'ఒక్కపూట అన్నం కోసం ఎదురు చూడటం/ జానెడంత ఊపిరికోసం చేయిచాచడం/ కడుపు కాలి కాలి ఇక్కడ బూడిద అవుతున్నా/ మనిషి అన్నవాడికి మనసే లేకపోయెనన్నా/ వున్నవాడు కొంచెం ఇస్తే లేనివారే వుండరే/ కళ్లు తెరిచి చూడు దేవుడా అందరు నీ పిల్లలే...' బిచ్చగాడు సినిమా లోని పాట ఇది. మన దేశంలో బిచ్చగాళ్ల పరిస్థితి ఎప్పుడూ దైన్యమే. పుట్టుకతోనే ఎవరూ బిచ్చగాళ్లు కాదు. కావాలని ఎవరూ బిచ్చగాళ్లుగా మారరు. ఏళ్ల తరబడి మందిరాలు, దేవాలయాల మెట్లపై పడిగాపులు పడివున్నా... ఏ దేవుడూ వీరిని పట్టించుకోడు. పాలకులు బిచ్చగాళ్లను దేవుళ్లకు వదిలేశారు. ఈ వ్యవస్థ తయారుచేసిన ఒక హేయం ఇది. 'దేశంలోకి వచ్చి ఆకలి అని ఏడిస్తే.../ ఫుట్‌పాత్‌లు చూపిస్తారు... పొలాలుకాదు' అంటాడు గుంటూరు శేషేంద్రశర్మ. ఆకలి అని కడుపు చూపితే... అడుక్కోమని బొచ్చె చేతికిస్తారు తప్ప... పని చూపించరు. పునరావాసం కల్పించరు. బిల్‌క్లింటన్ ఉమ్మడి రాష్ట్రంలో పర్యటించిన సందర్బంలో... ఆయన పయనించే మార్గంలో బిచ్చగాళ్లు లేకుండా ఫుట్‌పాత్‌లన్నీ ఖాళీ చేయించారు. ఊరవతలకు తోలేసారు. ఆ మార్గానికి ఇరువైపులా మురికివాడలు, చిన్నచిన్న ఇళ్లు కనిపించకుండా రంగురంగుల తెరలను కట్టించిన ఘనత మన పాలకులది. అందుకే అంటాడు తిలక్... 'మానవత లేని ఈ లోకాన్ని స్తుతింపలేను/ మానవునిగా శిరసెత్తుకుని తిరగలేను' అని.
'బిచ్చగాళ్లు, నివాసాలు లేనివారు, దేశదిమ్మరులు బహిరంగ ప్రదేశాల్లో, ట్రాఫిక్ జంక్షన్‌ల వద్ద యాచన చేయకుండా నిరోధించాలి' అంటూ ఇటీవల సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం... బిచ్చగాళ్లను నిర్బంధించాలన్న పిటిషనర్ వాదనను పరిగణలోకి తీసుకోలేమని, బిచ్చగాళ్లను వీధుల్లోకి రానీయకుండా చూడాలన్న ఉన్నత వర్గాల దృక్పథాన్ని తాము వ్యక్తం చేయడం లేదని వెల్లడించింది. పేదరికం కారణంగా ఈ సమస్య ఏర్పడుతుందని.. ఇది రాజకీయ -సామాజిక సమస్య అని, విద్య, ఉపాధి లేనప్పుడు కొందరు జీవనోపాధి కోసం వీధుల్లో యాచిస్తుంటారని... దీంతో వారిని తరిమేయాలన్న ఆదేశాలను కోర్టు జారీ చేయలేదని స్పష్టం చేసింది. అంతేకాదు... కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో వారికి వ్యాక్సినేషన్, ఆహారం, ఆశ్రయం కల్పించాలని నోటీసులు జారీ చేస్తామని కూడా కోర్టు తెలిపింది. వాస్తవానికి 2011 జనాభా లెక్కల ప్రకారం... దేశంలో 4,13,670 మంది బిక్షగాళ్లు వున్నారు. బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ వరుసగా మొదటి మూడుస్థానాల్లో వున్నాయి. ఎ.పి లో 30,218 మంది వున్నారు. ఈ పదేళ్లలో లెక్కలు చాలానే మారి వుంటాయి. ముఖ్యంగా ఈ రెండేళ్ల కరోనా కాలంలో ఈ సంఖ్య రెట్టింపు అయినా ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. పేదరికం, ఆకలి తీవ్రస్థాయిలో పెరిగిందని ఇప్పటికే అనేక సర్వేలు వెల్లడించాయి.
'బిడ్డల పాలకై బిచ్చమెత్తు దేశంలో/ రాళ్లకు పాలిచ్చు కథ నశించునదెన్నడో/ పేడకు బొట్టెట్టి దైవమని పూజించువారు/ పేదను గుర్తించగ మారబోవునదెన్నడో'... అంటాడు ముత్తువేల్ కరుణానిధి. ఇది వ్యవస్థలోని లోపం. ఈ సమాజాన్ని పట్టి పీడిస్తోన్న దైన్యం. దశాబ్దాలుగా అమలులో వున్న '1959 బొంబాయి బిచ్చగాళ్ల నిరోధక చట్టం'ను ఆసరా చేసుకుని నేటికీ బిచ్చగాళ్లను ఊరవతలకు తరిమేయాలనే చూస్తున్నారు. పునరావాసం కల్పించకపోగా, సాటి మనుషులుగా కూడా గుర్తించలేకపోతున్నారు. వారిని ఈ సమాజం నుంచే వెలివేయాలని చూస్తున్నారు. కానీ, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ఈ దేశంలో ప్రతి ఒక్కరికీ జీవించే హక్కు వుంది. ఈ స్వేచ్ఛను కాదనే హక్కు ఎవరికీ లేదు. ఈ దోపిడీ వ్యవస్థను నిర్మూలించడానికి బదులు, ఈ వ్యవస్థలోని కుళ్లును ప్రక్షాళన చేయడానికి బదులు, పేదలు, బిక్షగాళ్లు లేని దేశంగా మార్చడానికి బదులు.... అసలు వారిని నగరాలనుంచే పంపేయాలన్న వికృత చేష్టలు మానవత్వానికి... మనిషితనానికి మాయని మచ్చ. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించిన రీతిలో దేశంలోని యాచకులందరికీ ఆహారం, ఆశ్రయం, కల్పించాలి. వ్యాక్సినేషన్ ఇవ్వాలి. అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు కార్యాచరణకు పూనుకోవాలి.










