ఎంపి బీద మస్తాన్‌రావు
ప్రజాశక్తి -భీమునిపట్నం స్థానిక బీచ్ రోడ్డులోని గ్రామాల్లో రాజ్యసభ సభ్యునిగా తన కోటా నిధులతో సామాజిక భవనాలు, బస్ షెల్టర్ల ఏర్పాటుకు కృషి చేస్తానని రాజ్యసభ సభ్యులు, బిఎంఆర్ సంస్థల అధినేత బీద మస్తాన్‌రావు హామీ ఇచ్చారు. బుధవారం బీచ్‌రోడ్డులోని గంగడిపాలెం, గోవుపేట, చీపుళ్ళ పాలెం పరదేశమ్మ సహిత తొమ్మిది అమ్మవార్ల ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో మస్తాన్‌రావును ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశాఖతో తనకున్న 30 ఏళ్ల అనుబంధం విడదీయరానిదన్నారు. బిసిల అభ్యున్నతికి ఎంపిగా తన వంతు కృషి చేస్తానని హామీఇచ్చారు.
చేపలుప్పాడ పంచాయితీ మాజీ సర్పంచ్ కారి అప్పారావు మాట్లాడుతూ హుదూద్, కరోనా సమయంలో బీచ్‌రోడ్డులోని 14 మత్స్యకార గ్రామాల్లో ప్రజలకు మస్తాన్‌రావు ఎంతో సాయం చేశారని గుర్తు చేశారు. తిమ్మాపురంలో రొయ్యల హేచరీని స్థాపించి, ఎంతో మంది ఈ ప్రాంత యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించారన్నారు. కార్యక్రమంలో వివిధ హేచరీల అధినేతలు పిఎస్ నాయుడు, ప్రసాద్, ఉద్యోగులు, సిబ్బంది, ఆలయ కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దాసు, గోపాలరావు, కోశాధికారి గురువులు పాల్గొన్నారు.










