‌షప్‌ ఇచ్చి ఆదుకో వాలని చెప్పారు. రాయచోటిలో ఆధునిక వసతులతో కూడిన బీడీ సిగార్‌ పరిశ్రమను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. కనీసవేతనం రూ.18 వేలు ఇవ్వాలన్నారు. ఇఎస్‌ఐ, ఇపిఎఫ్‌ ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో బీడీ కార్మికులు కదీరున్నీసా, ముబీనా, నసీమా, షఫి ముంతాజ్‌ ఫాయిదా, రఫీఉన్నీసా, రేష్మా, పర్వీన్‌, షభానా పాల్గొన్నారు.