Sep 28,2021 21:21

బొబ్బిలిలో నేలకొరిగిన మొక్కజొన్న

గులాబ్‌ తుపాను జిల్లాలో బీభత్సం సృష్టించింది. అనేక ప్రాంతాలు ఇప్పటికీ జలదిగ్బంధంలోనే ఉన్నాయి. మంగళవారం వర్షాలు కొంత తగ్గడంతో ముంపుప్రాంతాలను అధికారులు, ప్రజాప్రతినిదులు పరిశీలించారు. ప్రత్నామ్నాయ ఏర్పాట్లపై ప్రజాప్రతినిధులు అధికారులకు పలు సూచనలు చేశారు.
సాలూరు: భారీవర్షాలకు గోముఖి నది ఉధృతంగా ప్రవహించడంతో మామిడిపల్లిలోని పిహెచ్‌సి, గిరిజన బాలికల సంక్షేమ ఆశ్రమ పాఠశాలలోకి వరద నీరు చేరింది. సోమవారం పిహెచ్‌సి, హాస్టల్‌ చెరువును తలపించేలా ఉండడంతో సిబ్బంది ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. ఆసుపత్రిలోని రోగులను, రికార్డులను పక్కనే క్వార్టర్స్‌లోకి తరలించారు. హాస్టల్లోని విద్యార్ధినులను సమీపంలో ఉన్న ప్రాథమిక పాఠశాల్లోకి తరలించారు. మంగళవారం వైస్‌ ఎంపిపి రెడ్డి సురేష్‌, ఎంపిటిసి కె.త్రినాధరావు, వైసిపి నాయకులు సువ్వాడ భరత్‌ శ్రీనివాస్‌, పిఎసిఎస్‌ చైర్మన్‌ పి.మాధవరావు పిహెచ్‌సి, హాస్టల్‌లను పరిశీలించారు. ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని వైద్యాధికారి ఆర్‌.శ్రీనివాసరావును కోరారు. హాస్టల్‌, ఆసుపత్రిలోకి చేరిన వరదనీరు మంగళవారం తగ్గుముఖం పట్టడంతో మట్టి, బురదలను తొలగించారు. మంగళవారం సాయంత్రానికి హాస్టల్‌ లో కి విధ్యార్ధినులను తీసుకొస్తామని గిరిజన సంక్షేమ సహాయ అధికారి వరలక్ష్మి చెప్పారు.
కోతకు గురైన భూములు
మండలంలోని తోణాంలో గోముఖి నది ప్రవాహానికి సమీపంలో ఉన్న గిరిజనుల సాగు భూములు కోతకు గురయ్యాయి. సోమవారం నది ఉధృతంగా ప్రవహించడంతో 30మీటర్ల వెడల్పున 25కిలోమీటర్ల వరకు భూములు కోతకు గురయ్యాయి. ఈ భూములను తహశీల్ద్దార్‌ కె.శ్రీనివాసరావు మంగళవారం పరిశీలించారు. జరిగిన నష్టాన్ని వైసిపి సీనియర్‌ నాయకులు దండి శ్రీనివాసరావు, సర్పంచ్‌ మువ్వల ఆదియ్య వివరించారు.
తుపాన్‌ నష్టాల అంచనా త్వరగా వేయండి: ఎమ్మెల్యే
గులాబ్‌ తుపాన్‌ కారణంగా నియోజకవర్గంలో పంటలకు, రోడ్లకు జరిగిన నష్టాలను త్వరగా అంచనా వేయాలని ఎమ్మెల్యే రాజన్నదొర కోరారు. మంగళవారం ఆయన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పట్టణంలో తుపాన్‌ వల్ల రహదారులు, కాలువల పరిస్థితిని పరిశీలించి మున్సిపల్‌ కమిషనర్‌, చైర్‌పర్సన్లు అంచనా వేయాలని కోరారు.. నాలుగు మండలాల్లో సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, ఎంపిపిలు పంట నష్టానికి సంబంధించిన ప్రాంతాల్లో పర్యటించి నష్టం అంచనా వేయాలని కోరారు.
దాతల సహకారంతో తాగు నీటి పంపిణీ
భోగాపురం : తుపాను ఉధృతికి వీచిన భీకర గాలులకు చెట్లు కూలి విద్యుత్‌ స్తంభాలపై పడ్డాయి. దీంతో సరఫరా నిలిచిపోవడంతో గ్రామస్తులు అంధకారంలో మగ్గుతున్నారు. దీంతో పాటు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. ఇది గమనించిన పలువురు దాతలు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. రెడ్డి కంచేరులో వైసిపి మండల యూత్‌ కన్వీనర్‌ గుర్నాథరెడ్డి, వంశీరెడ్డి సహకారంతో గ్రామంలో ట్యాంకర్ల ద్వారా ప్రజలకు నీటిని అందిస్తున్నారు. అలాగే దల్లిపేటలో సర్పంచ్‌ దల్లి కాంత భర్త మాజీ సర్పంచ్‌ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ట్యాంకర్ల ద్వారా నీళ్లు పంపిణీ చేస్తున్నారు. కౌలువాడలో వైసిపి నాయకులు కెకె రెడ్డి ఆధ్వర్యంలో నీరు పంపిణీ చేస్తున్నారు. ముక్కాంలో సర్పంచ్‌ వాసుపల్లి రేయ్యిడు ఆధ్వర్యంలో నీరు పంపిణీ చేస్తున్నారు. విద్యుత్‌ శాఖ అధికారులు కూడా స్పందించి గ్రామాల్లో విద్యుత్‌ మరమ్మతులు చేస్తున్నారు.

లోతట్టు ప్రాంతాలు సందర్శన
బొబ్బిలి : మున్సిపాలిటీలో లోతట్టు ప్రాంతాలను మంగళవారం మున్సిపల్‌ చైర్మన్‌ సావు మురళి, కమిషనర్‌ ఎస్‌.శ్రీనివాసరావు సందర్శించారు. నాయుడు కాలనీ, పాతబొబ్బిలిలో పర్యటించి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంతాల్లో వరదనీరు బయటకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు చైర్మన్‌ మురళి ఆదేశించారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటామని హామీఇచ్చారు. కోటి చెరువు, భైరిసాగరం చెరువులను పరిశీలించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు చోడిగంజి రమేష్‌, పాలవలస ఉమా శంకర్‌, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.
జలాదిగ్భందంలో శాసనాపల్లి
జామి : భారీ వర్షాలకు మండలంలోని శాసనాపల్లి గెడ్డ పొంగి, గ్రామాన్ని జలదిగ్భందంలో చిక్కుకునేలా చేసింది. దీంతో గ్రామానికి రాకపోకలు బంద్‌ అయ్యాయి. మరోవైపు గెడ్డ ఉధృతంగా ప్రవహించడంతో పంట పొలాలు, రహదారులు ముంపునకు గురయ్యాయి. ఈ నేపథ్యంలోనే మంగళవారం తహశీల్ధార్‌ బి.నీలకంఠారావు, ఎంపిడిఒ సతీష్‌, వైసిపి కన్వీనర్‌ గొర్లె రవి ముంపు ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్బంగా తహశీల్ధార్‌ మాట్లాడుతూ మండలంలో తుఫానుకు 600 ఎకరాల్లో వరి, 115 ఎకరాల్లో ఉద్యాన పంటలు ముంపునకు గురయ్యాయన్నారు. శాసనాపల్లికి సహాయక చర్యలు చేపట్టామన్నారు. వైసిపి మండల కన్వీనర్‌ గొర్లె రవికుమార్‌ మాట్లాడుతూ శాసనాపల్లికి -పెదవేమలికి వెళ్లే కల్వర్టు నిర్మిస్తే ఈ సమస్య పరిష్కారం కలుగుతుందన్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే అప్పలనరసయ్య దృష్టిలో పెట్టగా, త్వరలోనే నిధులు మంజూరు చేయించి, సమస్య శాశ్వతంగా పరిష్కారమయ్యేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్‌ పి.సంజీవి, ఎన్నింటి శేషు, ఏవో కిరణ్‌ కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.
నష్టపోయిన బాధితులను ఆదుకోవాలి
బొబ్బిలి : తుపాన్‌తో నష్టపోయిన వారందర్నీ ఆదుకోవాలని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బేబినాయన కోరారు. కోటలో మంగళవారం ఆయన మాట్లాడుతూ తుఫాన్‌ ప్రభావంతో కురిసిన వర్షాలకు రైతులు వేసే పంటలు వరదనీటిలో మునిగిపోయాయని, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు. ఇళ్లు కూలిపోయిన వారందరికీ పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. వంతెనలు, రోడ్లు పాడైపోయాయని, బాగు చేసేందుకు నిధులు మంజూరు చేయాలని కోరారు.
వరద ప్రాంతాల్లో ఎమ్మెల్యే పరిశీలన
సీతానగరం : మండలంలో సువర్ణముఖి ఉప్పొంగి ప్రవహించడంతో నదీ పరివాహక గ్రామాలైన సీతానగరం, గుడ్డిపేట గ్రామాల్లో కొన్ని ప్రాంతాలు నీట మునగడంతో ఇటుక బట్టీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో ఇబ్బందులుపడుతున్న 85 కుమ్మరి కుటుంబాలను ఎమ్మెల్యే అలజంగి జోగారావు మండల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి పరామర్శించారు. వరద బాధిత ప్రాంతాలను సందర్శించి నష్టతీవ్రతను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పంటలు, ఇటుక బట్టీల నష్టతీవ్రతను నమోదు చేసుకొని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపిడిఒ శ్రీనివాసరావు, తహశీల్దార్‌ అప్పారావు, ఎఒ అవినాష్‌, వైసిపి మండల అధ్యక్షులు బి.శ్రీరాములునాయుడు, వైస్‌ సర్పంచ్‌ అరవింద్‌, ఎంపిటిసి సభ్యులు, వైసిపిసీనియర్‌ నాయకులు ఎస్‌.రామారావు, టి.వెంకటప్పలనాయుడు, బి.సూర్యనారాయణ, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, వైసిపి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
ముంపుకు గురైన కుటుంబాలకు బియ్యం పంపిణీ
కొత్తవలస : తుపాన్‌ ప్రభావంతో ముంపుకు గురైన నిరాశ్రయులైన 70 కుటుంబాలకు 10 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేసినట్లు తహశీల్దార్‌ ఎస్‌.రమణరావు తెలిపారు. మేదర పేట, గెడ్డ పేట, ఎస్‌సి కాలనీ, ఆంజనేయపేట, రాంజీనగర్‌, సీతంపేట బాధితులకు బియ్యం పంపిణీ చేశారు. ఆంజనేయపేట వద్ద గల బాలికల వసతి గృహం ప్రహరీగోడ పడిపోవడంతో హాస్టల్లో నీరు చేరి సుమారు 8 బస్తాలు బియ్యం తడిచి పాడయ్యాయని తహశీల్దార్‌ తెలిపారు. ఇక్కడి బాలికలను బిసి బాలికల హాస్టల్లోకి తరలించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కొత్తవలస సర్పంచ్‌ మచ్చ రామస్వామి, వార్డుసభ్యులు పాల్గొన్నారు.