
ప్రజాశక్తి-నర్సీపట్నంటౌన్:స్థానిక ఆర్‌సిఎం స్కూల్ ఆవరణలో వివిధ దళిత సంఘాల ప్రతినిధులతో కూడిన విదసం ఐక్యవేదిక సమావేశం నిర్వహిం చారు. ఈ సమావేశానికి ఐక్యవేదిక వ్యస్థాపకులు, ఏపి రాష్ట్ర కౌన్సిల్ కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట్రావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకట్రావు విధసం ప్రణాళికను ఉద్దేశాలను వివరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఒక్క తాటిపైకే రావాల్సిన సందర్భం వచ్చిందని తెలిపారు. బహుజనుల ఓట్లతో గెలిచిన ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయన్నారు. సంక్షేమ పథకాలను తీసివేసి అన్యాయం చేస్తున్నాయన్నారు. సైకాలజిస్ట్ డాక్టర్ రాజు మాట్లాడుతూ, బహుజనులపై దాడులు చేస్తూ భయానకమైన పరిస్థితులను సృష్టించి అన్యాయంగా హత్యలు చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆయన అన్నారు. దళితులందర్నీ ఒకే తాటిపైకి తీసుకొచ్చి హక్కుల కోసం పోరాటం చేద్దామని సంఘాల నాయకులు నిర్ణయం తీసుకున్నారు. అనంతరం డివిజన్ స్థాయి నూతన పాలకవర్గం ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో ప్రముఖ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.