Oct 21,2023 22:59

బిఎల్‌ఎం సిమెంట్‌ కంపెనీలో పరస్పర దాడులు

బిఎల్‌ఎం సిమెంట్‌ కంపెనీలో పరస్పర దాడులు
- పలువురి కార్మికులకు గాయాలు.. ఆస్పత్రికి తరలింపు
ప్రజాశక్తి -సత్యవేడు: సిమెంటు డస్ట్‌ పంటలపై పడుతోందని ఓ రైతు ప్రశ్నించడంతో అది చివరకు దాడుల వరకు వెళ్లింది. ఈ సంఘటన తిరుపతి జిల్లా సత్యవేడు మండలం తొండుగు గ్రామానికి సమీపంలో నడుస్తున్న బి ఎల్‌ఎం సిమెంటు కంపెనీ వద్ద శనివారం చోటు చేసుకుంది. బిఎల్‌ఎం సిమెంట్‌ కంపెనీకి పక్కనే కొందరు రైతులు పంటలను సాగు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సిమెంట్‌ తయారీ కంపెనీ నుంచి సిమెంటు ధూళి పంటలపై పడడంతో సంబంధిత రైతు మునికష్ణయ్య ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలోనే కంపెనీ వద్దకు వెళ్లి సిమెంట్‌ కంపెనీ నుంచి వెదజల్లుతున్న ధూళిపై అక్కడ కార్మికులను మునికష్ణ నిడదీశారు. దీంతో కంపెనీలో పని చేస్తున్న తమిళనాడు ఫాదర్వేడు గ్రామానికి చెందిన కార్మికుడితో మునికష్ణ వివాదం ఏర్పడింది. ఇరువురు మధ్య మాట మాట పెరగడంతో పరస్పర దాడులకు తెగబడి కొట్టుకున్నారు. దీంతో గాయపడ్డ అయితే మునికష్ణయ్య గ్రామానికి చేరుకుని మళ్లీ కొందరు అనుచరులతో కంపెనీ వద్దకు వెళ్లి దాడులకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలోనే ఇరు గ్రూపులకు సంబంధించిన కొందరు గాయపడ్డారు. గాయపడ్డ కంపెనీకి సంబంధించిన కార్మికుల పలువురుని చికిత్స కోసం తమిళనాడు ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది. దీనిపై తొండుగులి గ్రామానికి చెందిన బాధిత రైతు మునికష్ణయ్య స్థానిక పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇదే తరహాలోనే కంపెనీ యాజమాన్యం కూడా పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చినట్లు తెలిసింది. ఏదేమైనా దీనిపై పోలీసు అధికారులు విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సి ఉంది.