Apr 10,2022 12:56

నాలో జవాబు లేని ప్రశ్నలు ఎన్నో
నాలో నేను చిక్కుముడులు విప్పుకుంటూ
నా జీవితం తుది శ్వాసకు దగ్గరగా
రోజురోజుకూ క్షీణించిపోయే మృత శరీరం

నా పిల్లలు నాకేమిచ్చారనే దానికంటే
ఇంకా వాళ్లకేమివ్వాలో లోలోపల ఎన్ని ఆలోచనలో
బాధలు నుండి విముక్తి పొందిన భార్య
సతమతమవుతున్న బంధాలను కలిపే శక్తిలేక
కన్నీళ్లింకిన కళ్లు మూసి
నన్ను వొంటరివాడ్ని చేసింది

కొడుకేమో కెనడాలో
అమెరికాలో కూతురు
వాళ్ల వాళ్లకి ఇద్దరిద్దరు పిల్లలు
నన్ను చూడ్డానికి వస్తారేమోనని
ప్రతి యేడాది ఎదురు చూసి చూసి
గద్గద కంఠంలో స్వరం పెకలని మాటలు
లోలోపలే దిగమింగుకుంటుంటే
ఎండిపోయిన గొంతులో నరాల శబ్దాలెన్నో


నాకెంత ఆశో కదా
మా పిల్లల పిల్లల్ని చూడకుండా
కనుమూయకూడదని నిరంతర తపస్సు
ఊళ్లో నేనొక్కడినేనని అనుకున్నా
పెద్ద వేపచెట్టు కింద అరుగుపై
నాలాగే ఎదురుచూసే తండ్రులెందరో
ఆశలు చావకుండా ఎదురుచూస్తున్నారు

ఈ వృద్ధాప్యం సహకరించకపోయినా
ఈ శరీరాకృతి దృఢంగా లేకపోయినా
కంటిచూపు దూరం మసకబారుతున్నా
ఓపికగా లేని శక్తి పుంజుకుని
బిడ్డల క్షేమం కోసం నాలోని నేను
ప్రతిరోజూ పోరాటంతో పోరాడుతూ
విజయ సంకేతానికి జెండాగా మారతా
 

దాసరి సుబ్రహ్మణ్యేశ్వర రావు
94930 33534