Nov 03,2023 00:38

సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న విశాఖ జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున

ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ : సింహాచలం- అడవివరం బిఆర్‌టిఎస్‌ రోడ్డు భూనిర్వాసితుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జున చెప్పారు. భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జివిఎంసి కమిషనర్‌ సిఎం.సాయికాంత్‌ వర్మతో కలిసి సింహాచలం- అడవివరం భూ నిర్వాసిత సమస్యపై విఎంఆర్‌డిఎ కార్యాలయంలో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మల్లికార్జున మాట్లాడుతూ భూ నిర్వాసితులకు ఇళ్ల నిర్మాణం, టిడిఆర్‌లు అందించడంలో సత్వర న్యాయం చేస్తామని తెలిపారు.
భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ బిఆర్‌టిఎస్‌ రోడ్డు నిర్మాణానికి స్వచ్ఛందంగా స్థలాలు ఇచ్చిన వారిలో 60 శాతం పైబడి ఇళ్లు, ఇంటి స్థలం కోల్పోయిన వారికి ప్రభుత్వం తరుపున ప్రత్యామ్నాయ మార్గంలో ఇళ్ల నిర్మాణం చేపట్టి అందివ్వనున్నట్లు తెలిపారు. స్థలం ఇచ్చిన వారికి త్వరలో టిడిఆర్‌లు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో విఎంఆర్‌డిఎ సిబ్బంది, బిఆర్‌టిఎస్‌ బాధితులు పాల్గొన్నారు.