Jun 20,2021 11:55

తాను నాటిన విత్తు
మొలకెత్తి
ఆకాశానికి కొమ్మలు చాస్తూ
ఎదుగుతున్నప్పుడు
నాన్న
నవ్వుతూ కేరింతలు కొట్టే
పసిహృదయం

నిటారుగా నిలబడాలని
పడి లేస్తున్నప్పుడల్లా
నాన్న
దేహానికి దన్నిచ్చే
వెన్నెముక

నిన్నటి స్వేదం
నెల నెలా ఒకటో తారీఖున
బ్యాంకు ఖాతాలో జమ అవుతున్నప్పుడు
నాన్న
కృతజ్ఞతతో మన కంటి చివర మెరిసే
కన్నీటిముత్యం

సుఖమో సౌకర్యమో
గెలుపులోని ఆనందమో
ఏదీ నేరుగా ఇవ్వడు
నాన్న
ఒక్కొక్క దీవిలో ఒక్కొక్క నిధిని దాచి
మనల్నే వెతుక్కోమనే సోక్రటీసు

యువరాజుకో యువరాణికో
పట్టాభిషేకం చేసేక
హుందాగా పక్కకు తప్పుకునే
సామ్రాట్టు

మనకు నచ్చినట్టుగా
బాణీ కట్టుకున్న మన జీవితంపాటకు
తనను తాను గాలించుకొని
అద్భుతమైన పదాలను సమకూర్చి పెట్టే
అసామాన్య లిరికిస్ట్‌!

నాన్న దేవుడన్న స్వప్నంలోంచి
నాన్నా మనిషేనన్న స్పృహ వరకూ
నాన్నకేం తెలుసన్న నిర్లక్ష్యం నుంచి
నాన్నొక అద్భుతమన్న నిజం వరకు
వలయాలు వలయాలుగా సాగే
ప్రయాణంలో
నాన్న ఒక బహురూపి!

- సాంబమూర్తి లండ.
96427 32008