Feb 27,2022 11:14

ఆఫీసులో పనిచేసుకుంటున్న అభిజిత్‌ పక్కనుంచి విరబూసిన మల్లెతీగ వయ్యారంగా నడచినట్లు, సుగంధ పరిమళం గదిలో అలలు అలలుగా కదిలినట్లనిపించింది. కారిడార్‌ మీదుగా కదిలిపోతున్న పాలరాతి శిల్పాన్ని అసంకల్పితంగా అనుసరించాడు.
'ఏమిటి సార్‌. సీటుకి ఫెవికాల్‌ రాసుకుని కూర్చునే ప్రవరాఖ్యులు దారి తప్పారు?' చెల్లెలు శిరీష వెటకారంగా ప్రశ్నించింది.
'అప్పుడప్పుడు సీటులోంచి లేచి నడవమని యోగా సార్‌ చెప్పారు'
'యోగా గురువుగారి మాట ఇప్పుడే గుర్తొచ్చిందా?' చిలిపిగా నవ్వింది.
భవిష్యత్‌ అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని, అనవసరపు వాదన వద్దనుకుని మౌనంగా సీట్‌ దగ్గరకు వెళ్లిపోయాడు. క్రితంరోజు తండ్రితో జరిగిన ఒప్పందం గుర్తుకొచ్చింది. సంవత్సరంలోపు మనసుకు నచ్చిన అమ్మాయిని ఎంచుకోవాలి. లేదంటే తల్లిదండ్రులు చూపించిన ఏ అమ్మాయికైనా మూడుముళ్లు వెయ్యాలి.
నిన్న తండ్రికి మాటివ్వడం, ఈరోజు అమ్మాయి నచ్చడం యాదృచ్చికమైనా అభిజిత్‌కు ఆనందమనిపించింది. సాయంత్రం ఇంటికెళ్లేందుకు రోజులాగే అభిజిత్‌ కారెక్కింది శిరీష. మనసు దోచిన అందమైన అమ్మాయి పక్కనున్నా చూసి కూడా చూడనట్లు కారు స్టార్ట్‌ చేశాడు.
'కొత్తగా చేరిన రాగసుధని మనతో....?'
'ఆ అమ్మాయి పేరు రాగసుధా.. బాగుంది' అభిజిత్‌ మొహంలో మెరుపు గమనించింది శిరీష.
'పేరేనా, అమ్మాయి కూడానా'.
'పేరు, ఫిగరు' నాలిక కరుచుకున్నాడు.
'నువ్వు కోరుకున్నట్లు నల్లత్రాచులాంటి జడ, చేపల్లాంటి కళ్లు, లక్కపిడతలాంటి మూతి, కొటేరు ముక్కు...'
'అవునా? నేను సరిగా చూడలేదు. రేపు చూసి చెపుతానులే'
'ఒరేరు... నా దగ్గరా నీ వేషాలు? నువ్వు చూశావని తెలుసు. వెంటపడ్డావని కూడా తెలుసు.'
'సరే శిరీష, ఆ అమ్మాయి నాకు నచ్చింది' రెండు చేతులెత్తి నమస్కరించాడు.
'ఐతే అల్‌ ది వెరీ బెస్ట్‌' భరోసా ఇచ్చిన శిరీష ఇల్లు రావడంతో కారు దిగిపోయింది.

                                                                            ***

అభిజిత్‌ ఫోన్‌ రింగయ్యింది.
'అభి! కెన్‌ యు కం టు మై కేబిన్‌' సిఇఓ అడిగాడు.
'షూర్‌ సార్‌' అంటూనే సిఇఓ రూమ్‌ వైపు కదిలాడు. రూంలోకెళ్లిన అభిజిత్‌ కుర్చీలోని వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాడు.
'ఈమె రాగసుధ. నిన్ననే రిపోర్ట్‌ చేసింది' అంటూ పరిచయం చేశాడు.
ఇద్దరూ విష్‌ చేసుకున్నారు.
'మన కంపెనీకి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు వచ్చింది. నువ్వు ప్రాజెక్టు టీమ్‌ లీడర్‌. నీకు రాగసుధ సపోర్ట్‌ చేస్తుంది. ప్రాజెక్టు ఇన్‌ టైంలో పూర్తిచేయాలి. భవిష్యత్తులో వాళ్ల నుంచి మంచి బిజినెస్‌ వస్తుంది. అల్‌ ది బెస్ట్‌' ప్రాజెక్టు ఫైల్‌ అందించి అభిజిత్‌తో కరచాలనం చేశాడు.
'ఓకే సార్‌!' అంటూ బైటకొచ్చిన అభిని అనుసరించింది రాగసుధ.
'చూడండి మిస్‌ రాగసుధ..' విన్నారుగా.
'విన్నాను సార్‌...' ఇంకా ఏదో చెప్పబోతుంటే ఆపాడు.
'నన్ను సార్‌ అనక్కర్లేదు. అభిజిత్‌ అనండి. ఫ్రెండ్లీగా ఉంటేనే ఫ్రీగా మనసులో విషయం షేర్‌ చేస్తారు'. దగ్గరయ్యే ప్రయత్నంలో మాట్లాడాడు. రాగసుధ అర్థం కానట్లు చూసింది.
'ఐ మీన్‌, ప్రాజెక్టు గురించి నిర్మొహమాటంగా డిస్కస్‌ చేస్తారని'. ఏమార్చే ప్రయత్నంలో మాట మార్చాడు.
ప్రాజెక్టు మొదలైనప్పట్నుంచీ అభిజిత్‌ పట్టుదల, అంకితభావం చూసి సుధకి గౌరవం ఏర్పడింది. పని నేర్చుకోవడంలో సుధ శ్రద్ధ, చురుకుతనం అభిని అకట్టుకున్నాయి. ఆమె వినయం, విధేయత అభిజిత్‌ మనసుకి దగ్గర చేశాయి. పరస్పరం వాళ్లు పంచుకున్న అభిరుచులు ఇద్దర్నీ మంచి మిత్రులుగా మార్చాయి.
'అభి, నువ్వు గ్రేట్‌ రా. నీ ప్రాజెక్టులోకి సుధ రావడం, చాలా తక్కువ కాలంలో దగ్గర అవడం చూస్తోంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. నోరు విప్పితే చాలు ''అభి'' నామస్మరణే'. శిరీష ఫోన్లో చెబుతోంది. అభిజిత్‌ మాట్లాడలేదు. అంటే ఏదో ధీర్ఘంగా ఆలోచిస్తున్నాడని శిరీషకు అర్థమైంది.
'ఏమిటిరా! సీరియస్‌గా ఆలోచించేది రాగసుధ గురించేనా?'
'అవును, అంతా బాగానే మాట్లాడుతుంది. పెళ్లికి ఒప్పుకున్నట్లే అనిపిస్తోంది. తల్లి కావడం మీద పెద్ద ఆసక్తి లేదంటుంది. ఎందుకో అర్థం కావడం లేదు'.
'పెళ్లయితే మారుతుందేమోలే?'
'ఆమె మారకపోతే?' అనుమానం వ్యక్తం చేశాడు.
'మనం మారుద్దాం' నమ్మకంగా చెప్పింది శిరీష.
'అతి విశ్వాసంతో ముందుకెళ్లి మనం మార్చలేకపోతే, అమ్మానాన్న బాధపడతారుగా? పెద్దవాళ్లు వంశాభివృద్ధి కోరుకుంటారు. మనవలతో ఆడుకోవాలని ముచ్చట పడతారు. పిల్లల్ని కనడం ఇష్టంలేదని తెలిస్తే పెళ్లికి ఒప్పుకోరు. రేపు పొరపాటున పిల్లలు పుట్టకపోతే దానికి సుధే కారణమని మనస్పర్ధలకి దారితీసే అవకాశమూ ఉంటుంది' అంటూ మనసులో మాట చెప్పాడు.
'అమ్మానాన్నలకు ఈ విషయం చెప్పకపోతే?' అంది శిరీష.
'అంతకంటే మోసం మరొకటి ఉండదు. స్వేచ్ఛనిచ్చిన తల్లిదండ్రుల దగ్గర విషయం దాస్తే మనల్ని మనం మోసం చేసుకున్నట్లే'.
అభిజిత్‌కి మరో కాల్‌ వస్తోంది.
'బాస్‌ కాల్‌ చేస్తున్నాడు. మళ్లీ మాట్లాడతా.' ఫోన్‌ పెట్టేశాడు.

                                                                           ***

నిద్రలేని అభిజిత్‌ చింతనిప్పుల్లాంటి కళ్లతో ఆఫీసుకొచ్చాడు.
'అభి! ఏమైంది మొహం అలసటగా ఉంది'. సుధ సీట్‌ దగ్గరకొచ్చి ఆందోళనగా అడిగింది.
'శిరీష కొడుక్కి రాత్రి ఒంట్లో బాగోకపోతే హాస్పిటల్లో చేర్పించాం'. మాట నీరసంగా వస్తోంది.
'ఇప్పుడు ఎలాగున్నాడు. నువ్వు హాస్పిటల్‌కి వెళ్తే చెప్పు. నేనూ వస్తాను'.
లంచ్‌ బ్రేక్‌లో ఇద్దరూ హాస్పిటల్‌కి బయల్దేరారు. అభిజిత్‌ మాట్లాడకపోవడంతో సీట్లో ఇబ్బందిగా కదిలింది.
'ఏమిటి అభి, అంత డల్‌గా ఉన్నావు. పిల్లాడికి తగ్గిపోతుందిలే'.
'రాత్రి నుంచి శిరీష ఒకటే ఏడుపు. శిరీష నాకు పేరుకే కజిన్‌. సొంతచెల్లెలుగానే చూస్తా. శిరీష ఏడిస్తే తట్టుకోలేను' కంటి నుంచి అప్రయత్నంగా వచ్చే కన్నీటిని తుడుచుకున్నాడు.
'సుధ! నిన్ను పర్సనల్‌ ప్రశ్న అడగొచ్చా?' అడగమన్నట్లు తల ఊపింది.
'నీకు తల్లి కావడం ఎందుకు ఇష్టంలేదు?'
'శిరీషలా ఇలాంటి బాధలు పడలేక వద్దనుకుంటున్నాను' టక్కుమని చెప్పింది.
'నాణేనికి రెండువైపులున్నట్లే జీవితంలో మంచిచెడులుంటాయి. పిల్లల విషయంలోనూ అంతే... వాళ్లు చేసే ముద్దు పనులకి ముచ్చటపడతాం. వాళ్లకి నలతగా ఉంటే కలతపడతాం. కింద కాల్లో ముల్లు గుచ్చుకుంటే పైన కంట్లో నీళ్లతో కలవరపడతాం. పిల్లలకి ఒంట్లో బాగోకపోతే తల్లెందుకు తల్లడిల్లిపోతుంది? దానికి సమాధానం లేదు. నిజానికి తల్లి, బిడ్డ వేర్వేరు కాదు. తొమ్మిది నెలల తర్వాత తల్లిచెట్టు నుంచి వేరుపడి పెరిగే కొమ్మే బిడ్డ'.
'నాకెందుకో తొమ్మిది నెలలు ఆపసోపాలు పడుతూ, పెద్దపొట్టతో అందరి ముందు తిరగడం ఇష్టముండదు. పిల్లలకొచ్చే రోగాలు, రొష్టులు భరించలేను. ఉమ్ములు, ఉచ్చలు తీస్తూ బతకలేను' నిర్మొహమాటంగా చెప్పింది.
'మీ అమ్మగారు నీలాగే ఆలోచించుంటే నువ్వు ఉండేదానివా? ఇలా మాట్లాడేదానివా? ఆడవాళ్లు పురిటినొప్పులకు భయపడితే సృష్టి ఆగిపోయి సమస్త ప్రపంచం నిర్వీర్యమైపోతుంది. స్త్రీజన్మకు పరిపూర్ణత సిద్ధించాలంటే తల్లి కావాలసిందే' సూటిగా చెప్పాడు.
రింగైన ఫోన్‌ తీసిన సుధ, 'బ్రేక్‌ ఫాస్ట్‌ చేశాను. గంటలో లంచ్‌ చేస్తాను. అంతేనా?' విసురుగా పెట్టేసింది.
'ఫోన్‌ చేసింది మీ అమ్మగారేనా'.
'అవును ఆవిడే. ఫోన్‌ చేస్తే చాలు. ఒకటే పిచ్చిప్రశ్న. అన్నం తిన్నావా? టిఫిన్‌ తిన్నావా? మరో మాట ఉండదు' విసుగ్గా మొహం పెట్టి చెప్పింది.
'అవును, పిచ్చిప్రశ్నే... పిల్లలు తిన్నారో లేదోనని తల్లడిల్లిపోయే తల్లులు పిచ్చోళ్లే. మీ అమ్మగారు కాకుండా ఇంకెవరైనా తిన్నావా అని అడుగుతారా? అడగరు. ఎందుకంటే వాళ్లు తల్లులు కాదు కాబట్టి. నిస్వార్థంగా పిల్లలకోసం పాకులాడేది తల్లి ఒక్కత్తే...' అభిజిత్‌ మాటలు ఆమెను ఆలోచనలోకి నెట్టాయి.
కారు దిగి హాస్పిటల్‌ లోపలకి వెళ్లారు. హాస్పిటల్‌లో శిరీషని చూసి సుధ స్థాణువులా నిలబడిపోయింది. ఒక్కరోజులో శిరీషలో ఎంత మార్పు! ఆఫీసులో ఎంతో హుషారుగా ఉండే శిరీషేనా! మొహం పీక్కుపోయింది. కళ్లు గుంటల్లో గోళీల్లా ఉన్నాయి. పలకరించే దైర్యం లేక సుధ అక్కడే ఆగిపోయింది. ఇంతలో బైటకొచ్చిన డాక్టర్‌ దగ్గరకు ఆత్రంగా ఎదురెళ్లింది శిరీష.
'బాబు జ్వరం పూర్తిగా కంట్రోల్‌ అయ్యింది. ఈ రోజు అబ్జర్వేషన్‌లో ఉంటే మంచిది. రేపు ఇంటికి తీసుకెళ్లొచ్చు'. విషయం చెప్పి లోపలకి వెళ్లిపోయాడు డాక్టర్‌.
చీకటితో ముడుచుకుపోయిన ఆకాశం మెరుపులతో మెరిసినట్లు శిరీష మొహం వెలిగిపోయింది. అప్పటిదాకా కాంతిహీనంగా శిరీష కళ్లలో కొట్టుకుంటున్న ప్రాణాలు డాక్టర్‌ మాటతో దీపాల్లా వెలిగాయి. ఆనందం తట్టుకోలేక అభిజిత్‌ని పట్టుకుని ఏడ్చేసింది. శిరీషకు ధైర్యం చెప్పి ఆఫీసుకి బయల్దేరారు.
కారులో సుధ మౌనంగానే ఉంది. స్కూల్‌ చదివే రోజుల్లో టైఫాయిడ్‌ రావడం, ఆస్పత్రిలో చేర్చడం, అమ్మ పడ్డ ఆవేదన సుధకి గుర్తుకొచ్చాయి. ఆమెలో నిశ్శబ్ధం మార్పుకి సంకేతమనిపించింది. అభిజిత్‌ నమ్మకానికి నారు పోసింది.
ఇంటికెళ్లినా అభిజిత్‌ మాటలే నీడలా వెంబడిస్తున్నాయి. ఎంత వద్దనుకున్న ఆ మాటల వైపే ఆలోచనలు పోతున్నాయి. నిజంగా తల్లి కాకపోతే ఆడజన్మకు సార్ధకత లేదా? అలా ఆలోచిస్తోంటే ఎప్పుడూ తన కోసం తపించే తల్లి గుర్తుకొచ్చింది. 'అభి చెప్పింది నిజమే, నా ఆకలి గురించి ఆరా తీసేవాళ్లు అమ్మ ఒక్కత్తే కదా!' అని తట్టగానే సుధ తల్లికి ఫోన్‌ చేసింది.
'అమ్మా! నేను అన్నం తిన్నాను. నువ్వు తిన్నావా?' అని అడిగి ఫోన్‌ పెట్టేసింది.
ఆ క్షణం ఆమెకు మాటల్లో చెప్పలేని అనుభూతి కలిగింది. ఆమెలో మార్పుకు అంకురార్పణ జరిగిందని సంకేతం.

                                                                            ***

ప్రాజెక్టు విజయవంతంగా పూర్తిచేసినందుకు కంపెనీ హోస్ట్‌ చేసిన పార్టీలో 'గ్రే' కలరు సూట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలబడ్డ అభిజిత్‌ని మర్చిపోలేకపోతోంది రాగసుధ. అతనితో మాట్లాడితే ఎంతటి క్లిష్ట సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందనే నమ్మకం బలపడుతోంది. ఇంతలో కాలింగ్‌ బెల్‌ శబ్ధానికి బైటకొచ్చి తలుపు తీసింది.
'రాగసుధ గారికి కొరియర్‌ వచ్చింది.' బాక్స్‌ చేతికిచ్చాడు. బాక్స్‌ పెద్దబరువుగా లేదు. లోపల నుంచి మాత్రం అలికిడి వినిపిస్తోంది. ఆతృతతో డబ్బా తెరిచింది. మెల్లగా మూలుగుతూ బుజ్జి కుక్కపిల్ల బైటకొచ్చింది. దాన్ని చూడగానే ఎంతో సంబరంగా ఎత్తుకుని ఆనందపడిపోయింది రాగసుధ. డబ్బాలో కనిపించిన కాగితం తీసింది రాగసుధ.
'నీకు పెట్స్‌ ఇష్టమని తెలుసు. నీతో ప్రాజెక్టు పని నాకు మంచి జ్ఞాపకం. నా విసుగుని ఎంతో సహనంతో భరించావు. ప్రాజెక్టు విజయవంతంగా పూర్తికావడానికి సహకరించావు. ఆ మధుర క్షణాలు ఎప్పుడూ గుర్తుండాలని, మన స్నేహానికి చిరుకానుకగా బహుమతి. ఇది నచ్చకపోతే నిరభ్యంతరంగా తిరిగి పంపడానికి ఆలోచించకు. బంధం మరింత బలపడాలని కోరుకునే..'
అభిజిత్‌.
ఎంతో అందంగా ఉన్న కుక్కపిల్లని చూసుకుని మురిసిపోయింది. ఉత్తరాన్ని గుండెలకు హత్తుకుని హ్యాండ్బాగ్‌లో పదిలంగా దాచుకుంది. అదే విషయం అభిజిత్‌తో పంచుకుందామని ఫోన్‌ తీసేలోపు పెట్టెలోంచి బైటపడ్డ కుక్కపిల్ల ఫోన్‌ మీద ఉచ్చ పోసింది. చిరాకుగా దాన్ని దూరంగా నెట్టేసింది. మూలుగుతున్న కుక్కపిల్లని చూసి జాలిపడింది. తొందరపాటుకు మనసు బాధపడింది. పాతగుడ్డ తీసి ఫోన్‌ తుడుచుకుంది. నేల శుభ్రం చేసింది.
మర్నాడు ఆఫీసుకెళ్లిన సుధ, అభి సీట్‌ దగ్గరకు వెళ్లింది.
'అభి నువ్వు అనుకున్నట్లు నాకు పెట్స్‌, పిల్లలు ఇష్టమే. ఒళ్లో పెట్టుకుని ఆడడం సరదా. ఎన్నిగంటలైనా ఆడతా. సేవ చేయడమంటేనే కష్టం. స్నూపీ పనులు చేసేందుకు పనిపిల్లని చూస్తున్నా. ప్రస్తుతానికి ఆ తలనొప్పి నేనే భరిస్తా'. నిర్మొహమాటంగా చెప్పింది.
అభిజిత్‌కి కుక్కపిల్లకు స్నూపీ పేరు పెట్టినట్లు అర్థమైంది. ఆమెలో మార్పు రావాలని మనసులోనే కోరుకున్నాడు. ఇంతలో సీనియర్‌ అడ్మిన్‌ మేనేజర్‌ రేవతి మేడం స్వీట్స్‌తో వచ్చారు.
'ఫ్రెండ్స్‌, మా అమ్మాయి సివిల్‌ సర్వీసులో సెలెక్ట్‌ అయ్యింది'.
'గ్రేట్‌ మేడం, మా విషెష్‌ చెప్పండి. చూశావా సుధా! రేవతి మేడం పుత్రికోత్సాహం. మొహం మతాబులా వెలిగిపోతోంది. పిల్లలు లేకుంటే మేడంకి సంతోషం దక్కేదా?' చెవిలో చెప్పిన మాటతో తన ఆలోచనకి నిన్న నారు పోశాడు. ఈరోజు నీరు పోశాడు.
'దక్కుతుంది' అభి సీట్‌ ముందు కూర్చుంటూ చెప్పింది.
'ఎలాగా?'
'మనకడుపున పుట్టిన పిల్లలే అక్కర్లేదు. తెలివైన పేదపిల్లని పెంచుకుని చదివిస్తే వాళ్ల విజయం కూడా మనదేగా...' సమర్థించుకునే ప్రయత్నం చేసింది.
'నువ్వు నాటిన విత్తనం మొక్కై, పువ్వు పూస్తే వచ్చే ఆనందం, పక్కవాళ్ల మొక్కకు పువ్వు పూస్తే వస్తుందా? నువ్వు సాధించిన విజయాన్ని మీ అమ్మగారు ఆస్వాదించినట్లు పక్కింట్లో అమ్మాయి సాధిస్తే ఆస్వాదిస్తారా? తేడా ఉంటుందిగా' వివరంగా చెప్పాడు.
ఆ మాటలు వింటోంటే తనకు క్యాంపస్‌ సెలక్షన్‌ వచ్చినప్పుడు అమ్మ చేసిన హడావిడి గుర్తొచ్చింది. పొద్దుట నుంచి రాత్రి పడుకునే వరకూ ఒకటే ఆనందం. పనమ్మాయికి, పాలుపోసే పిల్లాడికి, పేపర్‌ వేసేవాడికి, చుట్టాలకి, పక్కవాళ్లకి, తెలుసున్నవాళ్లకి మొత్తం కమ్యూనిటీ అంతా మైకు లేకుండా చెప్పింది. ఆ రోజు ఆమెకు తల్లి ప్రవర్తన అతిగా అనిపించింది. ఇప్పుడు రేవతి మేడం మొహం చూస్తే అప్పటి తల్లి ఉత్సాహం వెనుక ఆనందం విలువ తెలుసుకుంది. ఆమె ముఖకవళికల్లో మారుతున్న రంగులు బట్టి అభిజిత్‌కి నీరు పోసిన నారు పైరుగా పెరుగుతోందని అర్థమైంది.
కొన్నినెలలు గడిచాయి. ఓ రోజు అనుకోకుండా సుధ ఫ్లాట్‌కి వెళ్లాడు అభిజిత్‌. స్నూపీని ఒళ్లో కూర్చోపెట్టుకుని బుజ్జగిస్తూ, నీళ్లు పోస్తోన్న సుధని చూశాడు. గారాలుపోతున్న స్నూపీని పసిపిల్లలా చూసుకుంటోంది. మురిపెంగా చూస్తున్న సుధలో అమ్మతనం కనబడింది.

                                                                          ***

ఆఫీస్‌ పని బిజీగా చేసుకుంటున్న అభికి సుధ నుంచి ఫోన్‌ వచ్చింది. ఫోన్‌ లిఫ్ట్‌ చేయగానే అవతలనుంచి మాటల్లేవు. ఏడుపొకటే వినిపిస్తోంది. 'హలో' అవతల నుంచి సమాధానం లేదు.
'సుధ, ఏమైంది. అంతా బాగున్నారా?' భయంగా అడిగాడు. ఏడుస్తూనే ఉంది.
'ఏడుపెందుకు?'
'స్నూపీకి దెబ్బతగిలింది. నేను లోపల పనిలో ఉండగా రోడ్‌ మీదకెళ్లింది. స్కూటర్‌ కింద పడింది. ఆ స్కూటర్‌ కుర్రాడి మీద పోలీసు కంప్లైంట్‌ ఇవ్వాలి. స్నూపీని హాస్పిటల్‌కి తీసుకెళ్లాలి. త్వరగా రా'.
'సరే! ఇప్పుడే వస్తున్నాను' హడావిడిగా బయల్దేరాడు అభిజిత్‌. సుధ ఇంటి గుమ్మం ముందు బిక్కుబిక్కుమంటూ భయంగా ఉన్న కుర్రాడిని చూస్తే స్కూటర్‌ కుర్రాడని అర్థమయ్యింది.
అభిజిత్‌ వచ్చిన అలికిడికి మొరుగుతూ ఎదురొచ్చింది స్నూపీ. స్నూపీ కోసం ఏడ్చి సుధ కళ్లు వాచిపోయాయి.
'స్నూపీ బాగానే ఉందిగా. ఆ అబ్బాయిని స్కూటర్‌ తాళం ఇచ్చి పంపించు'.
'లేదు, వాడ్ని పోలీసులకి అప్పజెప్పవలసిందే. ఇంకోసారి రాష్‌ డ్రైవింగ్‌ చెయ్యకుండా బుద్ధి చెప్పాల్సిందేే'.
సుధ చేతిలో తాళం తీసుకుని కుర్రాడికి ఇచ్చాడు. సుధ అలిగి పక్కన కూర్చుంది.
'చూడు సుధ. స్నూపీకి చిన్నదెబ్బ తగలగానే నువ్వు తల్లడిల్లిపోయావు. అప్పుడు ఆస్పత్రిలో నేను చూసిన శిరీష గుర్తుకొచ్చింది. దాని ఆటలకు, చేష్టలకు మురిసిపోతున్నావు. అప్పుడు నీలో రేవతి మేడం కనిపించింది. స్నూపీ కుక్కపిల్ల మాత్రమే. అనుమానం లేదు. విశ్వాసమైంది. మనం జంతువుల్ని ప్రేమిస్తే అవి మనల్ని ప్రేమిస్తాయనేది నిజం. చాలా తక్కువ టైంలో దానికి దగ్గరయిపోయావు. నిజంగా నువ్వు గ్రేట్‌. కుక్కకే చిన్నదెబ్బ తాకితే ఆవేదనపడే నువ్వు, పిల్లలకోసం ప్రాణలొడ్డే ఆరాటన నీలో ఉందని అర్థమయ్యింది'.
'అదికాదు అభి! చిన్నగా తాకింది కాబట్టి సరిపోయింది. అదే గట్టిగా తగిలి స్నూపీకి ఏదైనా జరిగుంటే, ఆ ఊహే తట్టుకోలేకపోతున్నా' మాటకే సుధ కన్నీటి ప్రాయమైంది.
'చూశావా. ఎప్పుడూ నీ ఆలోచనలన్నీ స్నూపీ చుట్టే తిరుగుతున్నాయి. దానికి కారణం నువ్వు ఇష్టపడి పెంచడం. నీక్కూడా ప్రేమగా పెంచే మనసుండడం. ప్రతి స్త్రీలాగే ఓర్పు, సహనం నీకూ ఉన్నాయి. లేనిపోని అపోహలతో బంగారు భవిష్యత్తుని దూరం చేసుకోకు. వాటి నుంచి బైటకు రా' సలహా చెప్పాడు. ఆమె మౌనంగా వింటోంది.
'స్నూపీ రావడానికి ముందు సుధకి, స్నూపీ వచ్చిన తర్వాత సుధకి తేడా ఉంది. ఆ మార్పు బాగా పరిచయమున్న నాలాంటి స్నేహితులకే తెలుస్తుంది'.
'అవును, నా ప్రాధాన్యతలు మారాయి. నాకు స్నూపీయే ప్రపంచమైపోయింది. సాయంత్రం నా కోసమే ఎదురుచూస్తుంది. రాగానే ప్రేమగా ఒళ్లో వాలిపోతుంది. నేను పెడితేకాని అన్నం తినదు. నేనే పడుకోబెట్టాలి. దానితో ఆడుకోవాలని అల్లరి చేస్తుంది. షికారుకి తీసుకెళ్లమని మారాం చేస్తుంది. నాకు తెలియకుండానే జీవితంలో భాగమైపోయింది. విడదీయలేని బంధమైపోయింది'.
'ఆ బంధమే కమ్మనైన అమ్మతనమంటే. స్నూపీ కోసం నువ్వే పసిపిల్లలా మారిపోయావు. దాన్ని పసిపిల్లలా సాకావు. కుక్కపిల్లనే కన్నబిడ్డలా చూసుకున్న నువ్వు పేగు తెంచుకుని పుట్టిన బిడ్డని పదిలంగా చూసుకుంటావని తేలిపోయింది' చాలా ఉద్వేగంగా చెప్పాడు.
'నిజమే, ఈ మార్పుకి కారణం నువ్వే అభి. నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం. ఐ లవ్‌ యు..' అంటూ సుధ అభిజిత్‌ గుండెల మీద వాలిపోయింది. చిగురేసిన ఆశ మహావృక్షంలా అభిజిత్‌ కంటిముందు కనిపించింది.

పెమ్మరాజు విజయ రామచంద్ర
98497 44161