ప్రజాశక్తి -కంచరపాలెం : రోటరీ క్లబ్ విశాఖపట్నం సౌజన్యంతో కంచరపాలెంలోని బిఎన్‌ఆర్ భవనంలో నిర్వహిస్తున్న బిఎన్‌ఆర్ డయాగ్నొస్టిక్ సెంటర్‌కు ఇసిజి మిషన్‌ను రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఆర్‌టిఎన్ భాస్కర్‌రామ్.వి బహుకరించారు. ఇసిజి సెంటర్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా భాస్కర్‌రామ్ మాట్లాడుతూ, అన్ని రంగాల ప్రజలకు ఉపయోగపడే సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న బిఎన్‌ఆర్ ఫౌండేషన్ ప్రజలలో ఎంతో ప్రాచుర్యం పొందడం అభినందనీయమని కొనియాడారు. బిఎన్‌ఆర్ ఫౌండేషన్ చేస్తున్న సేవలకు తమ వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయన్నారు. బిఎన్‌ఆర్ ఫౌండేషన్ కార్యదర్శి బుజ్జి మాట్లాడుతూ, బిఎన్‌ఆర్ డయాగ్నొస్టిక్ సెంటర్‌లో రోగులకు అన్ని రకాల రక్త, మూత్ర పరీక్షలు నామమాత్రపు ఫీజుతో చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ గవర్నర్ తిమ్మయ్య గాంధీ, ప్రెసిడెంట్ బి.మధు, మోదాంబిక, బిఎన్నార్ ఫౌండేషన్ ప్రతినిధులు అప్పలరాజు, కృష్ణారావు, సతీష్, బిజి.రాజు, పి.సావిత్రి, ప్రభాకర్, విజయ పాల్గొన్నారు










