Sep 14,2023 22:30

ప్రజాశక్తి-కలక్టరేట్‌ (కృష్ణా) : బూత్‌ లెవెల్‌ అధికారుల్లో ఎవరైతే పనిలో నిర్లక్ష్యం వహిస్తారో వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్‌ పి. రాజాబాబు బూత్‌ లెవల్‌ ఆఫీసర్లను హెచ్చరించారు. గురువారం స్థానిక జీ కన్వెన్షన్‌ హాల్లో 75 - మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల జాబితా గురించి బూత్‌ లెవెల్‌ అధికారులు, సూపర్వైజర్స్‌ తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఎన్నికల విధులు ఉద్యోగ జీవితంలో అన్నిటికన్నా ముఖ్య ప్రాధాన్యత గల పని అని, అది సంవత్సరంలో ఒకసారి మాత్రమే చేసే పని అని గమనించాలన్నారు. బూత్‌ లెవెల్‌ అధికారులు ఎలక్ట్రోరల్‌ జాబితాని అప్డేట్‌ చేయాలని, డెలిషన్‌, అడిషన్‌, షిఫ్టింగ్‌ చేయడం అనేది సాధారణ విషయమని కలెక్టర్‌ అన్నారు ఈనెల 15వ తేదీతో పోర్టల్‌ నిలిచిపోనుందని, జిల్లాలో జరుగుతున్న ఫోటో ఓటర్ల జాబితాల ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమం వేగవంతంగా జరగాలన్నారు. కొత్త ఓటర్ల నమోదుకు వచ్చిన ఫారం-6 వివరాలు ఫారం-8 లిస్టులో అప్లోడ్‌ చేయవలసి ఉంటుందన్నారు. 201 పోలింగ్‌ స్టేషన్‌ ఉన్న మచిలీపట్నం నియోజకవర్గంలో బి ఎల్‌ వో లు మందకోడిగా పనిచేస్తున్నారన్నారు. ఫారం-6 అధిక సంఖ్యలో వచ్చిన సందర్భాల్లో సమగ్ర పరిశీలన జరపాలన్నారు. ఓటరు షిఫ్టింగ్‌, డెత్‌, చిరునామా మార్పు, ఇతర మార్పు చేర్పులు, గానీ కొత్త ఓటరు నమోదును బి.ఎల్‌.ఓ లు సత్వరమే ఓటరు జాబితాలో అప్‌ డేట్‌ చేయాలన్నారు.ఈ కార్యక్రమాన్ని కేంద్ర ఎన్నికల సంఘం నేరుగా పర్యవేక్షిస్తున్నదన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పి.వెంకటరమణ, డిప్యూటీ కలెక్టర్‌ నారాయణరెడ్డి, రిటర్నింగ్‌ అధికారి, మచిలీపట్నం డివిజన్‌ ఆర్డిఓ ఐ కిషోర్‌, ఏ ఈ .ఆర్‌.ఓ లు తాహిసిల్దార్‌ శ్రీవిద్య, ఆర్‌ ఐ యాకూబ్‌ తదితరులు పాల్గొన్నారు.