Apr 17,2023 00:10

భారత్‌ సంచార్‌ నిగం లిమిటెడ్‌ (బిఎస్‌ఎన్‌ఎల్‌) జనరల్‌ మేనేజర్‌ ఎస్‌.శ్రీధర్‌

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : టెలికం రంగంలో పోటీని తట్టుకుంటూ వినియోగ దారులకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు భారత్‌ సంచార్‌ నిగం లిమిటెడ్‌ (బిఎస్‌ఎన్‌ఎల్‌) జనరల్‌ మేనేజర్‌ ఎస్‌.శ్రీధర్‌ చెప్పారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వినియోగదారుల సంఖ్యను పెంచుకుంటూ బ్రాడ్‌బాండ్‌ సేవలను విస్తృత పరుస్తున్నట్టు ఆయన తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమ సంస్థ ద్వారా చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజాశక్తికి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
సిగల్స్‌ను పెంచటానికి తీసుకుంటున్న చర్యలు?
బిఎస్‌ఎన్‌ఎల్‌ సెల్‌ టవర్లు ఇంకా పెంచి, సిగల్‌ కవరేజి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూస్తాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండే అందే పథకాలు ఫోన్‌కు లింకు అయి ఉన్నందున గ్రామీణ ప్రాంతాల్లో సిగల్‌ సామర్థ్యాన్ని పెంచడానికి చర్యలు తీసుకుంటాం. ప్రధానంగా గ్రామ సచివాలయాలు, పిహెచ్‌సిలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో సిగల్‌ సమస్య ఉన్నట్టు మా దృష్టికి వచ్చింది. ఇందువల్ల ప్రజలకు సకాలంలో ప్రభుత్వం సంక్షేమ పథకాలను పొందడానికి ఇబ్బందిగా ఉందని ప్రజా ప్రతినిధులు, పలువురు సభ్యులు ఫిర్యాదు చేశారు. వీటిపై వెంటనే చర్యలు తీసుకుంటాం.
జిల్లాలో 4జి సేవలు ఎప్పుటి నుంచి ఇస్తారు?
ప్రస్తుతం 4జి సర్వీసులు ఇస్తున్నాం. జిల్లాలో మొత్తం 380 టవర్లు ఉన్నాయి. ఇందులో 4జి టవర్లు 105 ఉన్నాయి. కొత్తగా 4జి సర్వీసులు ఇంకా రాబోతున్నాయి. ఆత్మనిర్భర్‌ ప్రాజెక్టు కింద కొత్త లైన్లు ఏర్పాటు చేస్తున్నార. 77 టవర్లు హై స్పీడ్‌తో 4జీ సేవలను అందించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం యుఎస్‌వో ఫండ్‌ ద్వారా 4జి టవర్లు ఏర్పాటుకు అవకాశం ఇచ్చింది.
ఏ నెట్‌వర్కూ లేని ప్రాంతాల్లో బిఎస్‌ఎన్‌ఎల్‌ ఉంటుందా?
ఏ నెట్‌వర్క్‌ టవుర్లూ లేని ప్రాంతాలను గుర్తిస్తున్నాం. ఈ ప్రాంతంలో బిఎస్‌ఎన్‌ఎల్‌ టవర్లు ఏర్పాటు చేసి సర్వీసులను ప్రారంభిస్తాం. తద్వారా కొత్త వినియోగదారులను ఆకర్షించగలుగుతాం. ఇలాంటి ప్రాంతాలు ఇప్పటి వరకు మూడు గుర్తించాం. ఇప్పటికే అయ్యన్నపాలెం, కెపి.గూడెంలో బిఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్కు మాత్రమే ఉంది. కొత్తగా 77 టవర్లు ఏర్పాటుకు భూసేకరణ చేస్తున్నాం. అవసరమైన చోట భూమి కొనుగోలు చేసి టవర్లు ఏర్పాటు చేస్తున్నాం.
జిల్లాలో మొబైల్‌ కనెక్షన్లు ఎన్ని ఉన్నాయి?
జిల్లాలో 5.06 లక్షల ప్రీపెయిడ్‌ కనెక్షన్లు ఉన్నాయి. జియో, ఎయిర్‌టెల్‌, ఇతర నెట్‌ వర్కుల కనెక్షన్లు మరో 20 లక్షల వరకు ఉండవచ్చు. కొంత మంది ఒకటి నుంచి నాలుగు నెంబర్లు వరకు వినియోగిస్తున్నారు. అందువల్ల ఇతర నెట్‌వర్కులకు చెందిన కనెక్షన్లు ఎక్కువగా ఉండవచ్చు. మొత్తంగా 90 శాతం ప్రీపెయిడ్‌ కనెక్షన్లు ఉన్నాయి. బిఎస్‌ఎన్‌ఎల్‌ 20 వేల ల్యాండ్‌లైన్‌ కనెక్షన్లు, 19,500 బ్రాడ్‌బాండ్‌ కనెక్షన్లు ఉన్నాయి. కేబుల్‌ నెట్‌వర్కు కనెక్షన్లు 3,800 వరకు ఉన్నాయి. 2022-23లో రూ.67 కోట్ల ఆదాయం వచ్చింది. 2023-24లో రూ.80 కోట్ల ఆదాయం రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
బ్రాండ్‌బాండ్‌ కనెక్షన్లను ప్రైవేటు వారు నిర్వహిస్తారా?
ప్రైవేటు సంస్థలు, బిఎస్‌ఎన్‌ఎల్‌ చెరి సగం ఆదాయం పొందేలా రాష్ట్రంలో కొన్ని సంస్థలతో ఒప్పందం జరిగింది. టెలికం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రొవైడర్‌ (టిప్‌) ద్వారా ప్రైవేటు సంస్థలు నిర్వహించి ఆదాయం చెరి సగం తీసుకునేలా ఒప్పందం చేసుకున్నాం.