బిఎంసియు నిర్మాణాలను వేగవంతం చేయండి: జెసి
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్:
బిఎంసియుల నిర్మాణాలు వేగవంతంగా పూర్తిచేయాలని, ప్రారంభించనున్న కేంద్రాలలో రిజిస్ట్రేషన్ కార్యక్రమం వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు అన్నారు. మంగళవారం ఉదయం అమూల్ ప్రతినిధితో పాటు ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ త్వరలో ప్రారంభం కానున్న బిఎంసియుల పనులు వేగవంతం చేయాలని, పశుసంవర్ధక శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పనులను పరిశీలించాలని ఆదేశించారు. చెక్‌లిస్ట్ ప్రకారం పనులను పూర్తి చేయాలని, ప్రారంభించనున్న బిఎంసియుల పరిధిలోని రైతుల బ్యాంక్ ఖాతాలను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. త్వరలో ప్రారంభించనున్న 11 మండలాల్లో గల బిఎంసియుల పరిధిలో రైతుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో డెయిరీ డెవెలప్‌మెంట్ అధికారి రవిచంద్రన్, డిసిఒ బ్రహ్మానంద రెడ్డి, డిసిసిబిఏ జీఎం సురేష్ బాబు, పశుసంవర్ధక శాఖ అధికారులు ఆరిఫ్, చంద్రశేఖర్ అమూల్ ప్రతినిధి నవీన్ తదితరులు పాల్గొన్నారు.










