Nov 22,2023 00:07

ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ డాక్టర్ పోల భాస్కర్
ప్రజశక్తి - చీరాల
బిఎల్ఓలు క్షేత్రస్థాయిలో సక్రమంగా పనిచేస్తే ఓటర్ల జాబితా పక్కాగా ఉంటుందని ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ డాక్టర్ పోల భాస్కర్ చెప్పారు. జిల్లాకు ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్‌గా నియమితులైన ఆయన మంగళవారం తొలిసారిగా జిల్లాలో పర్యటించారు. చీరాల పట్టణం 9వ వార్డులోని సెయింట్ మార్క్స్ లూధరన్ జూనియర్ కళాశాల ప్రాంగణంలోని 98వ పోలింగ్ కేంద్రాన్ని, పర్చూరు నియోజకవర్గంలోని చిన్నగంజాం మండలం కడవకుదురు అంగనవాడి పాఠశాలలోని పోలింగ్ కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో దివ్యాంగుల కొరకు ర్యాంప్, రైలింగ్ నిర్మాణాలను పరిశీలించారు. ఓటర్ల జాబితా నుంచి మృతుల పేర్లను తొలగించే ప్రక్రియను నిశితంగా పరిశీలించారు. అందుకు సంబంధించిన దస్త్రాలను తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించారు. చీరాలలో 280పోలింగ్ కేంద్రాలు ఉండగా ఒక లక్ష 97 వేల 532 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. 98నెంబర్ పోలింగ్ కేంద్రంలో 1,266మంది ఓటర్లు ఉండగా అందులో 614మంది పురుష ఓటర్లు, 656మంది మహిళ ఓటర్లు ఉన్నారని తెలిపారు. మృతుల ఓటర్ల తొలగింపు, మార్పులు, చేర్పులకు సంబంధించిన దస్త్రాలను పరిశీలించారు. నూతన ఓటర్ల దరఖాస్తుల నమోదు, ఓటరు పేర్లు చేర్పులు, చిరునామాల మార్పులు విధివిధానాలపై కచ్చితంగా అవగాహన ఉండాలని చెప్పారు. బాధ్యతతో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని అధికారులకు సూచించారు. ఓటు హక్కు విలువ గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఓటర్ల నుంచి దరఖాస్తులు వచ్చేలా చైతన్య పరచాలన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిందని పొరపాట్లు, తప్పులు చేయరాదని అన్నారు. ఫిర్యాదు దారుడికి, సంబంధిత కుటుంబ సభ్యులకు ముందస్తుగా నోటీసులు ఇవ్వాలని అన్నారు. ఆయన వెంట జిల్లా రెవెన్యూ అధికారి పి వెంకటరమణ, ఆర్డీఓ పి సరోజినీ, మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి, తహశీల్దారు జె ప్రభాకరరావు, పర్చూరు ఈఆర్ఓ పివి నారాయణ, తహశీల్దారు పార్వతి ఉన్నారు. సమాచారం అందుకున్న పర్చూరు వైసిపి ఇన్చార్జ్ కృష్ణమోహన్ చిన్నగంజాం చేరుకుని రోల్ అబ్జర్వర్ ను కలసి వినతిపత్రం అందించారు.